1,800 మంది పార్ట్ టైం టీచర్లకు రెండు నెలలుగా జీతాల్లేవ్
కుటుంబ పోషణ కోసం అప్పుల తిప్పలు
సాక్షి, అమరావతి: బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 1,800 మంది పార్ట్‌టైమ్ టీచర్లకు వేతన వెతలు తప్పడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏ నెలలోనూ సమయానికి జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాలకు జీతాలు ఇవ్వలేదు. మే నెల గురుకులాల సెలవుల్లో వారికి ఉద్యోగ విరామం ఉంటుంది. మళ్లీ ఈ నెల నుంచి వారి ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి ఉంది. ఈ నెల కూడా గడిస్తే వారికి మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతిసారి ఇదే తంతు కొనసాగడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారుతోందని వారంతా వాపోతున్నారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని చెబుతున్నారు. పేరుకు పార్ట్‌టైమ్ టీచర్లే అయినా వారితో నిబంధనలకు విరుద్ధంగా ఫుల్‌టైమ్ పని చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు స్కూల్ డ్యూటీ మొదలు పెట్టి.. సాయంత్రం 4 గంటల వరకు వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా స్టడీ అవర్స్ నిర్వహించాలనే ఒత్తిడి వారిపై ఉంది.
దీనికితోడు రెగ్యులర్ స్టాఫ్ చేయాల్సిన విద్యార్థుల పర్యవేక్షణ బాధ్యత, రికార్డుల పరిశీలన కూడా పార్ట్‌టైమ్ టీచర్ల నెత్తినే పడింది. ఇంత చేసినా.. నెలనెలా అందరితోపాటు సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన ఈ సమయంలో పిల్లల చదువులకు ఫీజులు, పుస్తకాలు తదితర ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వారు పడే అవస్థలు అన్నీఇన్నీ కాదు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ జీతాలు విడుదల చేసి ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.


