కేవలం రూ.10 లక్షల మూలధనంతో 2 నెలల క్రితమే ఢిల్లీలో పుట్టిన కంపెనీ
రూ.1,504 కోట్ల పెట్టుబడులట.. ఏకంగా రూ.1,037.86 కోట్ల రాయితీలట..
పెట్టుబడిలో ఏకంగా 69 శాతం రాయితీలు
ఇది కాకుండా ఎకరా రూ.60 లక్షలతో నాయుడుపేట సెజ్‌లో 37 ఎకరాలు
ఎలాంటి అనుభవం లేకపోయినా సోలార్ ప్యానల్ తయారీ యూనిట్
కోట్ల విలువైన భూమితో పాటు భారీ ప్రోత్సాహకాలపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ
సాక్షి, అమరావతి: కేవలం 10 లక్షల మూలధనంతో రెండు నెలల క్రితం ఢిల్లీలో ఏర్పాటైన కంపెనీ.. రూ.1,504 కోట్ల పెట్టుబడులట.. ఏకంగా ఈ కంపెనీకి ప్రభుతం ఇస్తున్న రాయితీలు అక్షరాల రూ.1,037.86 కోట్లు. నమ్మశక్యంగా లేదా.. ఇలాంటి కంపెనీకి వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కారు చౌకగా కట్టబెట్టడమే కాకుండా పెట్టుబడి విలువలో ఏకంగా 69% రాయితీల రూపంలో తిరిగి వెనక్కు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వోల్ట్‌సన్ ల్యాబ్ ప్రైవేటు లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎంపీసెజ్ (మల్టీ ప్రోడక్ట్ స్పెషల్ ఎకనమిక్ జోన్)లో ఎకరం రూ.60 లక్షల చొప్పున 37 ఎకరాలు కేటాయించింది. చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో ఎకరం ధర రూ.5 కోట్లకు పైనే పలుకుతోంది.
అలాంటిది సోలార్ ప్యానల్స్ తయారీలో ఎటువంటి అనుభవం లేని వోల్ట్‌సన్ ల్యాబ్ రూ.1,743 కోట్లతో 2 గిగావాట్ల సోలార్ సెల్స్, 2 గిగావాట్ల మాడ్యుల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఆ వెంటనే ప్రభుత్వం ఆగమేఘాల మీద ఎస్‌ఐపీసీ (సెక్యురిటీస్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కార్పొరేషన్), ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోçÙన్ బోర్డ్), మంత్రివర్గంతో ఆమోదింపచేసి భూ కేటాయింపులు చేసింది. మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలో రూ.1,504 కోట్లు ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా నిర్ణయించి, ఇందులో 69 శాతం రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ కింద రూ.451.20 కోట్లు, యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ సబ్సిడీ కింద రూ.262.8 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 100 శాతం మినహాయింపు కింద రూ.262.8 కోట్లు, వాటర్ చార్జెస్ సబ్సిడీ కింద రూ.59.4 కోట్లు, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు కింద రూ.1.66 కోట్లు.. మొత్తం రూ.1,037.86 కోట్ల రాయితీ ఇచ్చింది. ఇది కాకుండా క్యాపిటివ్ సోలార్ యూనిట్, 3 ఎంఎల్‌డీ వాటర్ సప్లై వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొంది.
రెండు నెలల క్రితం పుట్టిన కంపెనీ
వోల్ట్‌సన్ ల్యాబ్‌కు సోలార్ ప్యానల్స్ తయారీలో ఎటువంటి అనుభవం లేదు. వాస్తవంగా ఈ కంపెనీ ప్రమోటర్లకు ఎయిర్ కండీషనింగ్ వ్యాపారంలో మాత్రమే అనుభవం ఉంది. ఆగస్టు 22న కమలేష్ కుమార్ జైన్, ప్రదీప్ కుమార్ జైన్‌లు డైరెక్టర్లుగా ఢిల్లీ కేంద్రంగా రూ.10 లక్షల మూల ధనంతో వోల్ట్‌సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. ఇందులో కమలేష్ కుమార్ పీహెచ్‌డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐడీవీబీ రీసైకిలింగ్ ఆపరేషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో డైరెక్టర్. ప్రదీప్‌కుమార్ గోయల్ వైట్ పీక్ రిఫ్రిజరేషన్, అంజ్ ట్రేడర్స్, స్నోపీక్ ఎంటర్ ప్రైజెస్, ఆక్రోబేవ్ (తెలంగాణ), డీజే అగ్రి ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్.
వీరిద్దరికీ సోలార్ ప్యానల్స్ తయారీలో ఎటువంటి అనుభవం లేకపోయినా, ఏకంగా రూ.వందల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కేటాయించడంతోపాటు, పెట్టుబడిలో 70 శాతం వరకు తిరిగి ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీ ఏర్పాటైన రెండు నెలల్లోనే ఇంతగా రాయితీలిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయంటే దీని వెనుక ఏదో బలమైన శక్తి ఉందని చర్చించుకుంటున్నారు.


