మాస్టర్‌ స్మార్ట్‌ స్కెచ్‌ | TDP leaders encroaching on Mypad road and constructing market | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ స్మార్ట్‌ స్కెచ్‌

Aug 12 2025 5:44 AM | Updated on Aug 12 2025 5:46 AM

TDP leaders encroaching on Mypad road and constructing market

నెల్లూరు మైపాడురోడ్డులో స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ కోసం ఏర్పాటు చేసిన కంటైనర్లు

మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఎత్తుగడ  

టీడీపీ వారికి కట్టబెట్టేందుకు స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌

వసతులకు రూ.3 కోట్లు.. శిక్షణకు రూ.1.25 కోట్లు

పెట్టుబడికి మిగతా నిధులు.. రాష్ట్రంలో 8 నగరాల్లో మార్కెట్లు 

నెల్లూరులో ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరించిన గత ప్రభుత్వం 

ఇప్పుడు మైపాడ్‌ రహదారిని ఆక్రమించి మార్కెట్‌ నిర్మాణం

చిరు వ్యాపారుల పొట్టకొట్టి తమ్ముళ్ల జేబు నింపడం ఎలా...? కొత్త కొత్త పథకాలతో టీడీపీ వారికి ఉపాధి కల్పించడం ఎలా..? మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ వేసిన ఈ ఎత్తుగడను చూసి తెలుసుకోవచ్చు. ‘స్మార్ట్‌’గా ఆలోచించి స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ పేరుతో తమవారికి లబ్ధి చేకూర్చేందుకు పెద్ద స్కెచ్చే వేశారు ‘మాస్టారు’. రాష్ట్రంలోని ఎనిమిది నగరాల్లో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. తన ఇలాకా నెల్లూరులో తమ్ముళ్ల కళ్లలో ఆనందం చూసేందుకు అడుగులు వేస్తుండగా నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది.  – సాక్షి ప్రతినిధి, నెల్లూరు

ఇంటికి అవసరమైన వస్తువులన్నీ ఒకే చోట లభించేలా వినియోగదారుల సౌలభ్యం కోసమంటూ స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో   ఈ వ్యాపార సముదాయాలను అప్పగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నగరాల్లో వీధి వ్యాపారులు ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు సాగిస్తుంటారు. ప్రతి వీధిలో ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు దొరికేలా దుకాణాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఈ చిరు వ్యాపారుల కడుపు కొట్టేలా వ్యాపార సముదాయాలను తమ్ముళ్లకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్ట్రీట్‌ వెండింగ్‌ పేరుతో మున్సిపల్‌ నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించి షాపులను అప్పగించే ప్లాన్‌ సిద్ధం చేశారు.

తొలి దశలో మున్సిపల్‌ శాఖ మంత్రి నియోజకవర్గం నెల్లూరు నగరాన్ని ఎంచుకున్నారు. ‘ఫ్లగ్‌ అండ్‌ప్లే’ విధానంలో వాటిని వ్యాపారులకు అప్పగిస్తామని చెబుతున్నారు. వాస్తవానికి టీడీపీ వారికే ఇచ్చేందుకు నిర్ణయించారు. రెండో దళలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, పిఠాపురం, శ్రీకాకుళం, ఒంగోలులో ఏర్పాటుకు నిర్ణయించారు.

తమ్ముళ్ల కళ్లలో ఆనందం కోసమేనా..
నెల్లూరు నగరం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి నారాయణ గెలిచారు. ఎన్నికల వేళ ‘నారాయణ టీమ్‌ (ఎన్‌ టీమ్‌)’ ఏర్పాటు చేసి మూడు నెలల పాటు జీతాలిచ్చారు. వార్డులవారీగా వారితో ఎన్నికల పనులు చే­యించుకున్నారు. అధికారంలోకి వస్తే తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ను తెరపైకి తెచ్చా­రు. ఒక్క నెల్లూరులోనే అయితే చెడ్డ పేరొస్తుందని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయ­త్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన జాబితా ప్రకారమే షాపులు కేటాయించేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ ప్రారంభానికి ముందే ఫుట్‌ పాత్‌లపై వ్యాపారాలు చేసుకునేవారు ఖాళీ చేయాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేయించారు.

వీధిన పడనున్న వ్యాపారులు  
ప్రధాన నగరాల్లో స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్లు ఏర్పాటయితే వేలాది మంది చిరు వ్యాపారు­లు వీధిన పడే అవకాశం ఉంది. నెల్లూరులోనే ఫుట్‌పాత్‌లపై 4 వేల మంది వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ మార్కె­ట్‌లు అందుబా­టులోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని వారంతా ఆందోళన చెందుతున్నారు.  

వైఎస్సార్‌సీపీ రోడ్డు విస్తరణ చేస్తే.. కూటమి ఆక్రమించే చర్యలు 
నెల్లూరు నగరంలోని పాతచెక్‌పోస్ట్‌ వద్ద నుంచి వేణుగోపాల్‌నగర్‌ (చేపల మార్కెట్‌) వరకు మైపాడు రోడ్డును దాదాపు 2.7 కి.మీ. మేర వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.20 కోట్లు వెచ్చించి 60 అడుగుల మేర నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ చేసింది. నాలుగు మండలాలకు వెళ్లే రహదారి కావడంతో నిత్యం దాదాపు 15 వేల వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో రోడ్డు విస్తరణతోపాటు బ్యూటిఫికేషన్‌ పేరుతో సిమెంట్‌ రోడ్లు, మధ్యలో డివైడర్లలో  పచ్చదనం, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ రహదారికి ఇరువైపులా వాకింగ్‌ ట్రాక్, పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతలోనే ఎన్నికలు రావడంతో ఆ పనులకు బ్రేక్‌లు పడ్డాయి. ప్రస్తుతం మంత్రి నారాయణ ఆ నాలుగు లైన్ల రహదారికి ఇరువైపులా స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ పేరుతో కంటైనర్లను పెట్టించి తమ్ముళ్లకు అప్పగించే ప్రయత్నాలు చేస్తుండడం నగరంలో విమర్శలకు తావిస్తోంది.

ప్రతి మార్కెట్‌కు రూ.7 కోట్లు  
రాష్ట్రంలో ఎనిమిది మార్కెట్లకు ప్రభు­త్వం రూ.56 కోట్లు ఖర్చు చేయనుంది. ఒక్కో మార్కెట్‌కు రూ.7 కోట్లు కేటాయించింది. ఇందులో మౌలిక వసతులకు రూ.3 కోట్లు, వ్యాపారుల శిక్షణకు, ఇతర సేవలు అందించేందుకు సెర్ప్‌  రూ.1.25 కోట్లు ఖర్చు చేయనున్నాయి. బ్యాంకుల నుంచి వ్యాపారులకు పెట్టుబడి నిధి కింద రూ.3 కోట్ల మేర రుణాలు సమకూర్చనున్నాయి. మార్కెట్‌ నిర్వహణ అంతా నగరపాలక సంస్థలకు అప్పగించనున్నారు.

ఎన్‌జీటీ నిబంధనలు బేఖాతర్‌
స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) కొన్ని నిబంధనలు అమలు చేయాలని ఆదేశించినా మంత్రి నారాయణ, నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నెల్లూరులో స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌పై ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఎన్‌జీటీ దృష్టికి తీసుకెళ్లడంతో నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌తో అక్కడ పేరుకుపోయే చెత్త వల్ల పక్కనే ఉన్న నీటిపారుదల కాలువలో చేరి నీరు కలుషితమవుతుందని, కాలువ పోరంబోకు స్థలాలు అక్రమణ జరుగుతుందన్న వాదనలతో ఎన్‌జీటీ ఏకీభవించింది.

దీంతో తాత్కాలికంగా ఆ పనులను నిలిపివేసి నిబంధనలు పాటించిన తర్వాతే స్ట్రీట్‌ వెండింగ్‌ను ప్రారంభించాలని ఆదేశించింది. నెల్లూరులో అండర్‌ డ్రైనేజీ పూర్తి చేసి కాలువకు కంచె వేస్తామని, ఆ తర్వాతే షాపులు ఏర్పాటుకు అనుమతిస్తామని తెలిపింది. వాస్తవంగా ఎన్‌జీటీ ఆదే­శాల ప్రకారం అండర్‌ డ్రైనేజీ పనులు పూర్తికావాలంటే మరో పదేళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో ఎన్‌జీటీ ఆదేశాలు పాటించకుండానే స్ట్రీట్‌ వెండింగ్‌ను హడావుడిగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement