
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎవరు అవునన్నా, కాదన్నా తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైందన్నది పిఠాపురంలోని టీడీపీ ముఖ్య నాయకులు, సీనియర్ కార్యకర్తల మాట. ఎన్నికలకు ముందు, తరువాత వర్మ రాజకీయ పరిస్థితిని బేరీజు వేసుకున్న ఎవరికైనా ఈ విషయం ఇట్టే అవగతమవుతుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ గెలుపొందడం, ఉప ముఖ్యమంత్రి కావడంతోనే వర్మ రాజకీయం ప్రశ్నార్థకంగా మారింది. డిప్యూటీ సీఎం సోదరుడు, జనసేన నాయకుడైన నాగబాబు పిఠాపురంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలే వర్మ భవిష్యత్తును తేల్చేసేవిగా స్పష్టమయ్యాయి. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పవన్‌కు పిఠాపురం కేటాయించినప్పుడు తొలి ఎమ్మెల్సీ పదవి నీకేనని వర్మకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గట్టి హామీ ఇచ్చారనే విస్తృత ప్రచారం జరిగింది. ఆ తరువాత ఎమ్మెల్సీ ఊసెక్కడా రాలేదు. ఇదే విషయాన్ని వర్మ అనుచర టీడీపీ నాయకులు గుర్తు చేస్తూండటం గమనార్హం.
నారాయణ మాటల వెనుక మర్మమిదే..
ఇటీవల నెల్లూరు నగర టీడీపీ నాయకులు బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో మంత్రి పి.నారాయణ ఆ ప్రాంత నాయకులతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు, సూచనలు లేకుండా నాయకులు ఎవరూ ఏమీ మాట్లాడకూడదని, అలా ఎవరైనా మాట్లాడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరిస్తూ పిఠాపురం నియోజకవర్గం ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన మాటల్లోనే.. ‘‘ఎన్‌డీఏ గవర్నమెంట్ మూడు పార్టీల కూటమితో కలిపి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కాకినాడ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నా. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ మన పార్టీ వారికి, జనసేనకు రోజూ గొడవలే. నా పని అక్కడ గొడవలను సర్దడమే.
వర్మ వెరీ ఫెరోషియస్. ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఒకసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. స్టేట్‌మెంట్లు ఇస్తూంటే మూడు నాలుగు నెలల కిందట అతన్ని పిలిచి జీరో చేసేశాం. ‘సర్, నన్ను జీరో చేసేశార’ని వర్మనే నాతో అంటూంటారు. తప్పదు. ఎన్‌డీఏ కలసి ఉన్నప్పుడు పిఠాపురంలో మీరేం స్టేట్‌మెంట్లు ఇవ్వవద్దన్నాం. జనసేన వాళ్లు పిలిచి డయాస్‌పై మాట్లాడమంటే మాట్లాడండి. స్టేట్‌మెంట్లు ఇవ్వమంటే ఇవ్వండి. మీరేం మాట్లాడొద్దన్నాం. సీఎంగారు వర్మను పిలవమంటే పిలిపించాను. నా ఎదుటే సర్ వర్మతో మాట్లాడారు. ఇవాళ నుంచి నువ్వు మాట్లాడొద్దు. అలా కాదు, లేదంటే నువ్వేమైనా పార్టీ కోవర్ట్‌వా అనుకోవాల్సి వస్తుంది.
సూపర్‌సిక్స్ సదస్సు కూడా వర్మను చేయవద్దన్నారు. నన్ను వెళ్లి చేయమన్నారు. నేనే వెళ్లి చేసివచ్చా..’’ అని ముక్తాయించారు. ఇప్పుడు ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై టీడీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా వర్మ అనుచరులు ఆగ్రహోదగ్రులు అవుతున్నారు. నారాయణ మాటలను బట్టి, జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుంటే మన నాయకుడు జీరో అయినట్లే కదా అని ఓవైపు చెవులు కొరుక్కుంటూనే ఇప్పుడేం చేద్దామనే సమాలోచనలు చేసుకుంటున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’తో అనడం గమనార్హం. ‘పిఠాపురంలో టీడీపీని క్రమంగా నిరీ్వర్యం చేస్తున్నది వాస్తవం. అధిష్టానం నియోజకవర్గాన్ని వదిలేసుకున్నదనేది కూడా అంతే నిజం’ అని ఆయన వాపోయారు.
బింకాలు పోతున్న వర్మ
వైరల్ అవుతున్న నారాయణ ఆడియోలోని అంశాలను తాజాగా వర్మ వద్ద మీడియా ప్రస్తావించగా తాను జీరో కానని చెప్పుకోవాల్సి వచ్చింది. తనేంటో, తన రాజకీయ పరిస్థితులు ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఆయన పరిస్థితి అగమ్యగోచరంగానే తయారైంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన తొలి ఎమ్మెల్సీ అనే హామీ అటకెక్కింది. మనం ఎవరి మాటలూ వినక్కర్లేదు, పట్టించుకోవాల్సిన పని లేదన్న నాగబాబు మాటలను బట్టి నియోజకవర్గంలో జనసేనకే ప్రాధాన్యం తప్ప తక్కిన వారికేమీ లేదని తేలిపోయింది. అందువల్లనే అప్పటి నుంచీ ఎవరి కుంపటి వారిదన్నట్లు అయిపోయింది. జనసేన, టీడీపీ కార్యక్రమాలు వేర్వేరుగానే కొనసాగుతున్నాయి. వర్మను రానీయవద్దని జనసేన నాయకులు బాహాటంగానే అంటున్నది తెలియనిదేమీ కాదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎవరైనా అధికారులు పిలిస్తే సరి! లేదంటే జనసేన నుంచి వర్మకు పిలుపు ఉండటం లేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లు, ఆలయ కమిటీలు, కార్పొరేషన్ల వంటి వాటిల్లో వర్మ అనుయాయులకు పదవులు దక్కిన దాఖలాల్లేవు.
వారంతా ఒక్కటయ్యారా!
ఏదో సినిమాలో.. మీది తెనాలే, మాది తెనాలే అన్నట్లు.. జనసేన ముఖ్య నాయకులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ ఒక్కటైపోయారా అనే అనుమానాలను సైతం టీడీపీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే నెల్లూరు నాయకులతో జరిగిన కాన్ఫరెన్స్‌లో ‘వర్మ జీరో అయ్యారు. జీరోను చేసేశాం’ అని టీడీపీకి చెందిన మంత్రి అనడమేమిటని సందేహిస్తున్నారు. పైగా తమ పార్టీ అధినేత చంద్రబాబు ‘నిన్ను కోవర్టు అనుకోవాలా?’ అని వర్మనుద్దేశించి ఎందుకంటారనే చర్చలు టీడీపీలో అంతర్గతంగా జరుగుతూండటం పరిశీలనాంశం.
నష్ట నివారణలో నేతలు
నారాయణ వాఖ్యలు పిఠాపురం టీడీపీలో తీవ్ర దుమారం లేపడంతో నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. అధిష్టానం తలంటడంతో వర్మను నారాయణ విశాఖకు పిలిపించుకుని మాట్లాడారు. వర్మనుద్దేశించి తానలా అనలేదని, ఆ ఆడియో కట్ అండ్ పేస్ట్‌లా ఉందని నారాయణ వివరణ ఇచ్చుకోగా, తాను ఇలాంటి వాటిని పట్టించుకోనని వర్మ అభిప్రాయడ్డారు.
పిఠాపురంలో వర్మను జీరో చేసేశాం. నాలుగు నెలల కిందట సీఎం పిలిపించమన్నారు. నువ్వు ఏ స్టేట్‌మెంట్లూ ఇవ్వొద్దు. జనసేన వాళ్లు పిలిస్తే వెళ్లాలి. మాట్లాడమంటే మాట్లాడాలి. అలా లేదు, కాదంటే పార్టీలో నిన్ను కోవర్టు అనుకోవాల్సి ఉంటుందని సీఎమ్మే అన్నారు.
– పి.నారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి
ఎవరో అంటేనో, ఎవరో చెబితేనో నేను జీరోను కాను. నేనేంటో నాకు, నియోజకవర్గంలో నా కార్యకర్తలకు తెలుసు. నన్ను ఎవరూ పిలిచి మాట్లాడలేదు. నాకేమీ చెప్పలేదు. పార్టీ కోసం నా మార్గంలో నేను వెళతాను. కార్యక్రమాలు కొనసాగిస్తూంటాను.
– ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం