విషాదం : పురస్కారం అందుకోవాల్సిన వలంటీర్

Village Volunteer Assassinated In Road Accident In East Godavari - Sakshi

ముమ్మిడివరం/అల్లవరం: ఉగాదికి ఉత్తమ పురస్కారం అందుకోవాల్సిన ఒక వలంటీర్‌ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోడి గ్రామానికి చెందిన నరసింహం (30) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన మూడేళ్ల పాప, సమీప బంధువు యార్లగడ్డ దుర్గారావుతో కలసి మురమళ్లలో గురువారం ఒక నిశ్చితార్థానికి వెళ్లారు. తిరిగి బైక్‌పై వస్తుండగా అమలాపురం నుంచి కాకినాడ వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహం తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

దుర్గారావు తీవ్ర గాయాలపాలై అమలాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వారి మధ్యలో కూర్చోబెట్టుకున్న పాపను దుర్గారావు పక్కకు విసిరేయడంతో సురక్షితంగా బయటపడింది. కాగా, వలంటీర్‌గా నరసింహం సేవలకు మెచ్చిన గ్రామస్తులు ఆయన భార్య దుర్గాభవానిని ఇటీవల ఏకగ్రీవంగా వార్డు సభ్యురాలిగా ఎన్నుకున్నారు. వలంటీర్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నరసింహానికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top