న్యాయవాది రేకుల షెడ్డును కూలగొట్టి కలపను పారేస్తున్న దృశ్యం
కాకినాడ జిల్లాలో దారుణం
ఫిర్యాదు స్వీకరించని పోలీసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం ఉందనే అండ చూసుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చివరకు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులనూ వదలడం లేదు. తాజాగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపురం గ్రామంలో మంగళవారం లాయర్ అచ్చా మరిడియ్యపై స్థానిక టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తండ్రి నుంచి సంక్రమించిన 12 సెంట్ల స్థలంలో మరిడియ్య రేకులతో ఇల్లు నిర్మించుకున్నారు.
అయితే ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు గతంలో టీడీపీ నేతలు యత్నించగా మరిడియ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో టీడీపీకి చెందిన యడ్ల అప్పలరాజు, యడ్ల సూరిబాబు, యర్రమిల్లి సూర్యప్రకాష్ యడ్ల సత్యనారాయణ, యర్రమిల్లి దుర్గ రమేష్ మంగళవారం తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు మరిడియ్య విలేకరులకు తెలిపారు. జేసీబీతో తన ఇంటిని కూల్చేయడంతో కోర్టు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు ధ్వంసం అయ్యాయన్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన మరిడియ్య ప్రస్తుతం తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా తొండంగి పోలీసులు స్వీకరించలేదని మరిడియ్య తెలిపారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు, కోర్టులో న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. న్యాయవాదిపై జరిగిన దాడిని బార్ అసోసియేషన్, న్యాయవాద సంఘాలు ఖండించాయి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని మరిడియ్య అధికారులను కోరారు.


