
ఆర్టీఓ కారు కింద పడుకొని టిప్పర్ యజమాని ఆగ్రహం.. ప్రకాశం జిల్లాలో ఘటన
ప్రకాశం జిల్లా: ఆర్టీఓ అధికారులకు మామూళ్లు ఇచ్చిన వాహనాలను వదిలేస్తున్నారని, ఇవ్వని వాహనాలకు భారీ ఎత్తున పెనాల్టీలు వేస్తున్నారని ఆగ్రహంతో పేర్నమిట్టకు చెందిన ఒక టిప్పర్ యజమాని ఆర్టీఓ డిపార్టుమెంట్‌కు చెందిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఇది. ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు చెరువు కట్ట వద్ద కర్నూల్‌రోడ్డు మీద సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... చీమకుర్తి నుంచి ఒంగోలు వైపు గ్రానైట్ డస్ట్‌ను తీసుకొస్తున్న టిప్పర్‌పై ఓవర్‌లోడు పేరుతో దాదాపు రూ.53 వేలు పెనాల్టీ వేసినట్లు తెలిసింది. అంతకుముందు కొద్దిరోజుల క్రితం అదే వాహనానికి సుమారు రూ.80 వేల వరకు పెనాల్టీ వేశారని సమాచారం. ఇలా ఒకే వాహనానికి పెనాల్టీల మీద పెనాల్టీలను వేస్తూ మరో ప
క్క మామూళ్లు ఇచ్చిన వాహనాలను కళ్లెదుటే వదిలేస్తుండటంతో ఆ టిప్పర్ యజమాని ఆగ్రహం తారస్థాయికి చేరుకుంది. తన టిప్పర్‌ను ఒక్కదానినే కాటా వద్దకు ఎందుకు తీసుకుపోతున్నారని, గ్రానైట్ లోడుతో వెళ్తున్న ఇతర టిప్పర్‌లను ఎందుకు పట్టించుకోవడం లేదని, వాటికి ఎందుకు పెనాల్టీలను వేయటం లేదని బాధిత టిప్పర్ యజమాని ఆర్‌టీఓ అధికారులను నిలదీశాడు. అంతే కాకుండా తన ఒంటిపై ఉన్న చొక్కాను విప్పదీసి ఆర్టీఓ అధికారుల కారుకు అడ్డంగా పడుకొని తనను తొక్కించుకుంటూ పోండని, ఇలా పెనాలీ్టలను వేస్తూ ఉంటే తాము టిప్పర్‌లను ఎలా తిప్పగలమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల ఫిర్యాదు
కాగా, తన వాహనాన్ని అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించారని ఆర్టీఓ అధికారులు టిప్పర్ యజమానిపై సంతనూతలపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై బాధిత టిప్పర్ యజమానితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా, టిప్పర్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దానిపై ఇన్‌చార్జి ఆర్టీఓతో మాట్లాడే ప్రయత్నం చేయగా వారు ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.