
ఈ రోజు కేబినెట్‌లో ప్రకటిస్తారని ఎదురు చూసినా నిరాశే మిగిలింది
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఉద్యోగుల హామీలను పట్టించుకోవడం లేదు
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ఒక్క డీఏ ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వానికి మనసు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో.. కనీసం ఒక డీఏ ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూసినా నిరాశే మిగిలిందని ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల హామీలు పక్కన పెట్టినా రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏలనూ ఇవ్వడం లేదని విమర్శించారు.
వివిధ కార్యక్రమాలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల డీఏలపై ఇంత నిర్లక్ష్యంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. 2019లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 27 శాతం మధ్యంతర భృతిని మొదటి కేబినెట్‌లోనే ఆమోదించి 2019 జులై 1 నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి ఐఆర్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫేస్టోలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాటి గురించి అసలు మాట్లాడటం లేదని విమర్శించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉద్యోగులకుబకాయిలు రూ.21,800 కోట్లు
గత జూలైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.21,800 కోట్లు అని, ఇందులో డీఏ, పీఆర్‌సీ బకాయిలు, సరెండర్ లీవ్ బిల్లులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. జీపీఎఫ్ బిల్లులు 2024 మార్చి వరకు గత ప్రభుత్వంలో చెల్లించారని వివరించారు. కూటమి సర్కారు వచ్చాక బకాయిలేమీ చెల్లించలేదన్నారు. పాత బకాయిలలో పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆరి్థక మంత్రి చెప్పినా ఇప్పటివరకు ఒక్క సరండర్ లీవ్ బిల్లు మాత్రమే చెల్లించారని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.