తిరుపతి–పీలేరు రహదారికి మహర్దశ.. వెయ్యి కోట్లతో..

Tirupati Pileru Road Expansion Government of Andhra Pradesh 1000 Crores - Sakshi

సుమారు రూ.వెయ్యికోట్లతో విస్తరణ 

మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం   

ట్రాఫిక్‌ సర్వే చేస్తున్న డిజైన్‌ కన్సల్టెంట్స్‌ 

చంద్రగిరి: జాతీయ రహదారికి మహర్దశ పట్టనుంది. నిత్యం ప్రమాదాలతో నెత్తరోడుతున్న రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భాకరాపేట కనుమలో ఇక సాఫీగా ప్రయాణం చేసే అవకాశం దక్కబోతోంది. తిరుపతి–పీలేరు జాతీయ రహదారిని నాలుగులేన్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తిరుపతి–పీలేరు జాతీయ రహదారి రెండులేన్ల రహదారి కావడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల భాకరాపేట కనుమలో చోటుచేసుకున్న ప్రమాదంలో పదుల సంఖ్యలో  ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మార్చి 30న రోడ్‌ సేఫ్టీ అడిషనల్‌ డీజీపీ కృపానంద త్రిపాఠి ఉజేల ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. 

చదవండి: ('నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే')

సుమారు రూ.వెయ్యికోట్లు మంజూరు  
భాకరాపేట బస్సు రోడ్డు ప్రమాద అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం తిరుపతి–పీలేరు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడానికి పచ్చజెండా ఊపింది. సుమారు రూ.వెయ్యికోట్ల వ్యయంతో పనులను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే టోపో సర్వేను పూర్తి చేసింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని వెంకట పద్మావతి ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలో నేషనల్‌ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) డిజైన్‌ కన్సల్టెంట్‌ అధికారులు ట్రాఫిక్‌ సర్వేను నిర్వహిస్తున్నారు. రోజుకు ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

అందులో హెవీ వెహికల్స్‌ ఎన్ని, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇతరత్రా వాహనాల రాకపోకలపై సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు ఈ సర్వే ఉంటుందన్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత నాలుగు లేన్ల రోడ్డు వెడల్పు, డిజైన్‌ రూపొందించనున్నట్లు వివరించారు. మరో మూడు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. జాతీయ రహదారి పనులు పూర్తయితే భాకరాపేట కనుమ ప్రమాదాలకు చెక్‌ పడుతుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top