రాష్ట్రంలో పెద్దపులి సంచారంపై కలకలం
మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ మగ పెద్దపులి
ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లాకు.. బంధించి పార్కులో విడిచిపెట్టినా తొలగని భయం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైగర్ సందేశాలు
సాక్షి, అమరావతి: ‘అదిగో పులి అంటే..ఇదిగో తోక’ అన్నట్లుంది సామాజిక మాధ్యమాల్లో కొందరి వైఖరి. రాష్ట్రంలో ఎక్కడో పులి కనిపించిందనే సమాచారం వస్తే చాలు.. క్షణాల్లో వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, హెచ్చరికల సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఏ సమాచారం వాస్తవం? ఏది పుకారు? అనే గందరగోళం జనంలో ఏర్పడుతోంది.
ఆరు నెలలుగా సంచారం
కేంద్ర ప్రభుత్వం 2022 పులుల గణన ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లో 63 పులులు ఉన్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 3,682కు చేరింది. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి ఓ పెద్దపులి ఈ ఏడాది ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లాలో కనిపించింది. ఫిబ్రవరి 7న అటవీశాఖ అధికారులు బంధించి, పాపికొండల జాతీయ పార్కులో విడిచిపెట్టారు. ఆగస్టులోనూ గోదావరి ప్రాంతంలో పులి సంచారంపై వార్తలు వెలువడ్డాయి. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పశువులపై పులి దాడులు చేస్తోందనే సమాచారంతో అటవీశాఖ అప్రమత్తమైంది. గోపాలపురం మండలం నందిగూడెం, టోకిరెడ్డిగూడెం పరిసరాల్లో పులి అడుగుజాడలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.
మళ్లీ కలకలం
తాజాగా ఈనెల 9 నుంచి గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలలో పులి సంచారంపై ప్రచారం జోరుగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి, కల్ధరి గ్రామాల మధ్య పొలాల్లో పులి కదలికలను గుర్తించారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం, చాగల్లు మండలం చిక్కాలపాలెం, అమ్మిగుంట, నిడదవోలు ప్రాంతాల్లోనూ పులి కనిపించిందనే ప్రచారం కలకలం రేపింది. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో శనివారం పులి సంచారం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. కొందరు తమ పంట చేలో పులి తారసపడిందని సమాచారం ఇవ్వడంతో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు రామన్నగూడెం చేరుకుని తనిఖీలు చేపట్టారు.
పుకార్లు..షికార్లు
వివిధ గ్రామాల పేర్లతో వస్తున్న సమాచారాన్ని బట్టి ప్రతి చోటా పులి కనిపించిందనడానికి లేదు. ఫిబ్రవరిలో పాపికొండల అటవీ ప్రాంతంలో పులిని విడిచిపెట్టిన తర్వాత, అదే పులి మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందంటూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన ఓ వీడియోలో కనిపించిన పులి అది కాదని అటవీశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు:
» పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయకూడదు.
» రాత్రివేళ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
» పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి.
» పులి సంచారంపై సమాచారం ఉంటే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలి.
» పాత వీడియోలు, ధ్రువీకరించని సందేశాలను ఇతరులకు పంపకూడదు.
» అటవీశాఖ జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలి.


