
రేపు ఉమ్మడి జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథం
సంస్కరణల పేరుతో విద్యా రంగం బలహీనం
మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం అశాస్త్రీయం
కొందరు ఎస్జీటీలకే పదోన్నతులు ఇచ్చి హెచ్‌ఎంలుగా నియామకం సరికాదు
తేల్చిచెప్పిన ఐక్యవేదిక నేతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో.. ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ఐక్యవేదిక నేతలు మీడియాకు వెల్లడించారు. నిజానికి.. విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు బలహీనపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
దీంతో.. ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలల రేషనలైజేషన్, ఉపాధ్యాయుల బదిలీ చట్టంలోని పలు అంశాలపై సోమవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులోని విద్యాభవన్‌లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో మొత్తం 19 డిమాండ్లను విద్యాశాఖ ముందుంచామని.. కొన్ని అంశాలపైనే సానుకూల స్పందన వచ్చిందని.. కీలక అంశమైన ఇంగ్లిష్‌కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి స్టాఫ్ పాటర్న్‌ను కొనసాగించాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని నేతలు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో 1 : 35 నిష్పత్తిని అమలుచేయాలని.. 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటుపైనా స్పష్టత రాలేదన్నారు.
అలాగే.. మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాస్త్రీయమైందని వారన్నారు. ఫౌండేషన్ స్కూళ్లల్లో 1 : 20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల కేటాయింపునకు చర్చల్లో అంగీకరించారని, అయితే ఇది జీఓ–117లో ఉన్న అంశమేనన్నారు. ఇక స్టడీ లీవ్‌లో ఉండి రెండు నెలల్లో సర్వీసులో చేరే ఉపాధ్యాయుల పోస్టులను బదిలీల్లో ఖాళీగా చూపబోమని చెప్పడం.. కేవలం 1,400 మంది ఎస్జీటీలకు మాత్రమే పదోన్నతులిచ్చి హెచ్‌ఎంలుగా నియమిస్తామడంలో అర్థంలేదని నేతలు తెలిపారు. మరోవైపు.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఇప్పటికే రావడంతో అందులో మార్పులు సాధ్యంకాదని అధికారులు తేల్చిచెప్పడంతో ఉపాధ్యాయులు గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 21న డీఈఓ కార్యాలయల ముట్టడికి సిన్నద్ధమవుతున్నారు.
మంత్రి జోక్యం చేసుకోవాలి..
ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ బదిలీలు, పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి లోకేశ్ జోక్యం చేసుకోవాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ కోరారు.