మూషిక జింక.. లగెత్తడమే ఇక.. ప్రపంచ జింక జాతు­ల్లో అతి చిన్నవి

They are the smallest animals in the deer family - Sakshi

పెద్దగా శబ్దం వినబడితే గుండె పగిలి మరణించే జీవి 

జింకల జాతిలోనే అతి చిన్న ప్రాణులివి

పాపికొండల అభయారణ్యంలో 500కు పైగా సంచారం 

వెదురు ఎలుకగా పిలుస్తున్న గిరిపుత్రులు

బుట్టాయగూడెం: ఒకప్పుడు మూషిక మొహం.. జింక దేహంతో అలరారిన పురాతన కాలం నాటి అతి చిన్న మూషిక జింకలు (మౌస్‌ డీర్‌) పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. అంతరించిన జంతువుల జాబితాలో కలిసిపోయిన ఆ బుల్లి ప్రాణులు ప్రపంచ జింక జాతు­ల్లో అతి చిన్నవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట.

అందుకే వీటిని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. భారత ఉప ఖండంలో మాత్రమే కనిపించే మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలోనూ ఉన్నట్టు వైల్డ్‌లైఫ్‌ అధికారులు గుర్తించారు. జానెడు పొడవు.. రెండు నుంచి మూడు కిలోల బరువుండే మూషిక జింకల సంరక్షణకు ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్‌ అధికారులు  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

 

శబ్దం వినబడితే ప్రాణం హరీ! 
మూషిక జింకలను స్థానిక గిరిజనులు వెదు­రు ఎలుకలని పిలుస్తారు. వీటికి భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు విన్నా.. ఏవైనా జం­తువులు దాడి చేసేందుకు వచ్చి నా.. ఎవరైనా వీటిని పట్టుకున్నా భయంతో గుండె పగిలి మరణిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మూషిక జింకలు రాత్రి వేళల్లో మా­త్రమే అడవిలో సంచరిస్తాయని పేర్కొంటున్నారు. ఇవి ఎక్కువగా వెదురు కూపుల్లోనే నివసిస్తుంటాయి. అడవిలో రాలిన పువ్వు­లు, పండ్లు, ఆకు­ల్ని తింటాయి.

ఉసిరి, మంగ కాయలు, పుట్ట గొడుగులు, పొదల్లోని లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూ­షి­క జింకల గర్భధారణ కాలం ఆరు నెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లల­ను మాత్రమే కంటుంది. మళ్లీ వెంటనే సంతానోత్పత్తికి సిద్ధం కా­వ­డం వీటి ప్రత్యేకత. చిరుతలు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, గద్దలు ఈ మూషిక  జింకలను వేటాడుతూ ఉంటాయి. వీటికి తో­డు అడ­వుల నరికివేత, అడవిలో కార్చిచ్చు, వేటగాళ్ల ముప్పు వం­టివి మూషిక జింకల ఉనికికి ప్రమాదంగా పరిణమిస్తున్నాయి.

పాపికొండల్లో వీటి సంఖ్య 500 పైనే 
అరుదైన మూషిక  జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలో ఎక్కువగానే ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన అరణ్యం ఉండటం.. వెదురు కూపులు ఎక్కువగా ఉండటంతో 500కు పైగా మూషిక జింకలు ఇక్కడ నివసిస్తున్నట్టు అంచనా. అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాలకు మూషిక జింకల జాడ చిక్కినట్టు చెప్పారు.  

సంతతి పెరుగుతోంది 
అరుదైన మూషిక జింకలు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ఇవి ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయే జీవులుగా ఉన్నా.. వీటి సంతతి ఇక్కడ  పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ట్రాప్‌ కెమెరాల్లో కూడా ఈ మూషిక జింకలు చిక్కాయి. ఇవి సంచరించే  ప్రాంతాల్లో జన సంచారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో వీటి ఉనికి బాగా పెరుగు తున్నట్టు గుర్తించాం.      
– దావీదురాజు నాయుడు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top