
గొల్లపూడిలో 40 ఎకరాల భూమికి ఎసరు
ఎగ్జిబిషన్ సొసైటీ పేరిట లీజుపై కొట్టేసేందుకు కుట్ర
దసరా ఉత్సవాల పేరుతో హడావిడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దేవుడి భూములపైనా పచ్చ గద్దల కన్నుపడింది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 39.99 ఎకరాల భూమిని తన్నుకుపోయేందుకు సిద్ధమయ్యారు. గొల్లపూడిలోని సర్వే నంబర్ 454/12బీలో 21 ఎకరాలు, 454/3బీలో 18.99 ఎకరాలు కలిపి మొత్తం 39.99 ఎకరాల భూమిని లీజు పేరిట హస్తగతం చేసుకునేందుకు పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్యనేత పావులు కదుపుతున్నారు.
ఓ మూవీ మేకర్ సంస్ధ, ఓ మీడియా భాగస్వామ్యంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేసి దేవుడి భూములను లీజు పేరుతో అప్పనంగా కొట్టేసే కుట్రకు తెరలేపుతున్నారు. ఇందుకు సంబం«ధించిన ఫైలు కలెక్టరేట్‌కు చేరినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దసరా ఉత్సవాలు, వినోదం మాటున విజయవాడ నగరానికి సమీపంలో రూ.కోట్ల విలువైన భూమిని స్వా«దీనం చేసుకునేలా శరవేగంగా పావులు కదుపుతున్నారు. దీనికి ‘విజయవాడ ఉత్సవ్’ కలరింగ్ ఇస్తున్నారు. టూరిజానికి విజయవాడను చిరునామాగా మారుస్తామని ఊదరగొడుతూ కుట్రలకు పదునెక్కిస్తున్నారు.
గతంలో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదన
గత ప్రభుత్వం హయాంలో ఈ స్థలంలో నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడకు సమీపంలో ఉండటం, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గ ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం విలువకు సమానమైన భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చేలా సీసీఎల్‌ఏకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ప్రస్తుతం ఆ ప్రతిపాదన సీసీఎల్‌ఏ పరిధిలో ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోకపోగా.. దేవుడి భూమికి ఎసరుపెట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే కోట్ల విలువైన ఆర్టీసీ స్థలం లులుకు అప్పగింత
విజయవాడ నడి»ొడ్డున పాత బస్టాండుగా పిలుచుకొనే గవర్నరుపేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లులు చేతిలో పెట్టేసింది. 99 సంవత్సరాల లీజు వి«ధానంలో ఆ భూమిని అప్పగించింది. ఇందుకు బదులుగా ఆర్టీసీకి వేరేచోట భూమిని కేటాయిస్తున్నామని ప్రకటించారు.
కేవలం రూ.156 కోట్ల పెట్టుబడి కోసం రూ.600 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూకేటాయింపుపై వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.