
మారణాయుధాలతో టీడీపీ మూకల దాడి
గ్రామంలో అక్రమాలను అడ్డుకున్నందుకే కక్ష సాధింపు
బాధితుడి పరిస్థితి విషమం
గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఘటన
సాక్షి టాస్క్‌ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ..
మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్‌కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్‌లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు.
టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే..
మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది.

శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి
ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు.
సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్‌సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్)