మంత్రులు నారాయణ, లోకేశ్‌కు సీఆర్‌డీఏ ఏసీ బినామీ | Vaddamanu farmer alleges harassment against Additional Commissioner Bhargav Teja | Sakshi
Sakshi News home page

మంత్రులు నారాయణ, లోకేశ్‌కు సీఆర్‌డీఏ ఏసీ బినామీ

Jun 28 2026 5:09 AM | Updated on Jun 28 2026 5:09 AM

Vaddamanu farmer alleges harassment against Additional Commissioner Bhargav Teja

అడిషనల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజపై వడ్డమాను రైతు ఆరోపణ

లాభం రాదని నా పరిహారం ఫైల్‌ పక్కన పడేశాడు 

హైలెవల్‌ కమిటీ, కమిషనర్‌ అనుమతించినా ఏసీ క్లియర్‌ చేయడంలేదు 

నేనిచ్చిన అగ్రిమెంట్‌ రద్దుచేసి నా భూమిని నాకిచ్చేయండి

తాడికొండ: మంత్రులు లోకేశ్, నారాయణకు సీఆర్డీఏ అడిషనల్‌ కమి­షనర్‌ భార్గవ్‌ తేజ బినామీ అని రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామానికి చెందిన రైతు చుండు నర్సిరెడ్డి ఆరోపించారు. లంచం ఇవ్వకపోవడంతో రాజధానికి రెండో విడ­తలో ఇచ్చిన తన కోళ్ల ఫారం, హలో బ్రిక్స్‌ కంపెనీ భూములకు పరిహారం ఇచ్చేందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. లంచం ఇస్తేనే ఇక్కడ ఫైలు కదులుతుందని అన్నారు. శనివారం వడ్డమానులో ఏర్పాటు చేసిన విలేక­రుల సమా­వేశంలో ఆయన మాట్లాడుతూ.. భార్గవ్‌ తేజకు లాభం ఉంటే ఏ పూటకు ఆ పూట ఫైల్‌ క్లియర్‌ చేస్తున్నారని, లాభం రాదనే నా పరిహారం ఫైల్‌ పక్కన పడేశారని ఆరోపించారు. 

తాను రెండో విడత పూలింగ్‌ కోసం మొత్తం 13 ఎకరాలను ఇస్తే అందులో రెండు ఎకరాల్లో కోళ్ల ఫారం, 82 సెంట్లలో హలో బ్రిక్స్‌ ప్లాంటు ఉన్నా­యన్నారు. వీటికి పరిహారం కోసం ఎన్ని­సార్లు తిరిగినా ఉపయోగం లేకపోయిందన్నారు. మే 7వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పరిహారా­నికి పదేళ్లా’ అనే కథనంతో ఫైల్‌ ముందుకు కదిలి జిల్లా కలెక్టర్, మంత్రు­లతో కూడిన హైలె­వల్‌ కమిటీ అనుమతి వచ్చిందని తెలిపారు. సీఆర్డీఏ కమిషనర్‌ కూడా పరిహా­రం విడుదల చేయాలని చెప్పా­రని, అయినా అడిషనల్‌ కమిష­నర్‌ భార్గవ్‌ తేజ తన ఫైల్‌ను పక్కన పడేశారని అన్నారు. 

తనకంటే వెనుక వచ్చిన పెదపరిమిలో 74 ఎక­రాల ఫైల్‌ను 5 నిమిషాల్లో క్లియర్‌ చేసి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లకు అనుమతులు జారీ చేసి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని ఆరో­పించారు. లాభం ముట్టినందునే తుళ్లూరు ఎడ్యు­కేషన్‌ సొసైటీ పేరుతో ఎలాంటి భవనాలు లేకు­న్నా రూ.3 కోట్లు పరిహారం విడుదల చేశా­రని అన్నారు. తన బ్రిక్స్‌ కంపెనీ, కోళ్ల ఫారానికి కలిపి సుమారు రూ.10 కోట్ల వరకు పరిహారం వస్తుందన్నారు. 

రెడ్లు ఆర్థికంగా స్థిరపడ­కూ­డ­ద­నే ఆలోచన కూడా ఆయనలో ఉందన్నారు. భార్గవ్‌ తేజ మంత్రులు లోకేశ్, నారాయణకు బినా­మీగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తు­న్నా­ర­­న్నారు. సీఆర్డీఏకు తానిచ్చిన అగ్రిమెంట్‌ రద్దుచేసి తన భూమిని తిరిగిచ్చేస్తే వ్యవసాయం, కోళ్ల ఫారం వ్యాపారం చేసుకుంటానని చెప్పా­రు. తనను ఇలా ఇబ్బందులకు గురిచేయడం పద్ధతి కాదని నర్సిరెడ్డి అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement