వింత వాతావరణం.. ఏజెన్సీలో రోజూ వర్షాలే..!

Unseasonal Rains In Paderu Agency Anakapalle District - Sakshi

పాడేరు: ఏజెన్సీలో వింత వాతావరణం నెలకొంది.  వేసవిలో కూడా రోజూ వర్షాలు కురుస్తుండడంతో పాటు ఉదయం పొగమంచు,  సూర్యోదయం తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  వారం రోజుల నుంచి అరకులోయ, పాడేరు నియోజకవర్గాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంచంగిపుట్టు, జి.మాడుగుల, అరకులోయ, పాడేరు, హుకుంపేట మండలాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి.

గెడ్డల్లో నీటి ప్రవాహం పెరిగింది. పర్యాటక ప్రాంతాలైన చాపరాయి, కొత్తపల్లి జలపాతాలకు వర్షం నీటితో  జలకళ ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.   వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలపై  క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని రెవెన్యూ యంత్రాంగానికి సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌ ఆదేశించారు.  

నాలుగు ఇళ్లు ధ్వంసం 
జి.మాడుగుల: మండలంలో  శుక్రవారం సాయంత్రం ఈదుర గాలులతో కూడిన వర్షానికి నాలుగు రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి.   కోరాపల్లి పంచాయతీ వయ్యంపల్లిలో   కోరాబు వెంకటరావు, మర్రి కృష్ణారావు, మర్రి కామేశ్వరరావు, కొర్రా సన్యాసిరావులకు చెందిన  ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల పై కప్పు రేకులు ఎగిరి పడడంతో ధ్వంసమయ్యాయి.  

నాలుగు  కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు.  ధాన్యం, బియ్యం, ఇతర వస్తువులు పాడయ్యాయని బాధితులు తెలిపారు. సుమారు  రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు వారు తెలిపారు. శంకులమిద్దెలో ఆదివారం కురిసిన వర్షానికి ఓ చెట్టు.. మినీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడడంతో అది నేల కూలింది.    

పిడుగుపాటుతో మహిళకు గాయాలు  
హుకుంపేట : పిడుగుపాటుకు  ఓ గిరిజన మహిళ తీవ్ర గాయాలపాలైంది.  మండలంలోని కొట్నాపల్లి పంచాయతీలోని లొపొలం గ్రామంలో వంతాల నీలమ్మ అనే మహిళ ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం పిడుగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న నీలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.   వెంటనే ఆమెను ఆటోలో హుకుంపేట ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు కుటుంసభ్యులు  తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top