
సింగపూర్ కంపెనీలకు మెయిల్స్ పంపింది అతడే
అపాయింట్‌మెంట్ కోసం రూ.38 లక్షలు లంచమిచ్చి మోసపోయిన మురళీకృష్ణ
చినబాబు ప్రైవేటు బృందం సభ్యుడు వంశీ అకౌంట్‌కు లంచం జమ
ఆ అక్కసుతోనే సింగపూర్ ప్రభుత్వ కంపెనీలకు మెయిల్స్
పెదబాబు పోస్టుమార్టంలో వాస్తవాలు బట్టబయలు
తనయుడికి తలంటిన ముఖ్యనేత
తనకు తెలియకుండానే జరిగాయని జారుకున్న చినబాబు
సాక్షి, అమరావతి: డ్యామిట్ కథ అడ్డం తిరిగిందంటే ఇదే.. సింగపూర్ ప్రభుత్వంలోని అందరికీ ఏపీతో ఒప్పందాలు చేసుకోవద్దంటూ మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ–మెయిల్స్ పంపించాడని, అతను వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తి అని చినబాబు ఇటీవల శివాలెత్తిపోయారు. అయితే ఈ వ్యవహారంపై సింగపూర్ కంపెనీల ఫిర్యాదుతో పెదబాబు చేపట్టిన పోస్టుమార్టంలో నిర్ఘాంతపోయే వాస్తవాలు బట్టబయలయ్యాయి. ఈ–మెయిల్స్ పంపించి సింగపూర్‌లో రాష్ట్రం పరువు తీసింది చినబాబు బాధితుడేనని తేలింది. దీంతో పెదబాబు చినబాబుకు తలంటారు. అయితే అవన్నీ తనకు తెలీకుండా జరిగాయని తనయుడు చల్లగా జారుకోవడంతో సింగపూర్‌లో పరువుమొత్తం పోయిందంటూ పెదబాబు గగ్గోలు పెడుతున్నట్టు సమాచారం.
పెదబాబు పోస్టుమార్టంలో తేలిందేమంటే..!
చిలకలూరిపేటకు చెందిన మురళీకృష్ణ అమెరికాలో ఉంటారు. చిలకలూరి పేటలో తనకు ఉన్న భవనం సెటిల్‌మెంట్ కోసం ఆయన చినబాబు అపాయింట్‌మెంట్ కోసం యతి్నంచారు. మంత్రి ప్రైవేట్ బృందంలోని ఎ.వంశీని సంప్రదిస్తే అపాయింట్‌మెంట్‌కు రూ.38 లక్షలు, భవనం సెటిల్‌మెంట్‌కు రూ.కోటికి బేరసారాలు నడిపారు. దీంతో మురళీకృష్ణ అపాయింట్‌మెంట్ కోసం రూ.38 లక్షలు వంశీ ఖాతాకు జమ చేశారు. చివరకు చినబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో మురళీకృష్ణ కడుపు మండింది. ఆగ్రహంతో సింగపూర్ ప్రభుత్వానికి, కంపెనీలకు ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా ఈ–మెయిల్స్ పంపించారు.
మెయిల్స్ చూపించి నిలదీసిన సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు
ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు అపాయింట్‌మెంట్లకూ లంచాలు తీసుకుంటారని మురళీకృష్ణచేసిన మెయిల్స్‌ను పెదబాబుకు చూపించి సింగపూర్ కంపెనీలు నిలదీశాయి. మీ పరిపాలన ఇలా ఉంటే ఎలాగని, పెట్టుబడులు పెట్టేందుకు తాము వస్తే తమకూ అపాయింట్‌మెంట్లు అమ్మరని గ్యారెంటీ ఏమిటని ప్రశి్నంచినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో పెదబాబు ఈ మెయిల్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కూపీ లాగితే చినబాబు అవినీతి డొంక కదిలినట్టు సమాచారం. దీనిపై చినబాబుతోపాటు ఆయన ప్రైవేటు బృందానికీ పెదబాబు తలంటినట్టు తెలుస్తోంది.
చినబాబు బాధితుడే బ్లాక్‘మెయిలర్’
తొలి నుంచి చినబాబు చిల్లర టీమ్‌పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల మంత్రి అపాయింట్‌మెంట్ కోసం సంప్రదించిన పదిమంది పారిశ్రామికవేత్తల వద్ద కూడా అతని బృందం డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. చివరకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా చినబాబు బయటకు వెళ్లిపోవడంతో పారిశ్రామిక వేత్తలు కరకట్ట క్యాంపులో రచ్చరచ్చ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చినబాబు అపాయింట్‌మెంట్ లంచాల వ్యవహారం అధికారపార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.