కొల్లా దుర్గ (ఫైల్)
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాలు
చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపథ్యంలో రేగిన చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట మల్లేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా కొడుకుతో కలిసి తెనాలిలోని సీఎం కాలనీలో ఉంటున్న కొల్లా దుర్గ(28)తో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్నాడు.
కొంతకాలంగా మల్లేష్‌కు, దుర్గకు మధ్య మనస్పర్థలొచ్చాయి. ఇవి కేసుల వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మల్లేష్ ఇంటికి వెళ్లిన కొల్లా దుర్గతో అతని కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. ఆవేశంలో దుర్గతోపాటు మల్లేష్ కుటుంబ సభ్యులు పరస్పరం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో దుర్గకు 80శాతం శరీరం కాలిపోయింది. మల్లేష్ భార్య, పిల్లలతో సహా తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కొల్లా దుర్గ ఆదివారం ఉదయం మరణించింది.
కేసును పక్కదారి పట్టిస్తున్నారు
తన కుమార్తె దుర్గది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి ప్రతివాడ చిన్ని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ ఫిర్యాదును తీసుకోవడం లేదని ఆరోపించారు. మృతురాలి తల్లి, అక్కచెల్లెళ్లు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ దుర్గపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా చంపారని కన్నీరుమున్నీరయ్యారు.


