
పోలీసులకు దొరికిన ఆ పార్టీ నేత రుత్తల రాము
హైదరాబాద్ నుంచి స్పిరిట్ కొనుగోలు
పరవాడలో తయారీ.. బెల్టు షాపులకు సరఫరా
కూటమి నేతల ఆధ్వర్యంలో కల్తీ మద్యానికి అడ్డాగా అనకాపల్లి జిల్లా
సాక్షి, అనకాపల్లి : పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లి జిల్లాను టీడీపీ కూటమి నేతలు కల్తీ మద్యానికి అడ్డాగా మార్చేస్తున్నారు. ఈనెల 2న పరవాడలో కల్తీ మద్యం స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడిచేసి ఇద్దరు నిందితులను అరెస్టుచేయడమే కాక వారి నుంచి 72 లీటర్ల స్పిరిట్, నకిలీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనం స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రుల్లో ఉపయోగించే స్పిరిట్‌ను వీరు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం తయారుచేస్తున్నారు.
అరెస్టయిన ఇద్దరిలో టీడీపీ నేత రుత్తల రాము కీలకంగా ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంకు చెందిన రాము స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ప్రభుత్వ పాఠశాల పేరెంట్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో రుత్తల రాము చైర్మన్‌గా గెలిచారు. గ్రామంలో ఈయన టీడీపీ తరఫున చురుగ్గా ఉంటారని తెలుస్తోంది.
మరోవైపు.. పరవాడకు చెందిన యలమంచిలి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్‌తో కలిసి రాము నకిలీ మద్యం తయారుచేస్తూ బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. తొలుత వీరు గ్రామంలో ఒక హోటల్ నిర్వహించేవారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
స్పీకర్ అయ్యన్నకు సన్నిహితుడు..
ఇదిలా ఉంటే.. కల్తీ మద్యం కేసులో పట్టుబడిన నిందితుడు రుత్తల రాము టీడీపీ కండువాతో స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయ్యన్నకు అత్యంత సన్నిహితుడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. ఈ కల్తీ మద్యం వ్యాపారం తెర వెనక ఎవరున్నారనే కోణంలో ఎౖMð్సజ్ పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు.