breaking news
mypadu
-
మాస్టర్ స్మార్ట్ స్కెచ్
చిరు వ్యాపారుల పొట్టకొట్టి తమ్ముళ్ల జేబు నింపడం ఎలా...? కొత్త కొత్త పథకాలతో టీడీపీ వారికి ఉపాధి కల్పించడం ఎలా..? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వేసిన ఈ ఎత్తుగడను చూసి తెలుసుకోవచ్చు. ‘స్మార్ట్’గా ఆలోచించి స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పేరుతో తమవారికి లబ్ధి చేకూర్చేందుకు పెద్ద స్కెచ్చే వేశారు ‘మాస్టారు’. రాష్ట్రంలోని ఎనిమిది నగరాల్లో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. తన ఇలాకా నెల్లూరులో తమ్ముళ్ల కళ్లలో ఆనందం చూసేందుకు అడుగులు వేస్తుండగా నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాత్కాలికంగా బ్రేక్ వేసింది. – సాక్షి ప్రతినిధి, నెల్లూరుఇంటికి అవసరమైన వస్తువులన్నీ ఒకే చోట లభించేలా వినియోగదారుల సౌలభ్యం కోసమంటూ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ వ్యాపార సముదాయాలను అప్పగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నగరాల్లో వీధి వ్యాపారులు ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు సాగిస్తుంటారు. ప్రతి వీధిలో ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు దొరికేలా దుకాణాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఈ చిరు వ్యాపారుల కడుపు కొట్టేలా వ్యాపార సముదాయాలను తమ్ముళ్లకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్ట్రీట్ వెండింగ్ పేరుతో మున్సిపల్ నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించి షాపులను అప్పగించే ప్లాన్ సిద్ధం చేశారు.తొలి దశలో మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గం నెల్లూరు నగరాన్ని ఎంచుకున్నారు. ‘ఫ్లగ్ అండ్ప్లే’ విధానంలో వాటిని వ్యాపారులకు అప్పగిస్తామని చెబుతున్నారు. వాస్తవానికి టీడీపీ వారికే ఇచ్చేందుకు నిర్ణయించారు. రెండో దళలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, పిఠాపురం, శ్రీకాకుళం, ఒంగోలులో ఏర్పాటుకు నిర్ణయించారు.తమ్ముళ్ల కళ్లలో ఆనందం కోసమేనా..నెల్లూరు నగరం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి నారాయణ గెలిచారు. ఎన్నికల వేళ ‘నారాయణ టీమ్ (ఎన్ టీమ్)’ ఏర్పాటు చేసి మూడు నెలల పాటు జీతాలిచ్చారు. వార్డులవారీగా వారితో ఎన్నికల పనులు చేయించుకున్నారు. అధికారంలోకి వస్తే తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను తెరపైకి తెచ్చారు. ఒక్క నెల్లూరులోనే అయితే చెడ్డ పేరొస్తుందని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన జాబితా ప్రకారమే షాపులు కేటాయించేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ప్రారంభానికి ముందే ఫుట్ పాత్లపై వ్యాపారాలు చేసుకునేవారు ఖాళీ చేయాలని కార్పొరేషన్ కమిషనర్ ద్వారా హెచ్చరికలు జారీ చేయించారు.వీధిన పడనున్న వ్యాపారులు ప్రధాన నగరాల్లో స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటయితే వేలాది మంది చిరు వ్యాపారులు వీధిన పడే అవకాశం ఉంది. నెల్లూరులోనే ఫుట్‌పాత్‌లపై 4 వేల మంది వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ మార్కెట్లు అందుబాటులోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని వారంతా ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ రోడ్డు విస్తరణ చేస్తే.. కూటమి ఆక్రమించే చర్యలు నెల్లూరు నగరంలోని పాతచెక్‌పోస్ట్ వద్ద నుంచి వేణుగోపాల్‌నగర్ (చేపల మార్కెట్) వరకు మైపాడు రోడ్డును దాదాపు 2.7 కి.మీ. మేర వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.20 కోట్లు వెచ్చించి 60 అడుగుల మేర నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ చేసింది. నాలుగు మండలాలకు వెళ్లే రహదారి కావడంతో నిత్యం దాదాపు 15 వేల వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో రోడ్డు విస్తరణతోపాటు బ్యూటిఫికేషన్ పేరుతో సిమెంట్ రోడ్లు, మధ్యలో డివైడర్లలో పచ్చదనం, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ రహదారికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్, పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతలోనే ఎన్నికలు రావడంతో ఆ పనులకు బ్రేక్‌లు పడ్డాయి. ప్రస్తుతం మంత్రి నారాయణ ఆ నాలుగు లైన్ల రహదారికి ఇరువైపులా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పేరుతో కంటైనర్లను పెట్టించి తమ్ముళ్లకు అప్పగించే ప్రయత్నాలు చేస్తుండడం నగరంలో విమర్శలకు తావిస్తోంది.ప్రతి మార్కెట్‌కు రూ.7 కోట్లు రాష్ట్రంలో ఎనిమిది మార్కెట్లకు ప్రభుత్వం రూ.56 కోట్లు ఖర్చు చేయనుంది. ఒక్కో మార్కెట్‌కు రూ.7 కోట్లు కేటాయించింది. ఇందులో మౌలిక వసతులకు రూ.3 కోట్లు, వ్యాపారుల శిక్షణకు, ఇతర సేవలు అందించేందుకు సెర్ప్ రూ.1.25 కోట్లు ఖర్చు చేయనున్నాయి. బ్యాంకుల నుంచి వ్యాపారులకు పెట్టుబడి నిధి కింద రూ.3 కోట్ల మేర రుణాలు సమకూర్చనున్నాయి. మార్కెట్ నిర్వహణ అంతా నగరపాలక సంస్థలకు అప్పగించనున్నారు.ఎన్జీటీ నిబంధనలు బేఖాతర్స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొన్ని నిబంధనలు అమలు చేయాలని ఆదేశించినా మంత్రి నారాయణ, నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్పై ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లడంతో నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్తో అక్కడ పేరుకుపోయే చెత్త వల్ల పక్కనే ఉన్న నీటిపారుదల కాలువలో చేరి నీరు కలుషితమవుతుందని, కాలువ పోరంబోకు స్థలాలు అక్రమణ జరుగుతుందన్న వాదనలతో ఎన్జీటీ ఏకీభవించింది.దీంతో తాత్కాలికంగా ఆ పనులను నిలిపివేసి నిబంధనలు పాటించిన తర్వాతే స్ట్రీట్ వెండింగ్‌ను ప్రారంభించాలని ఆదేశించింది. నెల్లూరులో అండర్ డ్రైనేజీ పూర్తి చేసి కాలువకు కంచె వేస్తామని, ఆ తర్వాతే షాపులు ఏర్పాటుకు అనుమతిస్తామని తెలిపింది. వాస్తవంగా ఎన్జీటీ ఆదేశాల ప్రకారం అండర్ డ్రైనేజీ పనులు పూర్తికావాలంటే మరో పదేళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో ఎన్జీటీ ఆదేశాలు పాటించకుండానే స్ట్రీట్ వెండింగ్‌ను హడావుడిగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటం గమనార్హం. -
మైమరిపించే మైపాడు
ఎటు చూసినా పచ్చని పొలాలు.. పొడవాటి కొబ్బరి చెట్లు.. అరటి తోటలు.. ఇంకొంచెం ముందుకెళ్తే విశాలమైన బీచ్.. ఎగిసిఎగిసి పడే అలల సవ్వడులు.. మధ్యలో ఆధ్యాత్మికత పరిఢవిల్లే జ్యోతిర్లింగాల క్షేత్రం. అటు ఆహ్లాదం.. ఇటు ఆధ్యాత్మికం ఉట్టిపడే మైపాడు. అలసిన మనస్సులను మైమరిపిస్తోంది.. సేద తీరుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పాటు నేటి తరం ప్రభాస్ వంటి అగ్ర హీరోల సినిమాలు ఇక్కడ నిర్మించారు. చిన్నచిన్న సినిమాల అవుట్ డోర్ షూటింగ్‌లకు ఇక్కడి ప్రకృతి రా..రమ్మని పిలుస్తోంది. ఇందుకూరుపేట:(పొట్టి శ్రీరాములు నెల్లూరు) జిల్లాలోని ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా నిలుస్తోంది. మైపాడు సముద్ర తీరం ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతకు కొదవ లేదు. క్షణం తీరిక లేకుండా ఉరుకుల పరుగుల జీవితాలు గడిపే ఈ ఆధునిక కాలంలో కాసింత సమయం దొరికితే ఆహ్లాదంగా గడిపేందుకు గుర్తుచ్చేది ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు. కోనసీమను తలపించే ప్రకృతి అందాలు, ఎగిసి ఎగిసి పడే అలల ఆహ్లాదం, ఆధ్యాత్మికత పరవశించే దివ్యక్షేత్రం పర్యాటకులను అలరిస్తోంది.. మళ్లీ మళ్లీ రా..రమ్మని ఆహ్వానిస్తోంది. జిల్లా వాసులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా గడిపి సేద తీరుతారు. నెల్లూరుకు 22 కి.మీ. దూరంలో మైపాడు సముద్ర తీరం ఉంది. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుంచి ప్రతి గంటకు మైపాడు వరకు, ప్రతి గంటకు బీచ్ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుంది. నెల్లూరు రూరల్ మండలం దాటుకొని ఇందుకూరుపేట మండలంలోకి అడుగు పెట్టగానే ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. సరిహద్దు గ్రామం డేవిస్‌పేట రాగానే దశాబ్దాల కాలం నాటి మహావృక్షాలు దర్శనమిస్తాయి. అక్కడ నుంచి ముందుకు సాగితే.. జగదేవిపేట, రావూరు, మొత్తలు, నరసాపురం గ్రామాల్లో రోడ్డు వెంబడి పొడవాటి కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, అరటి తోటలు చల్లని గాలులు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. మైపాడు బీచ్‌కు చేరుకుంటే.. ఎగిసి పడుతున్న సముద్రపు అలలు, ఇసుక తిన్నెలను చూడగానే తారతామ్యలు మరిచి సంతోషంగా గడపాల్సిందే. ముఖ్యంగా యువత చిన్న పిల్లలు, ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు అయిష్టతే చూపుతారు. ప్రేమికులకు సైతం ఈ సాగర తీరం స్వర్గధామంగా నిలుస్తోంది. జ్యోతిర్లింగాల క్షేత్రం మైపాడు తీరంలో ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి తీరంలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలయం దేశాన్ని చుట్టి వచ్చిన అనుభూతిని కలిగిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయంభుగా కొలువైన జ్యోతిర్లింగాలను దర్శించిన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఇక్కడ అమర్నాథ్ (జమ్మూ–కశ్మీర్) సోమేశ్వరుడు (గుజరాత్), మల్లికార్జునస్వామి (ఆంధ్రప్రదేశ్), మహా కాళేశ్వరుడు (మధ్యప్రదేశ్), కేధారేశ్వరుడు(ఉత్తరాంచల్), ఓంకారేశ్వరుడు (మధ్యప్రదేశ్) భీమేశ్వరుడు (పూణే, మహారాష్ట్ర), కాశీవిశ్వేశ్వరుడు(వారణాశి, ఉత్తరప్రదేశ్), త్రయంబకేశ్వరుడు (నాసిక్, మహారాష్ట్ర), వైద్యనాథేశ్వరుడు (దేవనగర్, జార్ఖండ్), నాగేశ్వరుడు (ద్వారకా, గుజరాత్), రామలింగేశ్వరుడు (రామేశ్వరం, తమిళనాడు)తో పాటు శ్రీఘ్రషోశ్వరుడు (ఔరంగాబాద్, మహారాష్ట్ర) సుబ్రహ్మణ్యం స్వామి (తమిళనాడు), గోకర్ణ గణేష్ (కర్ణాటక), పళని సుబ్రహ్మణ్యం స్వామి వళ్లీ దేవసేన సమేత సూర్య, చంద్ర పార్వతీ దుర్గాదేవిలు ఈ సాగర తీరంలోని ఒకే ఆలయంలో కొలువైన ఏకైక ఆధ్మాత్మిక క్షేత్రమిది. స్వామివార్ల మూలవిరాట్‌కు ఎదురుగా భారీ రాతి నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆలయ ఆవరణలో ఉన్న 25 అడుగుల కైలాసనాథుడు, 24 అడుగుల పొడవు పార్వతీదేవి భక్తులను ఆలయం వెలుపల నుంచి భక్తులను కటాక్షిస్తున్నారు. పక్కనే ఉన్న భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ఆధ్యాత్మికతకు కొదువలేదు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎత్తైన మహా శివలింగం తన్మయత్వం చెందేలా చేస్తోంది. మైపాడు సముద్ర తీరం అటు ఆహ్లాదాన్ని, ఇటు ఆధ్మాత్మికతో పరవశింప చేస్తోంది. షూటింగ్‌లకు అనువు జగదేవిపేట, ఇందుకూరుపేట, కొత్తూరు, డేవిస్‌పేట, మొత్తలు గ్రామాల్లో తోటలు, చెట్లు పచ్చగా ఆహ్లాదకంగా ఉంటాయి. మైపాడు బీచ్ ఆనంద పరవశం చేస్తోంది. దీంతో ఫొటోలు తీసేందుకు అనువుగా ఉంటుంది. ఫొటో షూట్ కోసం ఎంతో మంది ఇక్కడి వస్తుంటారు. షార్ట్ ఫిల్మ్‌లు కూడా ఇక్కడ షూట్ చేస్తున్నారు. – బోయళ్ల శివప్రవీణ్‌కుమార్, నెల్లూరు, పీజే ఫొటోగ్రఫీ బీచ్‌లో గడపడమంటే ఇష్టం ఎప్పుడు సమయం దొరికిన స్నేహితులతో కలిసి మైపాడు బీచ్‌కు వస్తుంటాం. ఈ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ సేద తీరేందుకు బాగా ఇçష్టపడుతాం. జిల్లా కేంద్రానికి దగ్గరి దూరంలో ఉండడంతో పాటు బీచ్‌కు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. – సీహెచ్ వెంకటేష్, నెల్లూరు ప్రకృతి బాగుంటుంది ఇందుకూరుపేట మండలంలో ప్రకృతి బాగుంటుంది. పచ్చని పొలాలు, చెట్లు, సాగర తీరం ఇక్కడ ఉన్నాయి. దీంతో కొత్తగా పెళ్లయిన వారి ఫొట్ అల్బ్మ్ తయారీ కోసం ఈ ప్రాంంతం బ్యాక్‌గ్రౌండ్‌ను ఫొటోలు, వీడియోలు తీస్తోంటాం. నూతన వధూవరులు, కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఇష్టపడుతూ ఉంటారు. – గోడ విష్ణు, ఫొటో గ్రాఫర్, నెల్లూరు చిత్రసీమకు షూటింగ్ స్పాట్ మైమరిపించే ప్రకృతి అందాలకు నెలవైన మండలంలోని పరిసర ప్రాంతాలు చిత్రసీమకు షూటింగ్ స్పాట్‌గా మారింది. అలనాటి తర కథనాయకుల నుంచి నేటి యువతరం సినీ హీరోల సినిమాలతో పాటు చిన్నచిన్న సినిమాలు, షార్ట్ ఫీల్మ్ షూటింగ్స్, ఫొటో షూట్లకు ఈ ప్రదేశం చిరునామాగా మారింది. పెళ్లి అల్బ్మ్ల కోసం కొత్త జంటలు, కుటుంబ సభ్యులు ఇక్కడి బ్యాక్‌గ్రౌండ్ అందాలతో ఫొటోలు తీసుకుని మధుర జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటున్నారు. సీనియర్ ఎన్టీయార్, చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు ఇక్కడే షూటింగ్ చేయడం విశేషం. విడిది.. విందులకు రిసార్ట్స్ మైపాడు బీచ్ ప్రాంతం పర్యాటకుల ఆనందాలకు నెలవుగా ఉంటుంది. విడిది.. విందులకు అనువుగా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. పర్యాటకశాఖ (ఏపీ టూరిజం) బీచ్ వద్ద హరితా రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. తీరం సమీపాన తాటిచెట్ల మధ్యలో ఉన్న ఈ రిసార్ట్స్‌లో విడిదితో పాటు, రెస్టారెంట్‌ను అందుబాటులో ఉంది. పర్యాటకులు ఇక్కడ పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, విందులు, వినోదాలు చేసుకొని కాలాన్ని మైమరిచి పోతుంటారు. ఇక్కడి గదులను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయం ఏపీ టూరిజం కల్పించింది. -
మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే..
సాక్షి, ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం అని వస్తున్న వార్తలో నిజం లేదని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు స్పష్టం చేశారు. మైపాడు బీచ్‌లో ఓ జలకన్య మత్స్యకారులకు చిక్కినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన విషయంపై ఆయన స్పందించారు. చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. ఇందుకూరుపేటలో ఆయన మాట్లాడుతూ, కొందరు ఆకతాయిలు ఓ వీడియోని సృష్టించి.. పది రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారన్నారు. తాజాగా గత నాలుగైదు రోజుల నుంచి ఇదే వీడియోలను మైపాడు బీచ్‌లో జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. లేనిది ఉన్నట్లు చూపుతున్నారని తెలిపారు. వీటిని పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరసింహులు కోరారు. చదవండి: ఊర్లున్నాయి.. ప్రజలు లేరు! -
విహారంలో విషాదం
ఇందుకూరుపేట: స్నేహితులందరూ ఆదివారం సరదాగా విహారానికి వచ్చి విషాదానికి గురయ్యారు. మండలంలోని మైపాడు బీచ్‌లో అలల తాకిడికి నీట మునిగి ఓ యువకుడు గల్లంతు కాగా, మరో యువకుడు మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కోవూరు మండలం జమ్మిపాళెంకు చెందిన ఉడతా శ్రీహరి (19), తిరువీధి పవన్ (14) ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 15 మంది ఆదివారం మైపాడు బీచ్‌కు సేద తీరేందుకు వచ్చారు. అందరూ కలిసి సరదాగా నీటిలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సమయంలో అలల తాకిడికి శ్రీహరి, పవన్‌తో పాటు మరో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. గమనించిన తోటి వారు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు నలుగురిలో ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. శ్రీహరి నీటిలో మునిగి మృతి చెందగా, పవన్ గల్లంతయ్యాడు. అప్పటి వరకు తమ కళ్ల ఎదుటే ఉన్న శ్రీహరి విగత జీవిగా మారడం, పవన్ కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కోసం వెంట వచ్చిన బందువులు, స్నేహితులు తీరం వెంబడి చేరి గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మైపాడు రిసార్ట్స్‌కు అదనపు హంగులు
రూ.7 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం ముమ్మరంగా సాగుతున్న పనులు మైపాడు బీచ్‌లో ఉన్న రిసార్ట్స్‌లో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పర్యాటకశాఖ విడదుల చేసిన నిధులతో ఈ పనులు జరుగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయితే మైపాడు సముద్ర తీరానికి సందర్శకులకు మరెన్నో సౌకర్యాలు ఏర్పడుతాయి. ఇందుకూరుపేట : జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మైపాడు బీచ్‌లో 2013 సంతవ్సరంలో హరితా బీచ్ రిసార్ట్స్‌ను ప్రారంభించారు. అందులో 16 గదులతో పాటు పర్యాటకుల కోసం రెస్టారెంట్, పిల్లలు ఆటలాడేందుకు పార్క్‌ను ఏర్పాటుచేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించే వీలు ఉండటం, రిసార్ట్స్ ఏర్పాటుతో సందర్శకుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా ఆదివారం, సెలవు రోజుల్లో పర్యాటకులు వందలాది మంది ఇక్కడకు వస్తున్నారు. దీంతో కొన్నిసార్లు గదుల కొరత ఏర్పడుతోంది. గదుల పెంపు.. పర్యాటకుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో పర్యాటక శాఖ గదులు పెంచాలని నిర్ణయించింది. మరో 7 అదనపు గదుల నిర్మాణాలు చేపట్టింది. దీంతోపాటు ఉడెన్డెక్, తీరం వెంబడి లైటింగ్, పార్కింగ్ ఏర్పాటు చేయనుంది. అలాగే రిసార్ట్స్‌కు ఎదురుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. కల్యాణోత్సవాలు, పుట్టినరోజు, పెళ్లిరోజులు వంటి శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో డైనింగ్ హాలు, వంటగది, డ్రస్సింగ్ రూం, మేకప్రూం, టాయ్‌లెట్స్, పార్కింగ్ ఏరియా, కాంపౌండ్ వాల్ తదితర అభివృద్ధి పనులను చేపడుతుంది. అసలే సముద్ర తీరం కావడంతో ఇక్కడ ఆహ్లాదంగా ఉంటుందని శుభకార్యాలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది. వేడుకలకు అనుకూలం : శ్రీహరికోట ప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు, మైపాడు బీచ్‌లో అభివృద్ధి పనులు పూర్తయితే సందర్శకులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతోపాటు పర్యాటకులు, గ్రామస్తులు శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. సౌకర్యవంతం : కే రాజేష్, కోవూరు బీచ్‌లో తీరం వెంబడి లైటింగ్, పార్కింగ్ తదితర వసతులు ఏర్పాటయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరింత సంతోషంగా గడపవచ్చు. అలాగే గదులు కొరత తీరుతుంది. -
జాఫర్ సాహెబ్ కాలువను మింగేస్తున్నారు
సాక్షి, నెల్లూరు: ప్రధాన సాగునీటి కాలువలు ఆక్రమణల ఉచ్చులో చిక్కుకుంటున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్పందన కరువైంది. ఇదే అదునుగా కొందరు మరింత రెచ్చిపోతూ నడికాలువలోకి నిర్మాణాలను విస్తరించారు. ఈ క్రమంలో కాలువ పూడికకు గురై ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పెన్నార్ డెల్టా పరిధిలో జాఫర్‌సాహెబ్ కాలువ ప్రధానమైనది. నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో ప్రవహించే ఈ కాలువ కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో తొలికారు సాగుకు నవంబర్ 1 నుంచి సోమశిల జలాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు కాలువ ఆక్రమణలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెల్లూరు నగరంలోని మైపాడురోడ్డును ఆనుకుని ఈ కాలువ ప్రవాహం కొనసాగుతుంది. అయితే పాతచెక్‌పోస్టు, బోడిగాడితోట, శెట్టిగుంటరోడ్డు, వీవర్స్‌కాలనీ, బంగ్లాతోట, నవాబుపేట, కిసాన్‌నగర్ తదితర ప్రాంతాల్లో కాలువ ఆక్రమణలకు గురైంది. కాలువ స్థలాన్ని రెండువైపులా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో పూడిక పేరుకుపోయింది. కొందరైతే ఏకంగా కాలువలో పిల్లర్లు వేసి భవనాలు నిర్మించారు. విలువైన స్థలం కావడంతో ఆక్రమణదారులు పోటీపడుతున్నారు. వీరివెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల అయితే రైసుమిల్లులు కాలువలోకి చొచ్చుకొచ్చాయి. క్రమేణా కాలువ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తున్నా ఇరిగేషన్ అధికారుల్లో స్పందన కరువైంది. మరోవైపు పూడికతీత పనుల పేరుతో తరచూ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే ఆయకట్టులో చివర పొలాలు బీడుగా మారే ప్రమాదం నెలకొంది. కాలువలోకి వ్యర్థజలాలు జాఫర్సాహెచ్ కాలువ ఒడ్డున, సమీపంలో పెద్దసంఖ్యలో రైసుమిల్లులు ఉన్నాయి. వీటన్నంటి నుంచి విడుదలయ్యే వ్యర్థజలాలను కాలువలోకి వదిలేస్తున్నారు. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి సైతం వ్యర్థ జలాలు ఈ కాలువలో కలుస్తున్నాయి. రసాయనాలతో కూడిన ఈ నీళ్ల కారణంగా ఆయకట్టులోని పొలాలు చవుడుబారుతున్నాయి. ఇప్పటికే కాలువలో పలుజాతుల చేపలు ఉనికి కోల్పోయాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి జాఫర్‌సాహెబ్ కాలువ పరిరక్షణకు నడుం బిగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.