భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే చేతి కర్రలు: టీటీడీ చైర్మన్‌

TTD Chairma Bhumana Distributed Hand Sticks To Tirumala Devotees - Sakshi

తిరుపతి కల్చరల్‌: అలిపిరి నడక మార్గంలో క్రూరమృగాల సంచారం నేపథ్యంలో అనేక భద్రతా చర్యలు తీసుకున్నామని, ఇందులో ఓ చర్యగా భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి చేతి కర్రలు అందజేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన బుధవారం భక్తులకు చేతి కర్రలను అందజేశారు.

మీడియాతో భూమన మాట్లాడుతూ.. చేతి కర్రలతో భక్తులు క్రూరమృగాలతో పోరాడతారని కాదని, చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా వెనకాడుతుందని శాస్త్రీయ పరిశీలన ద్వారా రుజు వైందని చెప్పారు. వేల ఏళ్ల నుంచి గ్రామాల్లో ప్రజలు పొలాలకు, అడవులకు వెళ్లేటప్పుడు చేతి కర్రలను ఆసరాగా తీసుకెళుతుంటారని గుర్తుచేశారు. కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చేతి కర్రలను భక్తులకు ఉచితంగా అందిస్తామని, వీటిని అలిపిరిలో అందజేసి  శ్రీనర­సింహస్వామి వారి ఆలయం వద్ద తిరిగి తీసుకుంటామని తెలిపారు.

టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం తిరుమల శిలాతోరణం వద్ద, ఏడో మైలు వద్ద చిరుతల సంచారాన్ని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో గాలిగోపురం నుంచి వంద మంది భక్తులను గుంపులుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లోనున్న అలిపిరి నడక మార్గంలో ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు, వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రతిపాదనలు పంపామని, వారు తగిన డిజైన్లతో అంగీకారం  తెలిపితే కంచె నిర్మిస్తామన్నారు. చేతి కర్రల కోసం అడవిని నాశనం చేయడం లేదని, పది వేల కర్రలు మాత్రమే తీసుకున్నామని, ఇందు కోసం రూ.45,000 ఖర్చయిందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top