మందుపాతరలతో సహజీవనం | Unsafe workers at fireworks centers | Sakshi
Sakshi News home page

మందుపాతరలతో సహజీవనం

Oct 11 2025 6:00 AM | Updated on Oct 11 2025 6:00 AM

Unsafe workers at fireworks centers

బాణసంచా కేంద్రాల్లో భద్రత లేని కూలీలు

కనీస రక్షణ కరవు 

చుట్టూ పేలుడు పదార్థాలు 

ఒంటి మీద కూడా రసాయనాలే 

అందుకే ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోతున్న కార్మికులు 

ఘటనా స్థలంలోనే మృత్యువాత 

నిపుణులు కూడా కొరత 

దీపావళి సమయంలో తాత్కాలికంగా కూలీల నియామకం 

ఆర్డర్ల పేరుతో విశ్రాంతి లేకుండా పనులు 

సాక్షి, అమలాపురం: మందుగుండు సామగ్రి తయారు చేసే బాణసంచా తయారీ కేంద్రాలలో పని చేయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. మిగిలిన చోట్ల ఏమోకాని.. బాణసంచా తయారీ  కేంద్రంలో పనిచేయడం అంటే మృత్యువుతో నిత్యం చెలగాటం ఆడడమే. అది తెలిసి కూడా కార్మికులు, కూలీలు పొట్ట కూటికోసం వీటిలో పనిచేసేందుకు వెళుతున్నారు. మందుపాతర మీద కూర్చుని జీవన పోరాటం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ప్రమాదాలు జరిగితే మృత్యువు బారిన పడుతున్నారు. గాయాలతో బయట పడినా జీవచ్ఛవాలుగా మారుతున్నారు.  

అనుమతి లేని కేంద్రాలే అధికం 
కోనసీమ జిల్లా రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్‌ ఫైర్‌ వర్క్స్ లో బుధవారం పెను విస్ఫోటం జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలై ప్రాణాలతో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులంతా అతి పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. జీవనోపాధి కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ వీరు ఇక్కడ పని చేస్తున్నారు. 

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు అధికారికంగా 18 వరకు ఉండగా, ఒక స్టోరేజ్‌ కేంద్రం ఉంది. కాని వాస్తవంగా అనుమతి లేని కేంద్రాలు చాలా ఉన్నాయి. అనుమతి ఉన్న కేంద్రాలలో మాత్రమే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని తయారీ కేంద్రాలు, అమ్మకం దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇటీవల అయినవిల్లి మండలం విలసలో ఇంటిలో నిల్వ ఉంచిన బాణసంచా పేలడం వల్ల ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.  

కార్మికుల రక్షణ పట్టని అధికారులు 
» నిబంధనల ప్రకారం అన్ని రక్షణ చర్యలు తీసుకుంటేనే అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో పనిచేస్తున్న కార్మికుల రక్షణ విషయాన్ని మాత్రం అధికారులు పట్టించుకోవడంలేదు.

»బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులు. ఇక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. వీరెవ్వరూ వృత్తి నైపుణ్యం ఉన్నవారు కాదు. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే రా మెటీరియల్‌పై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి లేదు.  

» బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇది కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలిపోయే స్వభావం ఉంటుంది. అయితే పనిచేసే వారికి ఈ అవగాహన లేకుండా పోతోంది.  

» పొటాషియం నైట్రేట్, మెగ్నీషియం పౌడర్, సల్ఫర్‌ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. పౌడర్‌గా తగు పాళ్లలో కలిపి క్రేకర్స్‌ తయారు చేయాల్సి ఉంది.  

» బాణసంచా తయారు కేంద్రాల్లో అన్ని రసాయనాలు కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అన్‌ స్కిల్డ్‌ లేబర్‌తో నూరిస్తున్నారు. అదే పేలుళ్లకు దారి తీస్తోంది. 

»బాణసంచా తయారు చేసే ప్రతి కార్మికునికి చేతులకి గ్లౌజ్‌లుండాలి. అగ్ని బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతోపాటు తలకు హెల్మెట్‌ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌ తప్పనిసరి. తయారు చేస్తున్న బాణసంచా, దానికి వాడే రసాయనాలు, వాటిని ఎలా కలపాలి అనే దానిపై కార్మికుడికి అవగాహన కల్పించాల్సి ఉంది. కాని ఎక్కడా ఇటువంటివి పాటించడం లేదు.  

» బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీలు లేకుండా వారి శరీరాలు మారిపోతున్నాయి. జిల్లాలో ఇంచుమించు ప్రతి బాణసంచా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

»  రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతీ కార్మికుని ముఖానికి మాస్క్‌ తప్పనిసరి. అయితే ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బ తినడంతో పాటు చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. కొంతమంది చిన్న వయసులోనే క్యాన్సర్ల బారిన పడుతున్నారు.  

»  దీపావళి సమయంలో పెద్ద ఎత్తున వచ్చే ఆర్డర్ల కోసం తయారీదారులు అప్పటికప్పుడు సాధారణ కూలీలను కూడా పనిలో పెట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీరికి తయారు చేసే అనుభవం లేకపోవడం వల్ల పేలుళ్లు సంభవిస్తున్నాయి.  

»   చిన్న పిల్లలను, మహిళలను మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు అనుమతించ కూడదు. కానీ రాయవరంలో జరిగిన పేలుడులో మృతి చెందినవారిలో ఐదుగురు మహిళలే.  

»  ఇంత జరుగుతున్నా వీటిపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మిక, వైద్య శాఖలు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. వారి నిర్లక్ష్యమే కార్మికుల పాలిట శాపంగా మారింది.

తనిఖీ చేసిన కేంద్రంలోనే భారీ ప్రమాదం
తయారీ కేంద్రాల వద్ద తీసుకుంటున్న రక్షణ చర్యలు, అధికారుల తనిఖీలు కూడా లోపభూయిష్టంగా ఉంటున్నాయి. ఉండాల్సిన స్థాయిలో వాటర్‌ ట్యాంకులు ఉన్నాయా? ఇసుక నిల్వలు ఉంచారా? తయారీ కేంద్రం ఊరికి దూరంగా ఏర్పాటు చేశారా లేదా? మంటలను ఆర్పే కార్బన్‌ డయాక్సైడ్‌ కిట్టు ఉందా లేదా చూసి లైసెన్సులు రెన్యువల్‌ చేయడం, కొత్తగా ఏర్పాటు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తున్నారు. రాయవరంలో ప్రమాదానికి గురైన బాణసంచా తయారీ కేంద్రాన్ని కూడా అధికారులు ఇటీవల తనిఖీ చేసి రెన్యువల్‌ చేశారు. అటువంటి చోటే భారీ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. 

రసాయనాల పట్ల అవగాహన ఉండాలి
బాణసంచా తయారు చేసేందుకు వాడే రసాయనాలపై ప్రతి కార్మికునికి, కూలీలకు అవగాహన ఉండాలి. ఇందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. రసాయనాలను కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇవన్నీ మండే కారకాలే. కార్మికుల ఒంటి నిండా రసాయనాలు ఉంటున్నాయి. ఈ కారణంగానే చిన్న నిప్పురవ్వ రాజుకున్నా పేలుడు సంభవించడం, కార్మికుల చనిపోవడం పరిపాటిగా మారింది.  – పెచ్చెట్టి కృష్ణ కిషోర్, రసాయన శాస్త్ర అధ్యాపకుడు, గోదావరి కాలుష్యంపై అధ్యయనకర్త, అమలాపురం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement