వెజి‘ట్రబుల్‌’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ

tomato yields worldwide India second place - Sakshi

కూరగాయల సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్లకు ప్రభుత్వం ప్రోత్సాహం

ప్రపంచవ్యాప్తంగా టమాటా దిగుబడిలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్,టర్కీ తరువాత స్థానాల్లో నిలిచాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే టమాటాల్లో 34.72 శాతం చైనాలోనే పండిస్తున్నారు. అక్కడ 10.82 లక్షల హెక్టార్లలో టమాటా సాగవుతోంది.

ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులతో పంట దిగుబడులతో పాటు నాణ్యత గణనీయంగా తగ్గిపోతోంది

2100 సంవత్సరం నాటికి పంట దిగుబడులకు 10–40 శాతం నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ నివేదికల అంచనా.

రబీ పంటలపై ఈ ప్రభావం మరింత అధికమని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) అధ్యయనంలో తేలింది.

ప్రాసెస్‌ చేసిన టమాటా ప్యూరీ (గుజ్జు) వినియోగం అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అధికం. దీనివల్ల ధరలు భగ్గుమనే అవకాశాలు తక్కువ. సెంటో, గ్లెన్లాంటి కంపెనీలు వీటిని తయారు చేస్తుంటాయి. 

మిరపకాయలతో చేసిన చిల్లీ ప్యూరీ, ఉల్లిపాయలతో తయారైన ఆనియన్ప్యూరీ కూడా అక్కడ విస్తృతంగా లభిస్తాయి.

-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! 

టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! 

ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!!

సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? 

సీజన్లో సద్వినియోగం..
వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్‌ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి!  టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్‌లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్‌ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది.

సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్‌ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్‌ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! 

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్‌ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి.

తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్‌ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్‌ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్‌ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్‌4 ఎస్‌’ అనే కంపెనీ ప్రాసెసింగ్‌ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్‌ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్‌ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. 

డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్‌ యూనిట్లు.. 
ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్‌ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్‌ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్‌ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు.

పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్‌ యూనిట్లను ఒక క్లసర్‌ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్‌ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. 

పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్‌
కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్‌లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్‌ లైన్, డీ హైడ్రేషన్‌ లైన్‌ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ గుజ్జు, ఐక్యూఎఫ్‌ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. 

రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి
ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్‌ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది.    – ఎల్‌.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top