ఎక్కడి రైళ్లు అక్కడే

Train Accident Effect cancellation of trains and diversion - Sakshi

వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు

పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు యథాతథం

ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు, యంత్ర సామగ్రి

విశాఖ నుంచి సహాయక చర్యల కోసం మూడు ప్రత్యేక రైళ్లు  

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/విశాఖపట్నం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంకటాపల్లి–ఆలమండ మధ్య ఆదివారం రాత్రి విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక పాసింజర్‌ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదం కారణంగా వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచి­పోయాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు మాత్రం యథాతథంగా నడుస్తున్నాయి.

ప్రమాద వివరాలను తెలియజేసేందుకు ఎక్కడికక్కడ సహా­య కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌ లైన్‌ నంబర్ల 0891–2746330/­0891–2744619ను ఏర్పాటు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వాల్తేర్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌ ప్రసాద్, అధికారులు, సిబ్బంది ప్రత్యేక రైలులో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 120 టన్నుల, 140 టన్నుల సామర్థ్యం గల క్రేన్లతో జీఆర్పీ, రైల్వే అధికారులు, సిబ్బందితో మరో రెండు ప్రత్యేక రైళ్లు బయల్దేరాయి. 

ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు
ఈ ఘటనతో విజయనగరం వైపు వెళ్లాల్సిన, విజయనగరం వైపు నుంచి రావలసిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ రైళ్లలో కొన్నింటిని దారి మళ్లించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో చెన్నై సెంట్రల్‌–హౌరా (12842) కోరమాండల్, యశ్వంత్‌పూర్‌–పూరీ (22842) గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించే వరకు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో నిలిపివేశారు. 

రద్దయిన రైళ్లు
సోమవారం రాయ్‌పూర్‌–విశాఖపట్నం–రాయ్‌పూర్‌ (08527/08528) పాసింజర్‌ స్పెషల్‌ రద్దు చేశారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–కోర్బా ఎక్స్‌ప్రెస్‌ కూడా రద్దయింది.

దారి మళ్లించిన రైళ్లు
ఈ దిగువ రైళ్లను ఆదివారం రెగ్యులర్‌ మార్గం విశాఖపట్నం–విజయవాడ మీదుగా కాకుండా టిట్లాఘడ్‌–రాయ్‌పూర్‌–నాగ్‌పూర్‌–బల్హార్షా–విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 28వ తేదీన బారునిలో బయల్దేరిన బారుని–కోయంబత్తూర్‌ (03357) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన టాటాలో బయల్దేరిన టాటా–ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 29వ తేదీన భువనేశ్వర్‌లో బయల్దేరిన భువనేశ్వర్‌–ముంబయ్‌ (11020) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–సికింద్రాబాద్‌ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించారు.

గమ్యం కుదించిన రైళ్లు ఇవీ
► 29న సంబల్‌పూర్‌లో బయల్దేరిన సంబల్‌పూర్‌–నాందేడ్‌(20809)ఎక్స్‌ప్రెస్‌ విజయనగరం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి సంబల్‌పూర్‌ చేరుకుంది.
► నెల 29న పూరీలో బయల్దేరిన పూరీ–తిరుపతి (17479) ఎక్స్‌ప్రెస్‌ బలుగాం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి పూరీ చేరుకుంది.
► 29న విశాఖపట్నంలో బయల్దేరిన విశాఖపట్నం–విజయనగరం (07468) పెందుర్తి నుండి విశాఖకు చేరుకుంది.
► 28వ తేదీన ముంబైలో బయల్దేరిన ముంబై–భువనేశ్వర్‌ (11019) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్నం వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌–ముంబై (11020) రైలుగా ముంబై బయల్దేరుతుంది.

ఆర్టీసీ అప్రమత్తం
రైళ్ల ప్రమాద ఘటనతో ఆర్టీసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి విజయనగరం నుంచి 10, సింహాచలం నుంచి 5, గాజువాక నుంచి 3, ఎస్‌.కోట నుంచి 2 బస్సులను పంపించారు. క్షతగాత్రులను ఈ బస్సుల్లో వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరో 5 బస్సులను విజయనగరంలో సిద్ధం చేశారు. పార్వతీపురం, పలాస వైపు వెళ్లే ప్రయాణికులకు, ప్రమాదం వల్ల వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం విశాఖ ద్వారకా బస్‌ స్టేషన్‌లో సరిపడినన్ని బస్సులను అందుబాటులో ఉంచామని ఆర్టీసీ జోన్‌–1 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సి.రవికుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్‌లో కూడా బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు. విశాఖ ద్వారకా బస్‌ స్టేషన్‌లో ఇద్దరు అధికారులను నియమించామని, ఘటనా స్థలానికి మరికొందరు అధికారులను పంపించామని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top