విద్యుత్‌ వినియోగానికి పరిమితులు లేవు | There are no limits on power consumption in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వినియోగానికి పరిమితులు లేవు

Sep 5 2023 6:34 AM | Updated on Sep 5 2023 6:34 AM

There are no limits on power consumption in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పవర్‌ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు సోమవారం ప్రకటించాయి. విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పరిస్థితి మెరుగుపడినందున పరిశ్రమలకు పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఆదివారం అన్ని రంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసినట్లు వివరించాయి. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేశాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరఫరాలో ఎలాంటి అంతరాయాలుగానీ, లోడ్‌ షెడ్డింగ్‌గానీ లేదు. సెప్టెంబర్‌ 1న రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్‌ డిమాండ్‌–సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిగా విద్యుత్‌ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలకు అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేశాయి.

విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి విద్యుత్‌ పంపిణీ సంస్థలు అభ్యర్థన పంపించాయి. ఆ అభ్యర్థన మేరకు ఈనెల 5 నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్‌ పరిమితులు విధించవచ్చని కమిషన్‌ అనుమతించింది. 

తగ్గిన డిమాండ్‌తో పరిశ్రమలకు ఊరట
రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడనం కారణంగా పడుతున్న వర్షాల దృష్ట్యా గ్రిడ్‌ డిమాండ్‌ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్‌ కొరత లేదు. విద్యుత్‌ సౌధలో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌.. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్‌ డిమాండ్, సరఫరా పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు.

ప్రస్తుతం లోడ్‌ కొద్దిగా తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడినందువల్ల పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్‌ షెడ్డింగ్‌ విధించే అవసరం కలగదని ఈ సమీక్షలో అభిప్రాయానికి వచ్చారు. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్‌ వాడకంపై పరిమితి అమలు నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాయి. మెరుగుపడిన సరఫరా పరిస్థితి కారణంగా.. కమిషన్‌ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్‌ వినియోగంలో పరిమితి–నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. ఈ విషయాన్ని కమిషన్‌కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి.

రోజుకి 40 మిలియన్‌ యూనిట్లు కొంటున్నాం
వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్‌ 15 వరకు స్వల్పకాలిక మార్కెట్‌ నుంచి యూనిట్‌కు రూ.9.10 వెచ్చించి రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లు కొంటున్నాం. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య–పారిశ్రావిుక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఏవిధమైన లోడ్‌ షెడ్డింగ్‌గానీ, విద్యుత్‌ వాడకంలో పరిమితులుగానీ లేవని తెలియజేస్తున్నాం.
– కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement