ఘర్షణ పడుతున్న రెండు వర్గాలు
మహిళలు, చిన్నారులు సహా పలువురికి గాయాలు
బాపట్ల జిల్లా నాగండ్లలో ఘటన
ఇంకొల్లు (చినగంజాం): దేవుని ఊరేగింపు విషయంలో తలెత్తిన వివాదం రెండువర్గాల మధ్య విద్వేషాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీల ఇళ్లపై ఒక అగ్రవర్ణం దాడులకు దిగింది. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నాగండ్ల గ్రామంలో ఏటా సంక్రాంతి పండుగ రోజున గ్రామంలో మాధవయ్యస్వామి ఊరేగింపును బీసీలు, కనుమ రోజున అగ్రవర్ణం నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున ఎప్పటిలా బీసీలు ఊరేగింపు నిర్వహిస్తుండగా అగ్రవర్ణం వారితో చిన్నపాటి ఘర్షణ జరిగింది. కనుమ రోజున అగ్రవర్ణం ఊరేగింపు నిర్వహించేందుకు సిద్ధంకాగా.. ఊరేగింపు వాహనం వెళ్లే మార్గంలో బీసీలు బైక్ స్లో రేసింగ్ పోటీలు ఏర్పాటు చేశారు.
దీంతో రెండువర్గాల మధ్య మరోసారి చిన్నపాటి గొడవ జరిగింది. దాంతో పోలీసులు రెండువర్గాల వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే, ఈ నెల 17వ తేదీన అగ్రవర్ణానికి చెందిన కొందరు బీసీ మహిళతో ఘర్షణకు దిగడంతో ఆమె బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే అదునుగా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు సామూహికంగా బీసీల ఇళ్లపై దాడికి దిగారు. కర్రలు, ఇసుపరాడ్లతో దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. దాడిలో కయ్యాల సింగయ్యకు తల పగలగా, కయ్యాల శ్రావణి, కయ్యాల కోటేశ్వరమ్మ, తిరుపతమ్మ, కయ్యాల రమణ, నాగరాజు, సర్పంచ్ పద్మ భర్త కంచుగంటి వెంకటేశ్వర్లుపై టీడీపీకి చెందిన వారు విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు వాపోయారు.
తమపై పథకం ప్రకారమే దాడిపర్తి వాసు, పవన్, యర్రమాసు హరిబాబు, ఈదర వెంకటేశ్వర్లు, ఉమ, రామారావు, ఈదర వెంకటేశ్వర్లు, పేర్ని నవీన్, రవీంద్ర, రమేష్, కె.పవన్, అనిల్, సుజాత, అశోక్ తదితరులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుంపును చెదరగొట్టారు. గాయాలపాలైన సింగయ్య తదితరులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడిలో గాయపడిన కయ్యాల సింగయ్య ఫిర్యాదు మేరకు 8 మందితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్టు ఎన్‌ఐ సురేష్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


