పకడ్బందీగా పాఠశాల విద్య | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పాఠశాల విద్య

Published Fri, Jan 14 2022 4:37 PM

The Union Ministry of Education To Further Enhance School Education - Sakshi

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యను మరింత పరిపుష్టం చేసే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. జాతీయస్థాయిలో రూపకల్పన చేస్తున్న నేషనల్‌ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఎఫ్‌)కు స్థానిక అంశాలు, పరిస్థితులను జోడించనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనుంది. పిల్లల్లో పునాది స్థాయి నుంచి విద్యాభ్యసన సామర్థ్యాలు పెంచడం ద్వారా పాఠశాల విద్య, ఆపై ఉన్నత విద్య పరిపుష్టం అవుతుందన్న ఉద్దేశంతో తాజాగా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను స్పృశిస్తూ స్థానికుల అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో మేధావులు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులతో పాటు వివిధ వర్గాలకు చెందిన నాలుగు వేల మంది నుంచి విద్యారంగ పురోగతిపై ఈ అభిప్రాయాలను సేకరించనుంది. ఇందుకోసం ఎన్‌సీఈఆర్టీ ఆయా రాష్ట్రాల విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయిస్తోంది. అభిప్రాయ సేకరణ, నివేదికల రూపకల్పన వంటివన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ఏర్పాట్లుచేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఎన్‌సీఎఫ్‌కు నిర్దేశించిన అంశాలు..
పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్య, వయోజన విద్య అనే నాలుగు విభాగాల పరిపుష్టం దిశగా నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందనుంది. ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలను ఎన్సీఈఆర్టీ గుర్తించి అన్ని రాష్ట్లాలకు వీటిని నిర్దేశించింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ అంశాల్లో అభిప్రాయాలను స్వీకరించనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎస్సీఈఆర్టీలు, ఎన్‌సీఈఆర్టీ జిల్లా స్థాయిలో సంప్రదింపులు చేపట్టనున్నాయి. వీటి ఆధారంగా 25 ఫోకస్‌ గ్రూపుల ద్వారా పొజిషన్‌ పేపర్లను రూపొందించనుంది. ‘మైగవ్‌.ఐఎన్‌’ పోర్టల్‌తో పాటు సర్వే కోసం మొబైల్‌ యాప్‌ను ఏర్పాటుచేసింది. 

12 మందితో స్టీరింగ్‌ కమిటీ
ఇక కొత్త జాతీయ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ రూపకల్పన కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే 12 మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటుచేసింది. సిలబస్, పాఠ్యపుస్తకాల రూపకల్పన, బోధనా పద్ధతులను రూపొందించి అన్ని రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయనుంది. ప్రస్తుతం 2005లో రూపొందించిన నాలుగవ జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ ఇప్పటికీ అమల్లో ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో విశ్వవ్యాప్తంగా విద్యారంగం.. దానికి ఆలంబనమైన రంగాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో, సాంకేతిక పరిజ్ఞానంలో, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఈ మార్పులొచ్చాయి. దీంతో కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌కు కేంద్రం ఏర్పాట్లుచేసింది.

రానున్న కాలంలో పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధికి అవకాశమున్నందున ఆ దిశగా పిల్లలను తీర్చిదిద్దేలా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిల్లోనే పిల్లల్లో పఠనం, లేఖనం, గణితం అంశాల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలన్నదే లక్ష్యం. నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను స్థానిక అంశాలకు, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించడం ద్వారానే ఈ లక్ష్యాలను సాధించేలా చర్యలు చేపట్టింది. దీని ప్రకారమే రాష్ట్రాల కార్యక్రమాలకు కేంద్రం నిధులు అందించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బి. ప్రతాప్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.  

ఎన్సీఈఆర్టీ గుర్తించిన ముఖ్యాంశాలివే..
5+3+3+4 విధానంలో పాఠ్య ప్రణాళిక, బోధనా విధానం
ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌
ఫౌండేషనల్‌ లిట్రసీ, అండ్‌ న్యూమరసీ
కాంపిటెన్సీ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌
సెకండరీ తరగతుల్లో సబ్జెక్టు ఎంపిక చేసుకునే సౌలభ్యం
కరికులమ్‌ కుదింపు, కోర్‌ ఎసెన్షియల్స్‌
3, 5, 8 తరగతుల్లో బెంచ్‌మార్కు లెర్నింగ్‌ లెవెల్స్‌
వొకేషనల్‌ విద్య పునర్వ్యవస్థీకరణ
బహుభాషా పరిజ్ఞానం
21వ శతాబ్దపు నైపుణ్యాలు.. ఐసీటీ తదితరాలు
జీవ నైపుణ్యాలు, పౌరసత్వం, నైతికత, జాతీయ వారసత్వ సంపద, ప్రజా ఆస్తుల పరిరక్షణ, సేవా దృక్పథం
సమ్మిళత విద్య– ఆర్ట్స్, క్రాఫ్ట్, టాయిస్, స్పోర్ట్స్‌– ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌
ఇండియన్‌ నాలెడ్జి సిస్టమ్‌
పాఠశాల విద్య, ఉన్నత విద్య మధ్య అనుసంధానం
స్కిల్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌
ఎగ్జామ్స్‌ రిఫారŠమ్స్, హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డు
స్కూల్‌ కమ్యూనిటీ రిలేషన్‌
వనరుల వ్యవస్థల బలోపేతం
పాఠ్యపుస్తకాల డిజైన్, డెవలప్‌మెంట్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement