నేడు విజయవాడలో రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం

Two Flyovers Start Today In Vijayawada - Sakshi

రూ.15,591.9 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్‌ చేతుల మీదుగా కార్యక్రమాలు

సాక్షి, అమరావతి: విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెంజ్‌ సర్కిల్, కనకదుర్గ ఫ్‌లైఓవర్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు.

భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్‌లైఓవర్‌ మీదుగా వాహనాల రాకపోకలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ లాంఛనంగా  ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్‌లైఓవర్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ అత్యంత సాంకేతిక విలువలతో రూ.501 కోట్లతో నిర్మించిన కనకదుర్గ ఫ్‌లైఓవర్‌ విజయవాడ నగరానికి మకుటంలా నిలుస్తుందన్నారు.  (దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు) 

►రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. 
►ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. 
 
విజయవాడ ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్టే: సోము
సాక్షి, అమరావతి: దుర్గ గుడి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2.6 కి.మీ  పొడవుతో  వంపులు తిరుగుతూ ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్‌ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.   
   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top