వ్యాయామమే మంచి మందు  | Sakshi
Sakshi News home page

వ్యాయామమే మంచి మందు 

Published Sun, Apr 30 2023 2:19 AM

There is no medicine better than exercise for not only physical but also mental health - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి రోజూ అర గంటపాటు నడక, పరుగు, సైక్లింగ్, ఈత.. ఇలా ఏదో ఒకదాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నవారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా వరకు వ్యాధులను దరి చేరకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం వ్యాయామాన్ని మించిన మందు లేదని వివరిస్తున్నారు.

ఈ మేరకు అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. మందుల కంటే కూడా వ్యాయామంతోనే 1.5 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శారీరకంగా చురుకుగా ఉంటే విచారం, ఆందోళన, బాధ తదితరాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు సౌత్‌    ఆ్రస్టేలియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు.

ఇందులో భాగంగా 1.28 లక్షల మందిని పరిశీలించారు. ఆయా మానసిక సమస్యలను అధిగమించడానికి మందులు, కౌన్సెలింగ్‌ కంటే కూడా శారీరక శ్రమ చేస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటోందని వెల్లడించారు. ఈ అధ్యయనం ఆధారంగా గుర్తించిన అంశాలను బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో తాజాగా ప్రచురించారు.  

మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం 
పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, నిరాశ, ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడేవారిని పరిశీలించారు. ఈ క్రమంలో శారీరక శ్రమ/వ్యాయామం చేసేవారిలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్న గర్భిణులు, హెచ్‌ఐవీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వ్యాయామంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నట్టు స్పష్టమైంది.   

ప్రతి ఎనిమిది మందిలో ఒకరు     
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2.5 ట్రిలియన్‌ డాలర్ల వ్యయం చేస్తున్నారు. ఈ వ్యయం 2030 నాటికి 6 ట్రిలియన్‌ డాలర్‌లకు  పెరుగుతుందని అంచనా.

మంచి హార్మోన్‌లు పెరుగుతాయి 
నడక, వ్యాయామం, పరుగు, ఏరోబిక్స్‌ వంటివాటితో శరీరానికి మంచి చేసే హార్మోన్‌లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అడ్రినాలిన్, కార్టిసాల్‌ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించే ఎండారి్ఫన్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటున్నారు.  

రోజూ అరగంట చేసినా మంచి ఫలితాలు.. 
ప్రస్తుతం అన్ని వయసులవారు తీవ్ర ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రోజూ కనీసం అరగంట పాటు నడక, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఏరోబిక్స్‌ వంటి వాటికి సమయం కేటాయించాలి. ఈ వ్యాయామం బీపీ, షుగర్, ఊబకాయం వంటివి రాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాలకు మేలు చేకూరుస్తుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి దూరం కావచ్చు. 
– డాక్టర్‌ రాధికారెడ్డి, రిజిస్ట్రార్,  డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, విజయవాడ 

Advertisement
Advertisement