
నా కుమారుడు చూస్తుండగానే నన్ను కట్టేసి కొట్టారు
దివ్యాంగురాలైన నా కుమార్తె పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు
బట్టలు చించేందుకు ప్రయత్నించారు.. నా కుమారుడు ఏడుస్తున్నా కనికరించలేదు
కుప్పం ఘటనలో బాధితురాలు శిరీష ఆవేదన
కుప్పం రూరల్: ‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు.
అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. తీవ్రంగా గాయపడిన శిరీష ప్రస్తుతం కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే.
మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది.
నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు
‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు.
మా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించింది.

నలుగురికి రిమాండ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శిరీషను హోంమంత్రి అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును ఆదేశించారు. కాగా.. శిరీషపై దాడిచేసిన మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు రాజా, వెంకటమ్మ, జగదీశ్వరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
అండగా ఉంటాం: ఎమ్మెల్సీ భరత్
కూటమి ప్రభుత్వం రాగానే సామాన్యులపైనా దాడులు ఎక్కువయ్యాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఎయిర్‌పోర్ట్ భూముల విషయంలో టీడీపీ కార్యకర్తలు మగ దిక్కులేని కుటుంబంపై దాడిచేసిన ఘటన మరువక ముందే కుప్పం మండలం నారాయణపురంలో మరో ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. భర్త అప్పులు చేస్తే భార్యను చెట్టుకు కట్టేసి బట్టలు చించేందుకు ప్రయత్నించడం చాలా దారుణమన్నారు.
విడతల వారీగా అప్పు తీరుస్తానని మహిళ మొర పెట్టుకుంటున్నా చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత హేయమైన చర్య అన్నారు. కొడుకు చూస్తుండగా, తల్లిని కొడుతూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో తెలియడం లేదని ఆవేదన చెందారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం మరింత దారుణమన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉంటామని భరత్ చెప్పారు.