Vijayawada: దుర్గమ్మకు భారీగా దసరా ఆదాయం

Vijayawada: Durga Temple Earned Rs 16 Crore Revenue For Dasara - Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో రూ.16 కోట్ల మేర ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరో అంతస్తులో ఆమె సోమవారం విలేకరులకు ఉత్సవ ఆదాయ వ్యయాలను వివరించారు. 


హుండీ కానుకల ద్వారా రూ.9.11 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లు, ప్రసాదాల విక్రయాలతో రూ.2.48 కోట్లు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షలు, విరాళాలు ఇతరత్రా కలిపి రూ.16 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొవిజన్స్, ఇతర ఖర్చులకు రూ.10.50 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమా పాల్గొన్నారు.  


26 నుంచి కార్తిక మాసోత్సవాలు 

ఈ నెల 26 నుంచి నవంబర్‌ 23వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కార్తిక మాసోత్సవాలను వైభవంగా నిర్వహి స్తామని ఈఓ భ్రమరాంబ తెలిపారు. 23వ తేదీన ధనత్రయోదశి సందర్భంగా మహాలక్ష్మి యాగం, 24న దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తామన్నారు. 

25వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, 26 ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. నవంబర్‌ ఎనిమిదో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేసి మరుసటిరోజు ఉదయం పూజల అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 


నవంబర్‌ 4 నుంచి భవానీ మండల దీక్షలు

నవంబర్‌ నాలుగో తేదీ నుంచి భవానీ మండల దీక్షలు, 24వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమై 19వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తాయని పేర్కొన్నారు. డిసెంబర్‌ ఏడో తేదీన సత్యనారాయణపురం రామకోటి నుంచి కలశజ్యోతుల మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. (క్లిక్ చేయండి: గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top