
పెదవేగి ఫ్యాక్టరీ భూములు, ఆస్తులపై పెద్దల కన్ను
కారుచౌకగా కొట్టేసేందుకు తెరవెనుక కుట్రలు
లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ పీక నులిమేయడమే లక్ష్యంగా అడుగులు.. ఏడాది పాటు ఓఈఆర్ ప్రకటించని టీడీపీ కూటమి ప్రభుత్వం
రోడ్డున పడనున్న 300 మందికి పైగా సిబ్బంది.. 2.5 లక్షల మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరం
లాభాల్లో నడుస్తున్న ఏలూరు జిల్లా పెదవేగి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రూ.కోట్ల విలువైన ఫ్యాక్టరీ భూములతో పాటు ఆస్తులను కాజేసేందుకు పథకం రూపొందించినట్లు చర్చ జరుగుతోంది. ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న రెండు యూనిట్లకు అదనంగా కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తుండగా, ఏపీలో మాత్రం ఏకైక యూనిట్‌ను పీపీపీ మోడ్‌లో ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు కట్టబెట్టేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఈ ప్రతిపాదనకు మొగ్గు చూపలేదన్న కారణంతో ఓ సీనియర్ ఐఎఎస్‌ను తప్పించి ఆ బాధ్యతలను తమకు అనుకూలమైన అధికారికి అప్పగించారు. ఇదే వ్యూహంతో ఏడాదిలో ఐదుగురు ఎండీలను మార్చారు. –సాక్షి, అమరావతి
తొలి పామాయిల్ ప్రొసెసింగ్ యూనిట్
రాష్ట్రంలో 5.66 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు ఉండగా ప్రత్యక్షంగా 2.5 లక్షల మంది రైతులతో పాటు పరోక్షంగా మరో 8 లక్షల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. రాష్ట్రంలో ఏటా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఇదే. ఏపీ కో–పరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన తొలి పామాయిల్ ప్రొసెసింగ్ యూనిట్ కూడా ఇదే.
ఏపీ ఆయిల్ ఫెడ్ 25 ఏళ్లుగా ఎఫ్‌ఎఫ్‌బీ ధరను నిర్ణయించడం, ఆయిల్ పామ్ రైతు సమాజానికి సేవ అందించడంలో కీలక పాత్ర పోషించింది. పెదవేగి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలో నూనె దిగుబడి శాతాన్ని బట్టే దాదాపు 8 ప్రైవేట్ ఫ్యాక్టరీలు సైతం రైతుకు ధరను చెల్లిస్తుంటాయి. 1992లో ఏర్పాటైన పెదవేగి ఫ్యాక్టరీ 2018–19 నాటికి పది టన్నుల సామర్థ్యానికి చేరింది. 2019–20లో రూ.10 కోట్లతో ఆధునికీకరించడం ద్వారా ఫ్యాక్టరీ సామర్థ్యం 24 టన్నులకు పెరిగింది. ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే నెం.1గా ఏపీని నిలబెట్టడంలో చురుకైన పాత్ర పోషించిన పెదవేగి ఫ్యాక్టరీ ఉనికి నేడు ప్రశ్నార్ధకంగా మారింది.
ఓఈఆర్ ప్రకటించని కూటమి ప్రభుత్వం
గత ప్రభుత్వ హయాంలో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ పరిస్థితి, ప్రాసెసింగ్‌తో సంబంధం లేకుండా ఏటా క్రమం తప్పకుండా తెలంగాణ కంటే మెరుగైన రీతిలో ఓఈఆర్‌ను ప్రకటిస్తూ వచ్చింది. తద్వారా రైతులు లాభదాయకమైన ధర పొందేందుకు అవకాశం కల్పించింది. 2018–19 మధ్య గరిష్టంగా సగటున తాజా గెలలకు టన్నుకు రూ.7492 ధర లభిస్తే 2019–23 మధ్య వైఎస్ జగన్ హయాంలో రికార్డు స్థాయిలో టన్నుకు రూ.23,365 చొప్పున లభించింది.
కెర్నిల్ నట్స్‌కు కూడా టన్నుకు రూ.29,250 ధర లభించింది. మరోవైపు రూ.250 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ యూనిట్ ఏర్పాటు కోసం ఆర్థిక చేయూతనివ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖలు కూడా రాశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రాసెసింగ్ ద్వారా పెదవేగి ఫ్యాక్టరీ ప్రస్తుతం ఏటా రూ.10–15 కోట్లకు పైగా లాభాలను ఆర్జిస్తోంది.
నాడు ఎకరా రూ.7 లక్షల ధరతో కొనుగోలు చేసిన ఫ్యాక్టరీ భూములు ప్రస్తుతం ఎకరా రూ.60 లక్షలకు పైగా పలుకుతున్నాయి. ఇక భవనాలు, యంత్ర పరికరాల విలువ ఎంత తక్కువ లెక్కేసుకున్నా మరో రూ.250 కోట్లకు పైగా ఉంటాయని చెబుతున్నారు. పెదవేగి, లింగపాలెం, ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు ప్రాంతాలకు చెందిన రైతులు 33,081 ఎకరాల్లో పండించిన పంటను ఇక్కడకు తెస్తుంటారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చాక కుతంత్రాలు మొదలయ్యాయి.
ఆయిల్ దిగుబడి తగ్గుతోందనే సాకుతో ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న మండలాలను ప్రైవేటు ఫ్యాక్టరీలకు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తద్వారా లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లో కూరుకుపోయేలా చేసి ప్రైవేటు పరం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇదే లక్ష్యంతో ఏడాదిగా కూటమి ప్రభుత్వం ఓఈఆర్ ప్రకటించకుండా కాలయాపన చేస్తోంది.
మూతపడితే గుత్తాధిపత్యం
పెదవేగి ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తే ప్రైవేటు కంపెనీల గుత్తాధిపత్యంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఉండదు. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను సాకుగా చూపి పామాయిల్ కొనకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఫ్యాక్టరీ మూతపడితే వందల మంది రోడ్డున పడే ప్రమాదం ఉంది.
కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి దిగుమతి సుంకాలను పునరుద్ధరించేందుకు కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పెదవేగి ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసేందుకు యత్నించడంపై రైతులు మండిపడుతున్నారు. పెదవేగి ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చర్యలనునిరసిస్తూ ఆయిల్ పామ్ రైతులు ఆందోళన బాటపట్టారు. జిల్లాల వారీగా ఆయిల్ పామ్ రైతులు సమావేశమై కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఫ్యాక్టరీని ప్రవేటుపరం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.
తక్షణం విరమించుకోవాలి...
పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించి రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం ఆలోచన చేయడం తగదు. దీన్ని వెంటనే విరమించుకోవాలి. దేశంలోనే అత్యధికంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం ఏలూరు జిల్లాలో ఉంది. –కె. శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం
లక్షల మంది భవిష్యత్తు అంధకారం
లాభాల్లో ఉన్న పెదవేగి యూనిట్‌ను పూర్తి స్థాయిలో ఆధునికీకరించాలి. భవిష్యత్ అవసరాల మేరకు కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలి. అంతేకానీ ఉన్న యూనిట్‌ను అమ్మేసుకోవడం సరికాదు. ప్రైవేటీకరణ చేస్తే 2.5 లక్షల మంది రైతుల భవిష్యత్ అంధకారమవుతుంది. –కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్ పామ్ రైతుల సంఘం