
వివాహితపై వీఆర్వో లైంగిక వేధింపులు
పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
బెల్లంకొండ: రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలంటూ వచ్చిన ఓ వివాహితను వీఆర్వో లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసింది. వీఆర్వో వెంకయ్య నాగిరెడ్డిపాలెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆఫీసుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడు.
వారం రోజుల నుంచి వివాహిత వీఆర్వో వద్దకు వస్తుండగా కాలయాపన చేస్తూ పలుమార్లు తిప్పాడు. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ ఆమెను వేధించాడు. దీంతో 2 రోజుల క్రితం వీఆర్వో ఉంటున్న గది వద్దకు వివాహిత వెళ్లి ఆయన వేధింపులను సెల్‌ఫోన్లో వీడియో తీసి, శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్వోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తహశీల్దార్ టీ.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేసి, వీఆర్వోపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.