సొంత సామాజికవర్గం నేతలైతే ఏం చేసినా చర్యలుండవ్
రాసలీలలు బయటపడినా బీఆర్ నాయుడికి మినహాయింపు
పుట్టా మహేష్, ఆదిమూలంపై తక్షణం షోకాజ్, సస్పెన్షన్
బాబు వైఖరిపై యాదవ సామాజిక వర్గ నేతల్లో తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన టీడీపీ నేతలపై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పట్ల ఆపార్టీ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎస్సీ, బీసీ నేతలైతే వెంటనే చర్యలు తీసుకోవడం.. సొంత సామాజికవర్గం నేతల విషయంలో మౌనముద్ర దాల్చడం ఏంటని మండిపడుతున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ కేసులో చిక్కడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. అదే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలపై ఎంత దుమారం రేగినా కిక్కురుమనకపోవడాన్ని పలువురు యాదవ సామాజిక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతోనే బీఆర్ నాయుడు పవిత్రమైన టీటీడీ చైర్మన్‌గా ఉండి రాసలీలలు నడుపుతున్నా పట్టించుకోకుండా వదిలేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజానీకంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. కనీసం టీటీడీకి ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని అయినా బీఆర్ నాయుడిపై చర్యలు తీసుకుంటే బాగుండేదని తటస్థులు సైతం పేర్కొంటున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని, ఆయన ఒక్క క్షణం టీటీడీ చైర్మన్‌గా కొనసాగినా పదవికి కళంకమేనని సోషల్ మీడియాలో సైతం చర్చ సాగుతోంది.
ఈ వ్యవహారంతో టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లినా చంద్రబాబు నోరు మెదపలేదు. కనీసం ఆయన్ను వివరణ కూడా అడగకుండా.. ఎవరు ఎటు పోయినా.. రాష్ట్రం ఏమైనా.. టీటీడీ భ్రష్టు పట్టిపోయినా ఫర్వాలేదనే రీతిలో బీఆర్ నాయుడిని కొనసాగిస్తున్నారు. బీఆర్ నాయుడు తీరుపై కూటమి నేతల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన వల్ల అందరం ఇరుకునపడ్డామని, ఇంకా అందలం ఎక్కించడం ఏమిటనే అసహనం దాదాపు అందరిలోనూ కనిపించింది.
అయినా సరే.. సొంత సామాజికవర్గం కావడం, అందులోనూ తనకు డప్పు కొట్టడంలో రికార్డులు బద్దలుకొట్టిన ఒక టీవీ ఛానల్‌కు బీఆర్ నాయుడు యజమాని కావడంతో చంద్రబాబు చేష్టలుడిగిపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.
పుట్టాకు షోకాజ్ డ్రామా..
డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో తాను సీరియస్ అయినట్లు చంద్రబాబు లీకులు ఇచ్చారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసుల డ్రామాకు తెర తీశారు.
వాస్తవానికి పుట్టా మహేష్ పై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉన్నా సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు, మరో సీనియర్ నేత సుధాకర్ యాదవ్‌కుమారుడు కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. కనీసం నామమాత్రంగా తీసుకున్న ఇలాంటి చర్యలైనా బీఆర్ నాయుడి విషయంలో ఎందుకు తీసుకోలేకపోయారనే ప్రశ్నకు చంద్రబాబు వైపు నుంచి సమాధానం లేకుండా పోయింది.
కోనేటి ఆదిమూలం సస్పెన్షన్
గతేడాది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో బయటకు రావడంతో ఆయనపై ఆగమేఘాల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ లోనే ఉన్నా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దళిత నేత కావడంతో ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టా మహేష్ బీసీ కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి డ్రామా నడిపారు.
కానీ బీఆర్ నాయుడు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ను కనీసం వివరణ కూడా అడగలేదు. ఎస్సీ నేతలపై ఒంటి కాలిపై లేస్తున్న చంద్రబాబు.. బీసీలైతే ఓ మాదిరిగా స్పందిస్తున్నట్లు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సొంత సామాజికవర్గం నేతలైతే ఎంత పెద్ద తప్పు చేసినా కనీసం పట్టించుకోనని తేల్చేసినట్లు ఈ మూడు ఉదంతాల ద్వారా తేటతెల్లమైందని పేర్కొంటున్నారు.


