తల్లీకొడుకులపై పిడుగు | Tragedy In Pendhurthi With Thunderstorm | Sakshi
Sakshi News home page

తల్లీకొడుకులపై పిడుగు

Jun 9 2021 4:40 AM | Updated on Jun 9 2021 4:59 AM

Tragedy In Pendhurthi With Thunderstorm - Sakshi

తీవ్రగాయాల పాలైన పావనిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం , రోహిత్‌ (ఫైల్‌)

పెందుర్తి: విశాఖపట్నం పెందుర్తి సమీపంలోని పులగానిపాలెం నల్లక్వారీ కాలనీలో మంగళవారం తల్లీకొడుకులపై పిడుగుపడింది. కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి కొట్టే ప్రవీణ్‌కుమార్, పావని దంపతులు గాజువాకలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు రోహిత్‌ (6) ఉన్నాడు. పావని, రోహిత్‌ కొద్దిరోజుల కిందట పెందుర్తిలోని ఆమె పుట్టింటికి వచ్చారు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో మేడపై ఆరబెట్టిన దుస్తులు తీసేందుకు పావని వెళ్లింది. ఆమెతో పాటు రోహిత్‌ కూడా వెళ్లాడు. అదేసమయంలో వీరిపై పిడుగుపడింది. రోహిత్‌ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. పావని తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు పావనిని 108లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మమ్మ ఇంట్లో సరదాగా గడిపేందుకు వచ్చిన రోహిత్‌ అకాల మరణంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Advertisement
 
Advertisement
Advertisement