కోవిడ్‌ ఎఫెక్ట్‌: 90 రోజుల వరకు శ్రీవారి దర్శన అవకాశం

TTD To Announce Special Guidelines For Tirumala Darshan  - Sakshi

సాక్షి, తిరుమల: ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్‌ బుక్‌ చేసుకుని ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి రావాల్సిన భక్తులు.. కోవిడ్‌ కారణంగా రాలేని పరిస్థితుల్లో ఉంటే వచ్చే 90 రోజుల వరకు వారు దర్శన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో టీటీడీ పలు నిర్ణయాల ను తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్‌ టోకెన్ల జారీని నిలిపేసింది. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

తిరుమలలో దివ్యప్రబంధ పారాయణం
రామానుజాచార్యుల వారి 1,005వ అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల పెద్దజీయర్‌ మఠంలో ఆదివారం రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణాన్ని నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. మానవాళికి కరోనా ముప్పు తొలగించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపడుతోన్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పారాయణాన్ని నిర్వహించారు. పెద్దజీయర్, చిన్నజీయర్‌ స్వాములు, వారి శిష్యబృందం, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి ఆచార్య కె.రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top