
విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్
అడ్డగోలు వాదన.. తప్పును కప్పి పుచ్చుకొనేందుకు పడరాని పాట్లు
ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకు సరికొత్త డ్రామా
సిట్ తీరుపై కోర్టు సందేహం
జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్లను విడిగా భద్రపరచండి
బ్యాంకులోని ఇతర నగదుతో వాటిని కలపవద్దని ఆదేశం
సాక్షి, అమరావతి: రాజకీయ మాయల ఫకీర్ చంద్రబాబు నోట్ల కట్టల మాటున సాగించిన మహా కుట్ర బెడిసికొట్టింది. రెడ్‌బుక్ కుట్రలో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ సిట్ పన్నాగం బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించేందుకు పన్నిన తాజా కుతంత్రం విఫలమైంది. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించేందుకు తెగించిన ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల బరితెగింపు బయటపడింది. ఈ అక్రమ కేసులో రూ.11 కోట్ల నగదు జప్తు పేరిట సాగించిన హైడ్రామాను కప్పిపుచ్చే సిట్ ఎత్తుగడ చిత్తయింది.
హైదరాబాద్ శివారులో పట్టుకున్నట్టు చెప్పిన నగదును గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ తాజా కుయుక్తి పన్నింది. తద్వారా... ఈ కేసులో సాక్షులను బెదిరించి, ఆ నగదును తామే తెప్పించి జప్తు చేసినట్టు ఆడిన హైడ్రామాను కప్పిపుచ్చాలని యత్నించింది. కాగా, సిట్ తాజా కుట్రపై ఉప్పందడంతో అక్రమ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు శనివారం వెంటనే విజయవాడ ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని, వాటిపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
దీన్ని విచారించిన కోర్టు... రూ.11 కోట్లను ప్రత్యేకంగా భద్రపరచాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్ల వివరాలను నమోదు చేస్తూ పంచనామా నిర్వహించాలని విస్పష్టంగా పేర్కొంది. న్యాయస్థానం ఉత్తర్వుల కాపీని పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి ఎస్‌బీఐ అధికారులకు అందజేశారు. నగదును ప్రత్యేకంగా భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. దీంతో రూ.11 కోట్ల జప్తు పేరిట సాగించిన కుట్రను తొక్కిపెట్టాలన్న సిట్ పన్నాగం బెడిసికొట్టింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సిట్ సాగించిన కుట్ర... కోర్టు సత్వర స్పందనతో బట్టబయలైన వైనం ఇదిగో ఇలా ఉంది.
లేని ఆధారాలు సృష్టించేందుకు జప్తు డ్రామా
మద్యం అక్రమ కేసులో ఏదో విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. తద్వారా నిందితుల బెయిల్‌ను అడ్డుకోవడమే ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల పన్నాగం. అందుకే సిట్ రూ.11 కోట్లు పట్టివేత కనికట్టు చేసింది. హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగా కపట నాటకానికి తెరతీసింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి బెంబేలెత్తించింది. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి భార్య దివ్యారెడ్డి హైదరాబాద్‌లోని ఎరేట్ హాస్పిటల్‌లో మైనర్ వాటాతో డైరెక్టర్‌గా ఉన్నారు.
హైదరాబాద్‌కు చెందిన తీగల విజయేందర్‌రెడ్డి కూడా ఈ హాస్పిటల్‌లో భాగస్వామి. ఆయనకు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. అయితే, వర్ధమాన్ కాలేజీతో గానీ విజయేందర్‌రెడ్డి ఇతర వ్యాపారాలతోగానీ రాజ్ కేసిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ, లేని ఆధారాలు సృష్టించేందుకు విజయేందర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సిట్ వేధించింది. రాజ్ కేసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించే తమ కుట్రకు సహకరించాలని పోలీసు మార్కు బెదిరింపులకు పాల్పడింది. దాంతో విజయేందర్‌రెడ్డి సిట్ అధికారుల ఒత్తిడికి తలొగ్గినట్టు తెలుస్తోంది.
తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌ను సిట్ అమలు చేసింది. అందులో భాగంగా వర్ధమాన్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను ఎవరికీ తెలియకుండా విజయేందర్‌రెడ్డికి చెందిన హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ కాలేజీకి సరిగ్గా ఎదురుగానే ఉండే సులోచన ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. ఈ పనికూడా ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ అట్టపెట్టెలు తీసుకెళ్తే ఎవరైనా ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్‌హౌస్‌కు చేర్చిన తర్వాత... సిట్ అధికారులు ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేసినట్టు... రూ.11 కోట్లను గుర్తించి జప్తు చేసినట్టు డ్రామా రక్తి కట్టించారు. ఆ నగదంతా రాజ్ కేసిరెడ్డిదేనని... 2024 జూన్ నుంచి అక్కడ ఉంచారని కట్టు కథ వినిపించారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాజ్ కేసిరెడ్డి
రూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుతంత్రాన్ని రాజ్ కేసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకు గానీ తన కుటుంబానికిగానీ ఏ సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. విజయేందర్‌రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈమేరకు రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎరేట్ హాస్పిటల్‌లో తన భార్య కేవలం మైనర్ వాటాతో డైరెక్టర్‌గా ఉన్నారని, విజయేందర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఇతర వ్యాపార సంస్థలతో తమకు సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు.
దీనికితోడు సిట్ జప్తు చేసినట్టు చెబుతున్న నోట్ల కట్టలపై ఉన్న ఆర్‌బీఐ బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయాలని రాజ్ కేసిరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ నగదును పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆర్‌బీఐని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆ రూ.11 కోట్ల నగదు కట్టలను వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది.
కుట్ర కప్పిపుచ్చే కుతంత్రం
న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సిట్ మరో కుట్రకు తెరతీసింది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా విజయవాడ పోలీసుల బ్యాంకు ఖాతాలు నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో డిపాజిట్ చేసేయాలని ఎత్తుగడ వేసింది. అలా చేస్తే బ్యాంకులో ఉండే ఇతర నగదుతో పాటు ఈ రూ.11 కోట్లను కలిపేస్తారు.
ఆ నగదు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి సిట్‌కు ఓ డిపాజిట్ పత్రం ఇస్తారు. అంటే నగదు రూపంలో ఉన్న రూ.11 కోట్లు డిపాజిట్ పత్రం రూపంలోకి మారిపోతాయి. బ్యాంకు ఆ నగదును వివిధ అవసరాలకు వాడుకుంటుంది కూడా. అలా ఆ నోట్లు మిగతా నోట్లతో కలిసి మార్కెట్లోకి చెలామణిలోకి వెళ్లిపోతాయి. సిట్ అధికారులు హైదరాబాద్‌లో జప్తు చేసిన నోట్ల కట్టలు ఏవీ అంటే ఎవరూ చెప్పలేరు. ఇదీ సిట్ పన్నాగం...!
ఇందుకోసం సిట్ అధికారులు శుక్రవారం రాత్రే రంగంలోకి దిగారు.
శుక్రవారం రాత్రి నుంచే హైడ్రామా...
శుక్రవారం రాత్రే విజయవాడ ఎస్‌బీఐ పటమటలోని సీసీఎస్ బ్రాంచి, మాచవరం బ్రాంచి అధికారులను సంప్రదించారు. అంత భారీ నగదును డిపాజిట్‌గా స్వీకరించాలంటే ముందుగా రెండుసార్లు నోట్ల కట్టలను డినామినేషన్ చేసి పరిశీలించాల్సి ఉంటుంది. అందుకు చాలా సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆ ప్రక్రియ నిర్వహించడం గమనార్హం. మొదటి దశ కింద డినామినేషన్ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో దశ డినామినేషన్ శనివారం మధ్యాహ్నం లోపు పూర్తి చేయాలని భావించారు.
న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్..
సిట్ కుట్రను పసిగట్టిన రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు సత్వరం స్పందించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. జప్తు చేశామని చెబుతున్న రూ.11 నోట్ల కట్టలను సిట్ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఓ సారి జప్తు చేసినట్టు న్యాయస్థానానికి నివేదించిన నగదు, ఇతర ఆస్తులపై పూర్తి అధికారం కోర్టుకే ఉంటుంది.
అటువంటిది కోర్టు అనుమతి లేకుండానే ఆ నగదును డిపాజిట్ చేయడం ద్వారా సిట్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని నివేదించారు. తద్వారా ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. ఆ రూ.11 కోట్లను డిపాజిట్ చేయకుండా సిట్‌ను ఆదేశించాలని కోరారు. అప్పటికే చేస్తే వాటిని ఎస్‌బీఐలోని ఇతర నోట్లతో కలపకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని సిట్‌తో పాటు ఎస్‌బీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
తప్పుదారి పట్టించే ఎత్తుగడ
ఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం శనివారం విచారించింది. ఈ సందర్భంగా సిట్ విచారణ అధికారి ఏకంగా కోర్టునే తప్పుదారి పట్టించేందుకు యత్నించడం గమనార్హం. రూ.11 కోట్లు ఎక్కడ ఉన్నాయని సిట్ దర్యాప్తు అధికారిని ప్రశ్నించగా.. అప్పటికే ఎస్‌బీఐలో డిపాజిట్ చేసేశామని ఆయన చెప్పారు. దీనిపై రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ నగదును ఇంకా డిపాజిట్ చేయలేదన్నారు. చేసి ఉంటే బ్యాంకు కౌంటర్ ఫాయిల్ చూపించాలన్నారు. ఈ ప్రశ్నకు సిట్ అధికారి సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు.
ఆ నగదు డిపాజిట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో సోమవారం అఫిడవిట్ సమర్పిస్తామని చెప్పారు. అందుకు దుష్యంత్‌రెడ్డి సమ్మతించ లేదు. తమకు సిట్‌పై ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలో సిట్ పావుగా మారిందన్నారు. రూ.11 కోట్లకు సంబంధించిన బ్యాంకు కౌంటర్ ఫాయిల్ ఫొటోను వాట్సాప్ ద్వారా తెప్పించుకుని అయినా చూపించమని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పరిణామంతో తనకు సమయం కావాలన్న సిట్ అధికారి దాదాపు గంట వరకు పత్తా లేకుండాపోవడం గమనార్హం.
రూ.11కోట్లను ప్రత్యేకంగా భద్రపరచండి
రాజ్ కేసిరెడ్డి పిటిషన్‌ను విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విస్పష్టమైన తీర్పునిచ్చింది. రూ.11 కోట్లను విడిగా భద్రపరచాలని సిట్ అధికారులు, ఎస్‌బీఐ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే డిపాజిట్ స్వీకరించి ఉంటే బ్యాంకులోని ఇతర నగదుతో కలపకుండా ప్రత్యేకంగా భద్ర పరచాలని స్పష్టం చేసింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని సిట్‌ను ఆదేశించింది. మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి హక్కులను పరిరక్షించేందుకు, ఆయన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని తేల్చి చెప్పింది. దాంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది.
ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు బెంబేలు
ఈ పరిణామాలతో అటు ప్రభుత్వ పెద్దలు ఇటు సిట్ అధికారులు బెంబేలెత్తారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను ఆర్‌బీఐ అధికారులు పరిశీలిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ నగదు కట్టలను రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ, ఆర్‌బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024 జూన్ తరువాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది.
అంతేకాదు, ఆ నోట్ల కట్టలను ఏ ఏ తేదీల్లో బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేశారన్నది కూడా ఆర్‌బీఐ అధికారులు పరిశీలించి వెల్లడిస్తారు. ఆ నోట్ల కట్టలు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024, జూన్ తరువాత బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసినట్టు వెల్లడైతే సిట్ బండారం బట్టబయలవుతుంది. చివరకు కోర్టును తప్పుదారి పట్టించిన సిట్ అధికారులపై న్యాయస్థానం తీవ్రమైన చర్యలకు ఆదేశించవచ్చు. ఆపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన ఈ అక్రమ కేసు కుట్ర బెడిసికొడుతుంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు హడలిపోయారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అడ్డగోలు వాదన
జప్తు చేసిన ఆస్తుల విషయంలో చేయాల్సింది ఇలా...
పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు తాము జప్తు చేసే స్థిర, చర ఆస్తులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను న్యాయ వ్యవస్థ విస్పష్టంగా పేర్కొంది. అవి ఏమిటంటే...
⇒ జప్తు చేసిన నగదు, స్థిర, చర ఆస్తులను మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేయాలి.
⇒అనంతరం పంచనామా చేయాలి. అంటే ఆ స్థిర, చర ఆస్తుల పరిమాణం, స్వరూప స్వభావాలను స్పష్టంగా పేర్కొనాలి. నగదు కాబట్టి.. ఆ నోట్లపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు, మొత్తం విలువ, వాటిని ఎందులో భద్రపరిచింది? మొదలైన వివరాలతో పంచ నామా చేయాలి.
⇒ జప్తు చేసిన నోట్ల కట్టలను ప్యాకింగ్ చేసి న్యాయస్థానంలో ప్రదర్శించాలి. ప్యాకింగ్ తెరచి మరీ న్యాయస్థానానికి చూపించాలి.
⇒ అనంతరం న్యాయస్థానం అనుమతితో ఆ నగదును ప్రభుత్వ ట్రెజరీలో భద్ర పరచాలి. కోర్టు కోరితే ఎప్పుడైనా సరే వాటిని మరోసారి తీసుకొచ్చేందుకు వీలుగా ట్రెజరీలోనే ఉంచాలి.
⇒ కోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయాలి.
కానీ, సిట్ ఏం చేసిందంటే..
⇒హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌లో రూ.11కోట్లు జప్తు చేసినట్టు ప్రకటించింది.
⇒జప్తు చేసిన నోట్ల కట్టలను న్యాయస్థానానికి చూపించనే లేదు. జప్తు చేసినట్టు కేవలం ఓ నోట్ సమర్పించి చేతులు దులుపుకొంది.
⇒ ఆ రూ.11 కోట్లను ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరచలేదు.
⇒ కోర్టు అనుమతి లేకుండానే ఆ రూ.11కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యత్నించింది. తద్వారా బ్యాంకులోని ఇతర నోట్ల కట్టలతో వాటిని కలిపేయాలన్నది సిట్ కుట్ర. తద్వారా జప్తు పేరిట తమ కుట్ర బయటపడకుండా ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.
నోట్ల కట్టలన్నిటికీ బ్యాంక్ పిన్, సీల్స్
⇒ వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది
⇒ మరి రూ.11 కోట్లని ఎలా నిర్ధారించారు?
⇒ లెక్కపెట్టే యంత్రాలను ఎక్కడా చూపలేదు..
⇒ అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారు
⇒ కానీ, ఇక్కడే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామా
సిట్ కపట నాటకంలో మరో అంకం ఇది.. అది జప్తు చూపించిన డబ్బు అంతా కట్టలకు బ్యాంక్ పిన్, సీల్స్‌తో ఉంది. దీన్నిబట్టి కనీసం వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది. అలాగైతే.. ఆ మొత్తం రూ.11కోట్లని ఎలా నిర్ధారించారు? అనేది సమాధానం చెప్పాలి. పైగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా ఎక్కడా చూపలేదు. అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారని స్పష్టం అవుతోంది. కానీ, ఫామ్‌హౌస్‌లోనే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామా నడిపించింది.
నోట్ల నంబర్లు రికార్డు చేస్తే సిట్ బండారం బట్టబయలు
నోట్ల నంబర్లు రికార్డు చేస్తే ఏ బ్యాంకు ద్వారా ఎప్పుడు డ్రా చేశారు? ఎవరి బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేశారు? ఏ టైమ్‌లో డ్రా చేశారు? అనేది స్పష్టంగా తేలిపోతుంది. అందుకే అది తెలియకుండా ఉండేందుకు బహుశా ప్రపంచంలో ఏ విచారణ సంస్థ కూడా చేయని విధంగా సిట్ బరితెగించింది. భారీ స్కెచ్ వేసింది. స్వయంగా డబ్బు తానే పెట్టి.. జప్తు పేరిట కపట నాటకం ఆడింది. ఇదంతా బయటపడకుండా ఉండేందుకు బ్యాంకులోని మిగతా డబ్బులో కలిపేసే కుతంత్రానికి తెరతీసింది.