రేపటి నుంచి వెబ్‌ ఆప్షన్లు | TS EAPCET web option entry will begin on July 6 2025 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

Jul 5 2025 5:44 AM | Updated on Jul 5 2025 5:44 AM

TS EAPCET web option entry will begin on July 6 2025

కీలక దశకు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

ఇప్పటికీ పూర్తికాని కాలేజీల అఫిలియేషన్లు

జేఎన్టీయూహెచ్‌లో కొన్ని కాలేజీలపై సందేహాలు

కొత్త సీట్లు ఈ ఏడాది లేనట్టే

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం నుంచి మొదలవుతుంది. విద్యార్థులకు ఇదే కీలకం. ఆప్షన్ల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. బ్రాంచీ, కాలేజీని ఎంపిక చేసుకునేది ఇప్పుడే. కౌన్సెలింగ్‌ ప్రక్రియ గత నెల 28 నుంచి మొదలైంది. తొలి దశ కౌన్సెలింగ్‌ కోసం 7వ తేదీ వరకు రిజి్రస్టేషన్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ధృవపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. దీనికి 10వ తేదీ వరకు గడువు ఉంటుంది. శుక్రవారం సాయంత్రం వరకు 92,013 మంది ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 55,120 మందికి సర్టీఫికేట్‌ వెరిఫికేషన్‌ పూర్తయింది. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే నాటికి దాదాపు 2 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది.

ఇంకా తేలని కాలేజీలు, సీట్ల లెక్క 
వెబ్‌ ఆప్షన్ల సమయంలో కౌన్సెలింగ్‌లో పాల్గొనే అన్ని కాలేజీలు, వాటిల్లో బ్రాంచీలు, సీట్ల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలి. కానీ, ఇప్పటివరకు జవహర్‌లాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్‌) నుంచి సాంకేతిక విద్య విభాగానికి అఫిలియేషన్‌ వివరాలు అందలేదు. దీంతో సీట్ల సంఖ్యపై స్పష్టత కొరవడింది. జేఎన్టీయూహెచ్‌ పరిధిలో 139 అనుబంధ గుర్తింపు కాలేజీలున్నాయి. ఈ ఏడాది ఒక ప్రైవేటు ఇంజనీరింగ్‌ సంస్థ డీమ్డ్‌ హోదా పొందింది. దీని పరిధిలోని కాలేజీలు కౌన్సెలింగ్‌లో ఉండే అవకాశం లేదు. మరో రెండు కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేశాయి.

రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. ప్రభుత్వ వర్సిటీలకు చెందిన కాలేజీలు 19 ఉన్నాయి. మొత్తం 175 కాలేజీలు గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. ఈ సంవత్సరం కొత్తగా పాలమూరు, శాతవాహన, కొత్తగూడెం హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. దీంతో 176 ఇంజనీరింగ్‌ కాలేజీలు కౌన్సెలింగ్‌ జాబితాలో ఉంటాయి. వీటి పరిధిలో 89,970 సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. శనివారం సాయంత్రానికి గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల వివరాలు సాంకేతిక విద్య విభాగానికి పంపుతామని జేఎన్టీయూహెచ్‌ అధికారులు తెలిపారు. 

విద్యార్థుల అవగాహనకు మాక్‌ కౌన్సెలింగ్‌ 
వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు ఈసారి కొత్తగా మాక్‌ కౌన్సెలింగ్‌ చేపడుతున్నారు. ఈ నెల 13వ తేదీన విద్యార్థులకు సీటు, బ్రాంచీ వివరాలతో మెసేజ్‌ వస్తుంది. దీన్నిబట్టి కాలేజీలు, బ్రాంచీలను ఈ నెల 15వ తేదీ వరకు మార్చుకునే వీలుంది. 15న సీట్ల కేటాయిస్తారు.  

కొత్త సీట్లు లేనట్టే 
డిమాండ్‌ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గింపు.. కంప్యూటర్స్, ఎమర్జింగ్‌ కోర్సుల్లో సీట్లు పెంపు కోసం దాదాపు 100 కాలేజీలు దరఖాస్తు చేయగా ప్రభుత్వం తిరస్కరించింది. సర్కారు ఓకే చెప్పి ఉంటే దాదాపు 20 వేల సీట్లు కంప్యూటర్‌ కోర్సుల్లో పెరిగేవి. ప్రభుత్వం ఒప్పుకోకపోవటంతో ఈసారి సీట్లు పెరిగే వీలు లేదు. మరోవైపు పాత ఫీజులనే వసూలు చేయా లని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపైనా స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంజనీరింగ్‌ అయిపోయే వరకు ఇదే ఫీజు ఉంటుందా? ఒక వేళ ఫీజు పెంచితే కొత్త ఫీజు మధ్యలో వసూలు చేస్తారా? అనే స్పష్టత కోరుతున్నారు.  

అంతా సిద్ధం చేశాం 
వెబ్‌ ఆప్షన్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. సాంకేతిక సమస్యలొచ్చినా యంత్రాంగం తక్షణమే స్పందిస్తుంది. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే నాటికి అఫిలియేషన్‌ కాలేజీలు, సీట్ల వివరాలు అందుబాటులోకి వస్తాయి.  – శ్రీనివాస్, ఎప్‌సెట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌

జాబితా రెడీ చేశాం 
అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాం. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అన్నీ పరిశీలించి గుర్తింపు ఇచ్చాం. తుది జాబితాను సాంకేతిక విద్యకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. సీట్ల పెంపు ప్రతిపాదనేమీ లేదు.  – డాక్టర్‌ కె విజయకుమార్‌ రెడ్డి, జేఎన్టీయూహెచ్‌ రెక్టార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement