ఏకాభిప్రాయంపై చివరి ప్రయత్నం | Sakshi
Sakshi News home page

ఏకాభిప్రాయంపై చివరి ప్రయత్నం

Published Mon, Jan 2 2023 4:25 AM

Telugu states meeting for Utilization of Krishna and Godavari waters - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా ఈనెల 3న గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకుంటే కేంద్ర జల్‌ శక్తి శాఖ దృష్టికి తెచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని బోర్డులు నిర్ణయించాయి. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడేందుకు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయాలని 2020 అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో భేటీలో సీఎం జగన్‌ కోరారు.

తెలంగాణ జెన్‌కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై సుప్రీం కోర్టును ఆంధ్రప్రదేశ్‌ ఆశ్రయించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

తెలంగాణ సహాయ నిరాకరణ..
గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన రోజు నుంచి షెడ్యూల్‌–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెళ్లలోగా కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్‌ జారీ రోజు నుంచి ఆర్నెళ్లలోగా అనుమతి పొందాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. బోర్డుల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన రోజు నుంచి 60 రోజుల్లోగా ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్‌ మనీగా బోర్డుల ఖాతాల్లో జమ చేయాలి.

అయితే ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చుతామని రెండు రాష్ట్రాలు బోర్డులకు స్పష్టం చేశాయి. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఈ క్రమంలో తన భూభాగంలో శ్రీశైలం, సాగర్‌ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సర్కార్‌ మాత్రం తన భూభాగంలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది.

ఏకాభిప్రాయం సాధ్యమేనా..?
బోర్డుల నోటిఫికేషన్‌ అమలుకు తొలుత కేంద్రం నిర్దేశించిన గడువు గతేడాది జనవరి 15తో పూర్తయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గడువును మరో ఆర్నెళ్లు పొడిగిస్తూ జల్‌ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి(పాతది), నెట్టెంపాడు(పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా గత జూలై 15తోనే పూర్తయింది. తెలంగాణ సర్కార్‌ కృష్ణా బేసిన్‌లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్తరామదాస, మిషన్‌ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్‌లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లు సమర్పించాయి.

శ్రీశైలం, సాగర్‌ నిర్వహణకు సంబంధించి ఆర్‌ఎంసీ(రిజర్వాయర్ల మేనేజ్‌మెంట్‌ కమిటీ) రూపొందించిన విధి విధానాలను ఆంధ్రప్రదేశ్‌ ఆమోదించగా తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా సర్వ సభ్య సమావేశాలను నిర్వహించేందుకు బోర్డులు సిద్ధమయ్యాయి.  

Advertisement
Advertisement