కాంట్రాక్టర్‌ ఎక్సెస్‌ వేస్తే ‘రీ టెండరే’

Terms that preclude reverse tendering in works undertaken with loans from foreign companies - Sakshi

కేంద్రం, విదేశీ సంస్థల రుణాలతో చేపట్టే పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌కు అడ్డొస్తున్న నిబంధనలు

దీంతో పీఎంజీఎస్‌వై కింద చేపట్టే 30 రోడ్ల పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని సర్కార్‌ ఆదేశం

ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఒక్క పథకం పనుల్లోనే రూ.85 కోట్ల దాకా ఆదా!

సాక్షి, అమరావతి: టెండర్లలో సంబంధిత పనికి ముందుగా అధికారులు నిర్ధారించిన దానికన్నా కాంట్రాక్టర్‌ అధిక ధరకు కోట్‌ చేస్తే.. మరోసారి అదే పనికి రీ టెండర్లు నిర్వహించాలని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పెంపొందించడంతోపాటు ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ప్రపంచ బ్యాంక్‌ వంటి సంస్థల రుణాలతో చేపట్టే పనుల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం, ఆయా సంస్థల నియమ నిబంధనల మేరకే టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఆయా పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలంటే నిబంధనలు ఆటంకంగా మారాయి.

► గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) మూడో దశ అమల్లో రాష్ట్రానికి ఈ ఏడాది కొత్తగా 3,285 కి.మీ రోడ్డు పనులు మంజూరయ్యాయి. 
► ఈ పనులకయ్యే ఖర్చును 60–40 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.
► 935 కి.మీ పొడవునా రూ.535 కోట్లతో చేపట్టే 129 రోడ్ల పనులకు అన్ని అనుమతులు పూర్తయి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. 
► ఇందులో రూ.150 కోట్ల విలువ చేసే 39 పనులకు పంచాయతీరాజ్‌ విభాగం టెండర్‌ పూర్తి చేసింది. వీటిలో 30 పనులకు కాంట్రాక్టర్లు పని అంచనా విలువ మీద 5% దాకా అధిక రేటుకు కోట్‌ చేశారు. 
► పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలంటే కేంద్ర నిబంధనలు అడ్డొస్తున్నాయని అధికారులు చెప్పారు. 
► దీంతో ఆ 30 పనులకు మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధిక ధర కోట్‌ చేసిన ఆ 30 పనులకు అధికారులు తిరిగి రెండో విడత టెండర్లు నిర్వహించే ప్రక్రియను చేపట్టారు. 
► ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.150 కోట్లు విలువ చేసే పనుల్లోనే రూ.7.5 కోట్ల మేర ప్రజాధనం ఆదా కాగా.. 3,285 కి.మీ పొడవునా చేపట్టే పనుల్లో దాదాపు రూ.85 కోట్లకు పైబడి ఆదా చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top