వెంటిలేటర్లు, అనస్థీషీయా వర్క్‌స్టేషన్స్, ఇతర పరికరాల కొనుగోలు టెండర్‌ను సాగదీస్తున్న ప్రభుత్వ పెద్దలు
రూ.40 కోట్లతో పరికరాల కొనుగోళ్లలో ఢిల్లీ సంస్థతో మిలాఖత్
గత ప్రభుత్వంలో అర్హత కూడా సాధించని ఢిల్లీ సంస్థ
లైఫ్ సేవింగ్ పరికరాల కొనుగోళ్లలో ఉన్నతాధికారులు, నేతల కాసుల వేట
సాక్షి, అమరావతి: ‘ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు. కమీషన్లే మాకు ముఖ్యం’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. డీల్ కుదుర్చుకున్న సంస్థకే వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు నెలల తరబడి టెండర్ ప్రక్రియను సాగదీస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన, తీవ్ర అనారోగ్యం పాలై కొనఊపిరితో కొట్టుమిట్టాడే రోగులకు చికిత్సల్లో అవసరమయ్యే వెంటిలేటర్లు, ఇతర లైఫ్ సేవింగ్ పరికరాల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌ను ఢిల్లీ సంస్థకు కట్టబెట్టి కమీషన్లు దండుకునేలా కూటమి నేతలు, కొందరు ఉన్నతాధికారులు డీల్ కుదుర్చుకున్నారు. ఏకంగా రూ.40 కోట్ల పరికరాల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌ను తాము అనుకున్న సంస్థకు మాత్రమే కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
గత ఏడాది టెండర్లు పిలిచినా
యూజీ, పీజీ సీట్ల పెంపు కోసం విశాఖ, తిరుపతి, ఒంగోలు, విజయవాడ బోధనాస్పత్రులకు 20 వెంటిలేటర్లు, 36 అనస్థీషియా వర్క్ స్టేషన్స్, 48 ఓటీ ల్యాంప్స్ కొనుగోలుకు గతేడాది ఏపీ మెడికల్ సర్విసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ) టెండర్లు పిలిచింది. వీటి విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ టెండర్ ద్వారా ఖరారు చేసిన ధరలతో రెండేళ్ల పాటు ప్రభుత్వాస్పత్రులకు పరికరాలు సరఫరా చేసే అవకాశం కాంట్రాక్ట్ సంస్థకు లభిస్తుంది.
గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులతో పాటు కొత్తగా నిరి్మంచిన క్రిటికల్ కేర్ బ్లాక్స్‌కు 70కి పైగా వెంటిలేటర్లు, 10కిపైగా అనస్థీషియా వర్క్‌స్టేషన్లను ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.40 కోట్ల విలువైన ఈ పరికరాల కొనుగోళ్లలో భారీ మొత్తంలో కమీషన్లు పొందడానికి కూటమి నేతలు, వైద్య శాఖలోని ఉన్నతాధికారులు స్కెచ్ వేశారు.
గంపగుత్తగా కాంట్రాక్ట్‌ను ఢిల్లీకి చెందిన సంస్థకు కట్టబెట్టేందుకు 9 నెలలుగా టెండర్ ప్రక్రియను సాగదీస్తూ వస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వెంటిలేటర్ల కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆస్పత్రుల నుంచి డీఎంఈకి నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపల్స్‌తో వైద్యశాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలోనూ కేజీహెచ్ సహా పలు ఆస్పత్రుల అధికారులు ఆ అంశాన్ని లేవనెత్తారు.
పాత టెండర్ రద్దుచేసి..
వాస్తవానికి హై ఎండ్ ఓటీ ల్యాంప్స్ కొనుగోలుకు గత ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచారు. ఆపరేషన్ థియేటర్‌లో రోగులకు సర్జరీ చేస్తున్నప్పుడు రికార్డు చేసి, థియేటర్‌కు వెలుపల ఉండే వైద్య విద్యార్థులు మానిటర్ ద్వారా పర్యవేక్షించడానికి వీలుగా అప్పట్లో నిబంధనలు రూపొందించారు. ఆ టెండర్లలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న ఢిల్లీ సంస్థ దాఖలు చేసిన బిడ్ కనీస అర్హతకు నోచుకోలేదు. హై ఎండ్ పరికరాలు సరఫరా చేసే సత్తా సదరు సంస్థకు లేకపోవడంతో బిడ్‌ను తిరస్కరించారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అదే సంస్థకు వెంటిలేటర్లు, అనస్థీ
షీయా వర్క్ స్టేషన్స్‌తో పాటు ఓటీ ల్యాంప్స్ సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు అప్పటివరకూ వేరుగా ఉండే ఓటీ ల్యాంప్స్ టెండర్‌ను రద్దు చేశారు. మూడింటికీ ఒకే టెండర్‌ను గతేడాది మేలో పిలిచారు.
సంస్థకు మేలు చేయడం కోసం ఓటీ ల్యాంప్స్‌కు వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉండాలనే నిబంధనను తొలగించేశారు. మిగిలిన పరికరాల కొనుగోళ్ల నిబంధనల్లోనూ సదరు సంస్థకు మేలు జరిగేలా సవరణలు చేశారు. బిడ్‌ల స్రూ్కటినీ అనంతరం గత నెలలో ఢిల్లీ సంస్థ పరికరాల డెమో ఇచి్చనట్టు సమాచారం. ఈ సందర్భంగా టెండర్ నిబంధనలకు విరుద్ధమైన అనస్థీషియా వర్క్ స్టేషన్స్‌ను చూపినట్టు తెలుస్తోంది. వర్క్‌స్టేషన్ ఒక కంపెనీ, మానిటర్ మరో కంపెనీకి చెందినవి చూపినట్టు తెలుస్తోంది.
టెండర్లలో పాల్గొనే సంస్థలు పరికరాలను ప్రాక్టికల్‌గా డెమో ఇవ్వాలని నిబంధనలున్నాయి. అయితే వెంటిలేటర్లను ప్రాక్టికల్ డెమో నిర్వహించకుండా డీఎంఈ అధికారులు మమ అనిపించారనే విమర్శలున్నాయి. వెంటిలేటర్లు, ఓటీ ల్యాంప్స్, అనస్థీషియా వర్క్‌స్టేషన్లకు వేర్వేరుగా టెండర్లు పిలిస్తే ఆయా విభాగాల్లో ఎక్కువ తయారీ సంస్థలు పాల్గొంటాయి. తద్వారా వాటిమధ్య పోటీ ఏర్పడి తక్కువ ధరకు నాణ్యమైన పరికరాల కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ విషయం తెలిసినా అధికారులు, ప్రభుత్వ పెద్దలు నిబంధనల్ని పక్కనపెట్టి ఢిల్లీ సంస్థతో బేరాలు కుదుర్చుకునేందుకే తహతహలాడుతున్నారు.


