
తెనాలి ఘటనపై దళిత, మైనారిటీ బాధిత కుటుంబాల ఆక్రోశం
మా పిల్లలపై తప్పుడు కేసులు బనాయించారు
ఇదేం ఘోరం.. ఇంత క్రూరంగా హింసిస్తారా?
మా గుండెలు బద్దలయ్యాయి..
రాజ్యాంగం మీకేమైనా ప్రత్యేక రక్షణ కల్పించిందా?
లక్షల మందిపై కేసులున్నా ఇలా ఎవరినైనా, ఎక్కడైనా కొట్టారా?
దీనిపై న్యాయ పోరాటానికి వెనుకాడేది లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? మా పిల్లలను దారుణంగా హింసిస్తారా? ఇదేం ఘోరం? మా గుండెలు బద్దలయ్యాయి..! రాజ్యాంగం మీకేమైనా ప్రత్యేక రక్షణ కల్పించిందా? లక్షల మందిపై కేసులున్నాయి.. కానీ ఇలా ఎవరినైనా, ఎక్కడైనా కొట్టారా? ఇది ప్రభుత్వ ఉగ్రవాదమే..!’ తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన బాధిత యువకుల తల్లితండ్రుల ఆక్రోశం ఇదీ!! పోలీస్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశారనడం బూటకమని, తమ పిల్లలపై తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు.
కానిస్టేబుల్ మామూళ్ల కోసం ఒత్తిడి చేయడం వల్లే ఘర్షణ చోటు చేసుకుందని, తమ బిడ్డలను నడిరోడ్డుపై గొడ్డును బాదినట్లు చితక బాదడం ఏమిటని నిలదీస్తున్నారు. ఈ దౌర్జన్యాలు, అరాచక పాలనను ప్రశి్నస్తూ దళిత, ప్రజాసంఘాలు తమతో కలసి రావాలని వేడుకుంటున్నారు. ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమనడంతో పోలీసులు నష్ట నివారణ చర్యలకు దిగారు. రాజీ పడదామంటూ బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపారు. తెనాలిలో పర్యటించిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

తన కుమారుడిని పోలీసులు దారుణంగా కొడుతున్న వీడియోను చూసి విలపిస్తున్న బాబూలాల్ తల్లి షేక్ రెహ్ముతుల్లా
అక్రమ కేసు పెట్టి చిత్రహింసలా?
నాకు నలుగురు మగ పిల్లలు. నాలుగో కుమారుడు బాబూలాల్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. జాన్ విక్టర్ తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుక ఉందని ఆహా్వనించడంతో బాబూలాల్ వెళ్లాడు. తరువాత రోజు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లాం. పుట్టిన రోజు పార్టీ తరువాత బండి మీద వచి్చన ఓ వ్యక్తితో ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఆ వ్యక్తి పోలీస్ దుస్తుల్లో లేకపోవడం, పోలీస్‌నని చెప్పకపోవడం, నోటికి వచి్చంది మాట్లాడి చేయి చేసుకోవటం దీనికి కారణం.
ఆ కానిస్టేబుల్ అది మనసులో పెట్టుకుని వారంతా గంజాయి తాగినట్టు, ఒక కత్తి కూడా పక్కన పెట్టి, చేయని నేరాలు మోపి అక్రమ కేసు పెట్టారు. మా అబ్బాయి, వాడి స్నేహితులను నడి రోడ్డు మీద కూర్చోబెట్టి దారుణంగా చితకబాదిన వీడియో చూశా. అక్రమ కేసు పెట్టటమే కాకుండా ఇలా కొట్టటం ఎంత వరకు సమంజసం?
– రెహ్ముతుల్లా షేక్ (బాధితుడు బాబూలాల్ తల్లి, మంగళగిరి)
ఇదేం ఘోరం? ఇంత క్రూరత్వమా?
చేబ్రోలు ఇశ్రాయెల్ (బాధితుడు జాన్ విక్టర్ తండ్రి)
మా సొంతూరు చుండూరు మండలం ఆలపాడు. ప్రస్తుతం మంగళగిరిలో ఉంటున్నా. ఎల్‌ఐసీ ఏజెంటుగా పని చేస్తున్నా. నా కుమారుడు జాన్‌విక్టర్ న్యాయవాదిగా నమోదు చేసుకుని గుంటూరు కోర్టుకు వెళుతున్నాడు. కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. తెనాలిలో చదివే సమయంలో అయితానగర్‌కు చెందిన వేము నవీన్ నా కుమారుడికి స్నేహితుడు. గత నెల 24న పుట్టినరోజు పార్టీ అంటూ నవీన్ పిలిస్తే నా కుమారుడు తన స్నేహితుడు బాబూలాల్‌తో కలసి తెనాలి వెళ్లాడు. అయితానగర్ పల్లెకొండవారి వీధిలో నవీన్, రాకేష్ వారిని కలిశారు.
రాత్రి 9.30 గంటలకు అక్కడకు వచి్చన త్రీటౌన్ పోలీస్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ‘గంజాయి అమ్ముతున్నారు కదా! మామూలు ఇవ్వండి... సీఐ అడిగి రమ్మన్నారు’ అని చెప్పాడు. ‘మేమెందుకివ్వాలి..? మాకేం సంబంధం..?’ అంటూ నవీన్ ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అడ్డుకోవటానికి ప్రయతి్నంచిన నా బిడ్డపై కానిస్టేబుల్ దౌర్జన్యం చేశాడు. తెల్లవారుజామున వన్‌టౌన్ కానిస్టేబుల్ రమే‹Ùనాయక్‌తో కలసి చిరంజీవి మా ఇంటికి కారులో వచ్చాడు. సీఐ రమ్మన్నారంటూ నా కుమారుడిని తీసుకెళ్లారు.

మర్నాడు నేను, నా భార్య స్టేషనుకు వెళ్లినా మా బిడ్డను చూపించలేదు. తర్వాత మూడు రోజులకు అరెస్టు చేశారని తెలిసింది. త్రీటౌన్ కానిస్టేబుల్ చిరంజీవిపై హత్యాయత్నం చేశారంటూ కేసు పెట్టారు. ఇలా నడిరోడ్డుపై ప్రజల సమక్షంలో దారుణంగా హింసించిన విషయం వైరల్ అయిన వీడియోతోనే తెలిసింది. మా గుండెలు బద్దలయ్యాయి. ఇదేం ఘోరం? పోలీసు అధికారులు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? సభ్య సమాజంలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా? మేం దళితులం అయినందునే కదా ఇంతటి దారుణానికి ఒడిగట్టారు? రకరకాల కేసుల్లో ఉన్న ఇతర వర్గాలకు చెందినవారిని ఏనాడైనా ఇలా శిక్షించారా? మా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. దీనిపై పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేస్తాం. తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటికే మానవ హక్కుల
కమిషన్‌కు ఫిర్యాదు పంపాం.
అక్రమ కేసు బనాయించారు
నా తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు. అక్రమ కేసులో ఇరికించి గొడ్డుని బాదినట్టు బాదారు. ఆ కానిస్టేబుల్ తాను పోలీసునని చెప్పలేదు. పోలీస్ మీదకు వెళ్లారంటూ అక్రమ కేసు బనాయించారు. దారుణమైన నేరాలు చేసిన వారిని కూడా ఇలా చిత్రహింసలకు గురి చేయలేదు. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. – సాంబశివరావు (బాధితుడు బాబూలాల్ సోదరుడు, మంగళగిరి)
కానిస్టేబుల్ బ్యాంకు ఖాతా పరిశీలించాలి..
నేను పెయింటింగ్ మే్రస్తిగా పని చేస్తున్నా. మా అమ్మాయి బీ.టెక్ చేసింది. కుమారుడు దోమా రాకేష్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేస్తున్నాడు. ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గతంలో యాక్సిడెంటులో గాయపడటంతో కుడి కాలు, కుడి చేతిలో రాడ్‌లు వేశారు. గత నెలలోనే ఇక్కడకు వచ్చాడు. ఏప్రిల్ 24న రాత్రి స్నేహితులను కలిసేందుకు అయితానగర్ పల్లెకొండవారి వీధికి వెళ్లాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో త్రీటౌన్ కానిస్టేబుల్ చిరంజీవి వారి దగ్గరకు వెళ్లాడు. నవీన్‌కు, కానిస్టేబుల్‌కు మధ్య ఘర్షణ జరిగింది.
కానిస్టేబుల్ అక్కడే ఉన్న మావాడి చొక్కా పట్టుకోవడంతో విడిపించుకుని ఇంటికి వచ్చాడు. మామూళ్ల కోసమే ఆ కానిస్టేబుల్ అక్కడకు వచ్చాడు. పట్టణంలో చాలామంది దగ్గర మామూళ్లు వసూలు చేస్తుంటారు. కొందరు డబ్బులిస్తే మరికొందరు ఫోన్ పే చేస్తుంటారు. కానిస్టేబుల్ బ్యాంకు ఖాతా పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి.
కానిస్టేబుల్ గాయపడితే ఆస్పత్రిలో చికిత్స పొందకుండా కొద్ది గంటల్లోనే మా ఇంటికి ఎలా వచ్చాడు? కావాలనే కేసు అక్రమ కేసు పెట్టారు. నా కుమారుడిని పోలీసు అధికారులు నడిరోడ్డుపై చిత్రహింసలకు గురి చేశారు. కాలులో రాడ్ ఉందని వేడుకున్నా వినలేదు. ఒక సీఐ బూటుకాలితో తొక్కిపెడితే మరో సీఐ విచక్షణారహితంగా చితకబాదాడు. మా బిడ్డను కొట్టిన పోలీసులకు తగిన శాస్తి జరగాలి. ఇందుకోసం న్యాయపోరాటం చేస్తాం. – దోమా వాసు (బాధితుడు రాకేష్ తండ్రి, తెనాలి, అయితానగర్)