వద్దంటే పోటీ చేస్తావా.. ఇప్పుడు దిక్కెవరు? | TDP Cadre Attacks On YSRCP: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వద్దంటే పోటీ చేస్తావా.. ఇప్పుడు దిక్కెవరు?

Nov 10 2026 6:11 AM | Updated on Nov 10 2026 6:11 AM

TDP Cadre Attacks On YSRCP: Andhra pradesh

దళితులపై దాడికి పాల్పడుతున్న పచ్చగూండాలు, గాయపడిన పూనూరు క్రాంతికుమార్‌

వైఎస్సార్‌సీపీ దళిత అభ్యర్థిపై టీడీపీ మూకలతో కలిసి సీఐ దాడి 

ఇళ్లలోకి దూరి కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదిన వైనం

వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చిన ఇతర దళిత కుటుంబాలపై కూడా దాడి 

మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టిన చీమకుర్తి సీఐ  

10 మందికి తీవ్ర గాయాలు.. మరో 15 మందికి గాయాలు 

ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులు

వైఎస్సార్‌సీపీకి ఓటేసిన వారంతా ఊరు వదిలిపోవాలని హుకుం 

భయంతో ఊరు దాటిన 200 మంది దళితులు 

తాత్కాలికంగా ఒంగోలు అంబేడ్కర్‌ భవన్‌లో బస 

దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పరామర్శ 

నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో పచ్చ గూండాలు రెచ్చిపోయారు. పరిషత్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేయడం వంటి చర్యలకు పాల్పడిన పచ్చదండు.. వద్దని చెబుతున్నా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేశారన్న కోపంతో ఫలితాలు వెలువడిన తర్వాత దళిత కుటుంబంపై, అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో ఇతర దళిత కుటుంబాలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. 

కర్రలు, ఇనుప రాడ్లతో మహిళలను సైతం ఇళ్లలోంచి బయటకు లాగి కొట్టారు. పోలీసులు వచ్చి ప్రాణాలు రక్షిస్తారని ఎదురు చూసిన బాధితులకు.. స్వయంగా చీమకుర్తి సీఐ ప్రసాద్‌ సైతం వచ్చీ రాగానే దాడికి పాల్పడడం షాక్‌కు గురి చేసింది. దిక్కుతోచని స్థితిలో బాధితులుప్రాణాలు అర చేతిలో పెట్టుకొని ఒంగోలుకు పారిపోయారు. బాధితుల కథనం ప్రకారం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా జండ్రాజుపల్లి ఏసేబు పోటీ చేశారు. పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేశారు. 

ఏసోబు వారి మాట వినకుండా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జండ్రాజుపల్లి కోటేశ్వరరావు గెలుపొందారు. తన మాట వినకుండా పోటీ చేసిన ఏసోబు మీద కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి 9.30 గంటలకు ఎల్లయ్యనగర్‌కు చెందిన టీడీపీ నాయకులు చాంద్‌ బాషా, గౌస్‌ బాషా, ఎస్‌.కె.బుల్లా మద్యం తాగి ద్విచక్ర వాహనంపై పూనూరి క్రాంతికుమార్‌ ఇంటి వద్దకు వచ్చి, అంతు చూస్తామని బెదిరించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పూనూరి క్రాంతికుమార్, ఎనుబర్ల ప్రభుదాసుతో వాగ్వాదానికి దిగారు.

అనంతరం టీడీపీకి చెందిన లగడపాటి రామారావు, మేదరమెట్ల భీమేశ్వరరావు, ఆదినారాయణ, పరుశురాం తదితర 20 మంది గూండాలు కర్రలు, ఇనుప రాడ్లతో క్రాంతికుమార్‌ ఇంటిపై పడ్డారు. మహిళలను కూడా వదలకుండా విచక్షణా రహితంగా దాడి చేశారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ‘మీకెందుకురా ఎన్నికలు.. మేము చెప్పినా వినకుండా పోటీ చేస్తారా.. ఇప్పుడు మీకు దిక్కెవరో చూద్దాం’ అంటూ భయోత్పాతం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేశారనే కారణంతో ఇతర దళిత కుటుంబాలపై కూడా దాడి చేశారు.  

దళితులపై విరుచుకుపడిన సీఐ ప్రసాద్‌
గొడవ సమయంలో ఘటన స్థలానికి చేరుకున్న చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్‌ టీడీపీ నాయకుడు లగడపాటి రామారావు హుకుంతో దళితుల మీద పడ్డారు. ఇళ్లలోకి దూరి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలపై కూడా లాఠీ ఝుళిపించారు. ఆయన దెబ్బలతో భయాందోళనకు గురైన దళితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. గాయాలు బాధ పెడుతున్నా.. పిల్లా పాపలతో ఒంగోలుకు పారిపోయారు. అనంతరం బూదవాడలోని ఎల్లయ్య నగర్‌లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన దళితులంతా వెళ్లిపోవాలని బెదిరించారు.

పచ్చ గూండాలు, సీఐ దాడిలో పూనూరి క్రాంతి కుమార్, జండ్రాజుపల్లి ఇమ్మానియేలు, ఎనుబర్ల ప్రభుదాసు, జండ్రాజుపల్లి దానయ్య, రావినూతల లత, ఎనుబర్ల సంపూర్ణమ్మ, జండ్రాజుపల్లి కుమారి, గుంటూరు రమణ తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు బీ యేసుదానం, ఏ పొట్టిబాబు, మరో 15 మందికి గాయాలయ్యాయి. టీడీపీ మూకల హెచ్చరికతో సుమారు 200 మంది ఒంగోలుకు రావడంతో వైఎస్సార్‌సీపీ నేతలు స్థానిక అంబేడ్కర్‌ భవనంలో ఆశ్రయం కలి్పంచారు.

సీఐని విధుల నుంచి తప్పించాలి  
ఎన్నికల్లో పోటీ చేయడమే నేరమైనట్లు బూదవాడ దళితుల మీద పచ్చ గూండాలు దాడి చేస్తుంటే రక్షించాల్సిన చీమకుర్తి సీఐ ప్రసాద్‌.. వారికి వంత పాడుతూ రౌడీయిజం ప్రదర్శించడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా సీఐ తమ మీద దాడికి పాల్పడితే న్యాయం కోసం తామెక్కడికి పోవాలని ప్రశి్నంచారు. టీడీపీ నాయకుడి హుకుంతో తమ మీద దాడికి పాల్పడిన సీఐ ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని విధుల నుంచి తప్పించాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని, సీఐపై చర్యలు తీసుకోవాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున నేతృత్వంలో బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్‌సీపీకి ఓట్లేయడం నేరమా?
చంద్రబాబు పాలనలో దళితులకు ప్రాథమిక హక్కులు కూడా లేకుండా పోయాయని, రాష్ట్రంలోని ప్రజలు తమకు ఇష్టమొచ్చిన వారికి ఓట్లేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పచ్చ గూండాల దాడిలో గాయపడి ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత దళితులను ఆయన పరామర్శించారు. దాడిని తీవ్రంగా ఖండించారు.

పచ్చ గూండాల నుంచి దళితులను రక్షించాల్సిన పోలీసులు కూడా దాడికి పాల్పడడం దారు­ణమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అరాచకంపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున కూడా బాధితులను పరామర్శించారు. పోలీసులతో ఎన్నికలు నిర్వహించిన చంద్రబాబు.. తన పాలనలో దళితులకు రక్షణ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement