
గండికోటలో ‘టెంట్ సిటీ’ టెండర్ బాగోతం
పర్యాటక శాఖలో అభివృద్ధి పేరిట అడ్డగోలు దోపిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీకి బరితెగించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని గండికోట పర్యాటక ప్రాంతంలో 3.94 ఎకరాల్లో రూ.5.04 కోట్లతో ‘టెంట్ సిటీ’ నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా.. కాంట్రాక్టు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది.
అయితే, టీడీపీ కూటమి పెద్దలకు చెందిన అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధిచేకూర్చేందుకు టెండర్ పద్ధతినే మార్చేసింది. పైకి నీతి ఆయోగ్ నమూనాను అనుసరిస్తున్నామనే రీతిలో బిల్డప్ ఇస్తూ లోపాయికారిగా నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో సదరు కాంట్రాక్టరు పైసా పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణాలు చేసుకుని వచ్చిన ఆదాయాన్ని అనుభవించేలా నిబంధనలుండటం కొసమెరుపు!
ఎక్కడాలేని రీతిలో టెండర్..
ఏపీటీడీసీ టెంట్ సిటీ నిర్మాణానికి పిలిచిన టెండర్లను పరిశీలిస్తే లోగుట్టు ఇట్టే అర్థమవుతుంది. ఎక్కడైనా అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులతో నిర్మాణాలు చేస్తే వాటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద గుర్తిస్తారు. ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల్లో ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో నిర్మాణాలు చేయిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు, డిజైన్లకు లోబడి నిర్మాణాలుంటే కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిస్తుంది.
మరో పద్ధతిలో.. అప్పటికే ఉన్న ఆస్తుల నిర్వహణకు లీజు ప్రాతిపదికపైన ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) కిందకి వస్తుంది. కానీ, టెంట్ సిటీకి కోసం ఏపీటీడీసీ పిలిచిన టెండర్లలో మాత్రం భూమి ప్రభుత్వానిది.. నిర్మాణ పెట్టుబడీ ప్రభుత్వానిదే.. కట్టేది కాంట్రాక్టరు. పైగా.. 33 ఏళ్ల పాటు దీనిని అనుభవించేది కూడా సదరు కాంట్రాక్టరే!
దేశంలో ఎక్కడాలేని రీతిలో ఏపీటీడీసీ తీసుకొచ్చిన కొత్త తరహా టెండర్ ఇది! స్థానిక టీడీపీ కూటమి ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ రంగంలోని వ్యక్తులకు ఈ టెంట్ సిటీని కట్టబెట్టేందుకు అనుభవంతో పనిలేకుండా తెలివిగా నిబంధనలు రూపొందించారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, ఈ టెంట్ సిటీ నిర్వహణ ప్రారంభమైన 11 ఏళ్ల తర్వాతే లీజు రెంట్ పెంపు నిర్ణయం కొసమెరుపు.