పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు | Sakshi
Sakshi News home page

పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు

Published Sat, Nov 4 2023 4:58 AM

There is not even a single rupee subsidy on the purchase of cattle - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరె­క్టర్‌ డాక్టర్‌ రెడ్నం అమరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపా­యి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు.  వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్‌ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభు­త్వం ఇచ్చిన చేయూ­త లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొను­క్కొంటారని చెప్పారు.

ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు  మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్‌ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్‌ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమే­యం లేకుండా లబ్ధిదా­రుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారు­లకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగో­లులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు.

బ్యాంక్‌ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయా­న్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులు­బాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్‌ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్ర­ప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిం­దే తప్ప వైఎస్సార్‌  చేయూత లబ్ధిదా­రు­లను గుర్తించడానికి కాదన్నారు. సాధార­ణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు.

ఈ పథకం లబ్ధిదారు­ల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్‌ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్‌ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement