
దొడ్డిదారిన 508 ఎకరాల శ్రీ సంస్థానం భూములు కొట్టేసేందుకు గ‘లీజు’ స్కెచ్
టీడీపీ ‘పెద్దాయన’ పేరుతో తెలుగు తమ్ముళ్లకు బంపర్ ఆఫర్
యనమల ఇలాకాలో జన సమీకరణ పేరుతో భూపందేరానికి ఎత్తుగడ
మహానాడు సాకుతో ఇప్పటికే వేలం వాయిదా
పిఠాపురం రాజా ఆశయానికి పచ్చబ్యాచ్ తూట్లు
తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలప్పుడు జన సమీకరణకు తలా ఒక బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్, పచ్చనోట్లు ఇవ్వడం ఇంతవరకు చూశాం. కానీ, ఇప్పుడు ఏకంగా భూములే ఇచ్చేస్తామంటున్నారు. అధికారం చేతిలో ఉందనే తెగింపుతో మహానాడుకు వస్తే ఎకరం పొలం లీజుకిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆ పార్టీ నేతలు.
ఇప్పుడీ ఆఫర్ టీడీపీ నేతల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజా రావువేంకట కుమారమహీపతి సూర్యారావు బహద్దూర్ 513 ఎకరాలు దానం చేయగా.. దేవదాయశాఖ పరిధిలో ఉన్న ఈ విలువైన భూములను ఇప్పుడు అప్పనంగా దోచిపెట్టేందుకు టీడీపీ మహానాడును సాకుగా వాడుకుంటున్నారు.
వచ్చేవారం కడపలో జరిగే మహానాడు ఆహ్వాన కమిటీ సభ్యుల్లో ఒకరైన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సొంత ఇలాకా తునిలో తెలుగుదేశం నేతలు ఈ భూ పందేరానికి తెరతీశారు. మహానాడుకు సిద్ధపడి వచ్చేవారి పేరు, ఆధార్ నంబరు వంటి వాటిని సమన్వయం చేసేందుకు ఆరుగురు నేతలతో ఓ ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.
ఈ కమిటీ మహానాడుకు జనం తరలింపులో సమన్వయం చేసేందుకేనని పైకి చెబుతున్నా.. వాస్తవంగా కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ దేవస్థానానికి చెందిన 508 ఎకరాల సాగు భూములను వేలం వేయకుండా దొడ్డిదారిన తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టే ఎత్తుగడని తునికి చెందిన వారు స్పష్టంగా చెబుతున్నారు. –సాక్షి ప్రతినిధి, కాకినాడ
జనసమీకరణ కోసం ఎర..
అనంతరం.. టీడీపీ నేతలు అసలు కథ మొదలెట్టారు. టీడీపీ మహానాడుకు తుని నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మందినైనా తీసుకెళ్లాలన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. కానీ, వ్యవసాయ సీజన్ మొదలవుతుండడంతో జన సమీకరణ పెద్ద సమస్యగా మారింది. ఇంతలో ఆ పార్టీ పెద్దలకు ఓ ఐడియా తట్టింది. తమ అనుచరులైన రైతుల పేర్లతో వేలం జరిగినట్లుగా రికార్డులు తయారుచేయాలనేది ప్లాన్.
ఇందులో భాగంగా.. ప్రస్తుతం ఈ భూములు సాగుచేస్తున్న రైతులను వేలానికి రాకుండా అడ్డుకుని పోలీసు కేసులతో బెదరగొట్టాలని స్కెచ్‌వేశారు. ఈ క్రమంలో.. మహానాడుకు వస్తే ఎకరం భూమి లీజుకు ఇస్తామని పార్టీ పెద్దాయన చెప్పారని ద్వితీయశ్రేణి నేతలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పుడు మహానాడుకు వచ్చిన వారికే తిరిగొచ్చాక ఎకరం వంతున లీజుకిచ్చే బాధ్యత తమదంటూ తెలుగు తమ్ముళ్లు తొండంగి పరిసర ప్రాంతాల్లో జనాన్ని సమీకరించడం చర్చనీయాంశంగా మారింది.
సత్రం పిఠాపురంలో.. భూములు యనమల ఇలాకాలో..
నిజానికి.. శ్రీ సంస్థానం సత్రం పిఠాపురంలో ఉన్నప్పటికీ ఈ భూములు మాత్రం యనమల రామకృష్ణుడు సొంత ఇలాకా తొండంగి మండలంలో ఉన్నాయి. మూడేళ్లకోసారి ఈ భూములకు వేలం వేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. 538, 545, 553, 535, 623, 565, 690 సర్వే నంబర్లలోని ఈ భూముల లీజు గడువు ముగియడంతో ఇటీవల దేవదాయ శాఖ ఈఓ శ్రీరాములు పేరుతో వేలం ప్రకటన విడుదలైంది. దీంతో.. టీడీపీ నేతలు ఈ భూములపై వాలిపోయారు. ఈనెల 23 నుంచి 29 తేదీల మధ్య జరపాల్సిన వేలం ప్రక్రియ జరగకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిలిపివేశారు.
రంగంలోకి జనసేన..
ఈ భూముల వ్యవహారం జనసేన నేతల చెవిలో పడింది. శ్రీ సంస్థానం సత్రం కార్యాలయం, కార్యకలాపాలన్నీ పిఠాపురం కేంద్రంగానే జరుగుతున్నాయని.. సత్రం భూములను తుని నియోజకవర్గంలో వారి అనుచరులకు ధారాదత్తం చేయడానికి వారికి అధికారం ఎవరిచ్చారని జనసేన నేతలు రగిలిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సత్రం ఆదాయం కోల్పోతుంటే చూస్తూ ఊరుకుంటామా అని వారు మండిపడుతున్నారు.
కొందరి విజ్ఞప్తితోనే వేలం వాయిదా..
ఈనెల 23 నుంచి 29 వరకు మొత్తం 508 ఎకరాలకు వేలం వేస్తామని ప్రకటించాం. ఇంతలో.. టీడీపీ మహానాడుకు వెళ్తున్నందున రైతులు అందుబాటులో ఉండటంలేదని, వేలం వాయిదా వేయాలని కొందరు కోరడంతో వేలం వాయిదా వేశాం. ఎప్పుడు వేలం నిర్వహించేది వచ్చేనెల 6 తర్వాత ప్రకటిస్తాం. – నున్న శ్రీరాములు, కార్యనిర్వహణ అధికారి, శ్రీ సంస్థానం సత్రం గ్రూపు దేవాలయాలు, పిఠాపురం, కాకినాడ జిల్లా