
నేడు మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి
సీఎంగా పాలించినది ఐదేళ్ల మూడు నెలలు.. ఆ కొద్దికాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించిన మహా నేత
సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు
అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలు అందించిన మానవతామూర్తి
కడలిపాలవుతున్న నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, ఎల్లంపల్లితో పాటు 86 సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టిన భగీరథుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా.. పేదింటి పిల్లలు ఉన్నత విద్య చదివేలా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆరోగ్యానికి భరోసా కల్పించే ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలతో పాలకులకు టార్చ్‌బేరర్‌గా నిలిచిన పాలనాదక్షుడు..పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు ప్రవహించేలా చేసి.. ఉపాధి అవకాశాలను సమృద్ధిగా కల్పించి.. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు ఉమ్మడి ఏపీని గమ్యస్థానంగా మార్చి, ఆర్థిక మాంద్యం ముప్పును అధిగమించడమెలాగో చాటిచెప్పిన ఆర్థికవేత్త..సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత...పాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన సంస్కరణశీలి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి..! ఆ మహా నేత 76వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
సాక్షి, అమరావతి : మనసు ఉండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేతల్లో చాటారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (వైఎస్సార్). ఉమ్మడి ఏపీకి ఆయన సీఎంగా పనిచేసినది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మైలురాళ్లలాంటి సంక్షేమ పథకాలను, చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి కార్యకమ్రాలను చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైఎస్ పథకాలను కొనసాగించక తప్పని పరిస్థితి. వాటి పేర్లు మార్చి వైఎస్ ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
జనం కోసం ఎందాకైనా..
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. 1978లో రాజకీయ అరంగేట్రం నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం వరకు తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు.
అటు కేంద్రంలో... ఇటు ఉమ్మడి రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారిన దశలో పాదయాత్ర చేశారు వైఎస్సార్. మండుటెండలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి 1,475 కిలోమీటర్లు నడిచి జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. కాంగ్రెస్‌ను 2004లో ఉమ్మడి రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు.
పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన నేత
2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్సార్ పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాటి టీడీపీ సర్కారు రాక్షసంగా బనాయించిన కేసులను ఒకే ఒక్క సంతకంతో ఎత్తివేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004–09 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే దీనికి సాక్ష్యం.
ఆరోగ్యశ్రీతో ప్రజారోగ్యానికి భరోసా
రూ.168.52 కోట్లు..: 2004 మే 14–2007 జూన్ 26 మధ్య సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైఎస్సార్ విడుదల చేసిన మొత్తం. ఆ సమయంలో జబ్బునపడ్డ పేదల వేదన గమనించారు. ఆపత్కాలంలో సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడినవారిని, అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తరలించేలా 108 అంబులెన్స్ సర్వీసును తీసుకొచ్చారు వైఎస్సార్. గ్రామాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు.
పేదరికానికి విద్యతో విరుగుడు
పేదరికంతో ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూపకల్పన చేశారు. దీంతో లక్షలాది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న అగ్రవర్ణ విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం... తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీ, తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్ సమీపంలో ఏర్పాటయ్యేలా చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడులో ట్రిపుల్ ఐటీలను స్థాపించి లక్షలమందికి ఉన్నత చదవులు దక్కేలా చేశారు.
తెలుగునేల సుభిక్షం కోసం భగీరథ యత్నం
‘1978లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాక.. కోస్తా జిల్లాల పర్యటనకు వెళ్లాను. అక్కడి కాలువలను చూశాను. కరువు ప్రాంతాల్లో కూడా ఇలా నీళ్లు పారించాలని నాలో సంకల్పం ఏర్పడింది. నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని అడిగితే దోసిలి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. దీంతో నా సంకల్పం మరింత బలపడింది’ అని 2004లో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే సమయంలో వైఎస్సార్ గుర్తు చేసుకున్నారు.
కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతో సహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేసి దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు.

పొదుపు వ్యవస్థలో విప్లవం ‘పావలా వడ్డీ’
ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి అతి భారీ వడ్డీలు వసూలు చేస్తున్న సమయంలో... మహా నేత ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్న పావలా వడ్డీ పథకం చలనం సృష్టించింది. దేశమంతా డ్వాక్రా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చింది. రాష్ట్రంలో నేడు గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల వరకు పొదుపు సంఘాలున్నాయి. వీటిలో 2,90,928 సంఘాలు వైఎస్సార్ సీఎంగా ఉన్న 2004–08 మధ్య ఏర్పడినవే. దీనికి పావలా వడ్డీ అమలే ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పావలా వడ్డీ పథకం ప్రభావంతో నేడు పొదుపు సంఘాలకు రూ.3 లక్షల్లోపు రుణాలను బ్యాంకులు 7% వడ్డీకే ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
అజేయుడు
వైఎస్సార్ 1978ఎన్నికల్లో పులివెందుల నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983, 1985 లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1989, 1991, 1996, 1998లో కడప ఎంపీగా గెలుపొందారు. 1999 నాటికి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాదితో పాటు, 2004, 2009 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. 31 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఓటమి లేకుండా.. ఆరుసార్లు అసెంబ్లీకి, నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
నేడు వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం
హాజరు కానున్న మాజీ ఎంపీలు, హైకోర్టు మాజీ జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా హైటెక్ సిటీ బుట్టా కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ న్యాయమూర్తులు పి.లక్ష్మణ రెడ్డి, నాగార్జున రెడ్డి, బి.శేషశయన రెడ్డి, జి.కృష్ణ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు అజేయ కల్లం, కేఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీలు వి.దినేష్ రెడ్డి, సీఎన్ గోపీనాథ్ రెడ్డిలతో పాటు వైఎస్సార్‌తో కలిసి పనిచేసిన అధికారులు పాల్గొంటారని ఈశ్వర ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.
ఆయన పథకాలు.. దేశానికే మార్గదర్శకాలు
వ్యవసాయాన్ని పండుగ చేసే ఉచిత విద్యుత్, బంజరు నేలను సస్యశ్యామలం చేసే జలయజ్ఞం.. పేదలను విద్యావంతులను చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల వైద్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ,.. ఆపత్కాలంలో ఆదుకునే 108.. ఇతరరాష్ట్రాలూ చేపట్టాయి. ఆరోగ్య శ్రీ స్ఫూర్తితో మోదీ సర్కారు ఆయుష్మాన్ భారత్‌ను చేపట్టడం విశేషం. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాల్సిందేనని అప్పట్లో ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం.. అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించారంటేనే వైఎస్ గొప్పదనం ఏమిటో తెలుస్తోంది.