
పెన్నానది నుంచి ఇసుక తరలిస్తున్న టీడీపీ నాయకులు
అడ్డుకున్న నిదనవాడ రైతులు.. వారిపై దౌర్జన్యానికి దిగిన అక్రమార్కులు
చర్యలు తీసుకోవాలంటూ అక్కడే రైతుల వంటావార్పు
శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల మండలం నిదనవాడ సమీపంలోని పెన్నా నది నుంచి టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందినది ఒక చోట అయితే, పెన్నానదిలో నచ్చిన చోట ఇసుక తరలిస్తున్నారు. దీనివల్ల భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతాయన్న ఆందోళనతో మంగళవారం నిదనవాడ గ్రామ రైతులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో ఇసుకాసురులు రైతులపై దౌర్జన్యానికి దిగారు. గత నెలలోనే పెన్నా నది కింది భాగాన ఇసుక తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి మరో చోటకు మకాం మార్చారు.
గ్రామ పైభాగాన ఎర్రమట్టితో నదిలోకి రోడ్డు వేసుకొని పెద్దవడుగూరు మండలం చిత్రచేడు వైపు తరలింపు మొదలు పెట్టారు. మంగళవారం విషయం తెలుసుకున్న నిదనవాడ రైతులు దాదాపు 200 మంది పెన్నా నదిలోకి వెళ్లి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తామని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ అక్రమార్కులు బెదిరించారు. దీంతో రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రావణిశ్రీతో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, మీడియా దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు వచ్చేవరకు వాహనాలను బయటకు వెళ్లనిచ్చేది లేదంటూ అక్కడే వంటా వార్పునకు దిగారు.
తహసీల్దార్ శేషారెడ్డి, సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ విజయ్‌కుమార్ అక్కడికి చేరుకుని.. ఇసుక తరలింపును నిలిపివేశారు. అనుమతి ఉన్న చోట నుంచే రవాణా చేసుకోవాలని, అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రైతులతో తహసీల్దార్ మాట్లాడుతూ.. అధికారులు బదిలీల్లో ఉన్నారని, వారు వచ్చిన తరువాత హద్దులు చూపిస్తామని పేర్కొన్నారు.
అధికార అండతోనే అక్రమార్కుల అరాచకం..
‘ఇసుకాసురులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అధికారం అండతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. భూగర్భజలాలు తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతామని, ఇసుక తరలించవద్దని వేడుకుంటున్నా కనికరం చూపడం లేదు. వాహనాలను అడ్డగించి, రెవెన్యూ అధికారులు, పోలీసులకు పట్టించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా అక్రమార్కులపై చర్యలు లేవు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ఇది పునరావృతం కాకుండా ఉంటుంది’ అని రైతులు అంటున్నారు.