ఆ దంపతులేమయ్యారు?.. దారి తప్పారా లేక మరేదైనా..!

Trader Couple From Proddatur Goes Missing in Ahobilam - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు: ఎగువ అహోబిలంలో కనిపించకుండా పోయిన దంపతుల కోసం పోలీసులు విస్తతంగా గాలిస్తున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని నంగనూరుపల్లెకు చెందిన పల్లెబోయిన నరసింహులు, నీలిమా అనే దంపతులు ఈ నెల 21న కర్నూలు జిల్లాలోని అహోబిలం క్షేత్రానికి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు 23న ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఎగువ అహోబిలం సమీపంలోని కారంజ నరసింహస్వామి ఆలయం సమీపంలో నరసింహులుకు చెందిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంపతులిద్దరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లి దారి తప్పి తప్పారా లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో దంపతుల అదృశ్యానికి సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. వారి సాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

చదవండి: (వదినతో వివాహేతర సంబంధం.. అన్నకు తెలిసి..)

ప్రతి నెలా అహోబిలం వెళ్లేవారు.. 
నంగనూరుపల్లె గ్రామానికి చెందిన నరసింహులు ప్రొద్దుటూరులోని కోనేటికాల్వ వీధిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. వారికి సంతానం లేదు. గతంలో చీరల దుకాణం ఉండగా కొన్ని నెలల క్రితం మరొక రెడిమేడ్‌ షాపును ప్రారంభించారు. రెండు షాపుల నిర్వహణ బాధ్యతలను భార్యాభర్తలే చూసుకునేవారు. గతంలో ఇంట్లోనే బట్టల వ్యాపారం చేస్తుండగా ఏడేళ్ల నుంచి కోనేటికాల్వ వీధిలో ఇల్లు బాడుగకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. షాపు నిర్వహిస్తున్న ఇంటిపైనే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు మాత్రం నంగనూరుపల్లెలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు.

దంపతులిద్దరూ ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున అహోబిలం వెళ్తుంటారు. ముందు రోజు రాత్రి వెళ్లి దర్శనం ముగించుకొని మరుసటి రోజు రాత్రికి ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో ఈ నెల 21న బైక్‌లో నరసింహులు, నీలిమా అహోబిలం వెళ్లారు. ఇప్పటివరకు ఇంటికి రాకపోవడంతో దుస్తుల కొనుగోలుకు వెళ్లారేమోనని కుటుంబ సభ్యులు భావించారు. ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు అహోబిలం వెళ్తారని గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్లి గాలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజులైనా వారి జాడ కనిపించకపోవడంతో గ్రామంలోని బంధువులు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: (పెళ్లైన యువకుడి నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన..)

ఆర్థిక సమస్యలపైన అనుమానం..
వ్యాపారం కోసం నరసింహులు అనేక మంది వద్ద అప్పు తీసుకున్నట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. స్వగ్రామంలోనే అప్పులిచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. బాకీలు రూ. కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా రెండు బట్టల షాపులు మూసి ఉండటంతో అప్పులిచ్చిన వారు నంగనూరుపల్లెలోని నరసింహులు ఇంటి వద్దకు వెళ్తున్నారు. వారికి జవాబు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనికి ఆర్థిక సమస్యలు ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ పోలీసులకు తెలిపారు. ఈ కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top