కందుకూరులోని రెండు, కొండపిలోని కేంద్రాల్లో వేలం నిలిపివేత
కనిగిరి రోడ్డుపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి పెద్ద ఎత్తున రైతుల ధర్నా
కందుకూరు /కొండపి: రోజురోజుకూ పొగాకు ధరలు పతనమవుతుండడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం కేంద్రాల్లో దిగజారుతున్న ధరలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. బుధవారం ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు కేంద్రాల్లో ధరలు దారుణంగా పతనమవడంతో వేలాన్ని అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. ప్రధానంగా కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రానికి పొన్నలూరు మండలం విప్పగుంట క్లస్టర్ రైతులు బేళ్లు తీసుకొచ్చారు.
అయితే ఎఫ్2 రకం బేళ్లకు క్వింటాకు రూ.16 వేలు మాత్రమే ధర రావడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేలాన్ని అడ్డుకుని కేంద్రం అధికారులతో వాదనకు దిగారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో కనిగిరి రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకుని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసి పొగాకు పండించామని, ఈ విధంగా ధరలు ఉంటే అప్పులు ఎలా తీరుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కందుకూరు రెండో వేలం కేంద్రానికి మాలకొండరాయునిపాలెం, కొండసముద్రం క్లస్టర్ల రైతులు బేళ్లను తీసుకొచ్చారు. ఇక్కడ కూడా క్వింటా రూ.17 వేలు పలకడంతో రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. ఈ ధరలకు పొగాకు అమ్మే ప్రసక్తే లేదంటూ వేలాన్ని పూర్తిగా నిలిపేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కొండపిలోనూ నిలిచిన పొగాకు వేలం
ప్రకాశం జిల్లా కొండపి వేలం కేంద్రంలో బుధవారం అధిక సంఖ్యలో పొగాకు బేళ్లు తిరస్కరణకు గురవడంతో రైతులు వేలాన్ని మధ్యలోనే అడ్డుకొని నిలిపేశారు. క్లస్టర్ పరిధిలోని గుర్రప్పడియ మూగచింతల, కె.అగ్రహారం నెన్నూరుపాడు, చతుకుపాడు గ్రామాల రైతులు వేలం కేంద్రానికి బేళ్లు తీసుకొచ్చారు.
మొదటి రెండు లైన్లు కొనుగోలు అయ్యే సరికి అధిక మొత్తంలో బేళ్లు తిరస్కరణకు గురవడాన్ని గమనించిన రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. కేజీ రూ.160కి కూడా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వేలం కేంద్ర నిర్వహణ అధికారితో రైతులు వాగ్వాదానికి దిగారు. అసలే మద్దతు ధర లేక అల్లాడిపోతుంటే కనిష్ట ధర కిలో రూ.160కు అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


